Sat Dec 21 2024 08:26:44 GMT+0000 (Coordinated Universal Time)
Elections : మే పదోతేదీన టిక్కెట్లన్నీ హాంఫట్.. సంక్రాంతి సెలవుల తరహాలోనే...ఊళ్లకు వెళ్లాలంటే సొంత వాహనాలపైనే?
మే పదోతేదీన హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే ఆర్టీసీ, ప్రయివేటు బస్సుల్లో టిక్కెట్లన్నీ ముందుగానే బుక్ అయిపోయాయి.
మే పదోతేదీన హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే ఆర్టీసీ, ప్రయివేటు బస్సుల్లో టిక్కెట్లన్నీ ముందుగానే బుక్ అయిపోయాయి. రైళ్లలో కూడా ఆరోజు అడ్వాన్స్ గా రిజర్వేషన్ చేయించుకోవడంతో అన్ని చోట్లకు వెయిటింగ్ లిస్ట్ కనపడుతుంది. వెయిటింగ్ లిస్ట్ వందల సంఖ్యలో ఉండటంతో ఇక రైళ్లలో టిక్కెట్ కన్ఫర్మ్ కావడం కష్టమేనని చాలా మంది ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. అనేక మంది సొంత వాహనాలను బయటకు తీయాలని నిర్ణయించుకుంటున్నారు. దీంతో మే పదో తేదీన మాత్రం టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడు పోవడానికి ఏపీలో మే 13వ తేదీన శాసనసభ ఎన్నికలు జరుగుతుండటమే ప్రధాన కారణం.
పోలింగ్ జరుగుతుండటంతో...
అసలే వేసవి సెలవులు ఇవ్వడంతో పాటు ఎన్నికలు కూడా జరుగుతుండటంతో ఏపీలో ఓట్లు వేసేందుకు సొంతూళ్లకు బయలుదేరారు. కేవలం హైదరాబాద్ నగరం నుంచి మాత్రమే కాకుండా తెలంగాణలోని నిజామాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్, రామగుండం, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల నుంచి కూడా బస్సులన్నీ ఫుల్లు అయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు అనేక మంది ఉపాధి, ఉద్యోగాల కోసం తెలంగాణకు వచ్చి స్థిరపడ్డారు. అయితే వాళ్ల ఓట్లు మాత్రం ఏపీలోనే ఉన్నాయి. ఏపీలో అనేక సంక్షేమ పథకాలను అందుకుంటున్న వారు కూడా ఇక్కడే ఉంటున్నారు. కొందరయితే పింఛను ఇచ్చే మొదటి తేదీ వెళ్లి పింఛను తీసుకుని తిరిగి వస్తుంటారు.
ఓటుకు నగదు కూడా...
తెలంగాణలో కేవలం పార్లమెంటు ఎన్నికలు మాత్రమే కావడంతో పాటు ఇక్కడ ఓటు వేయాలని పెద్దగా ఆసక్తి లేదు. తమ సొంత ఊరికి వెళ్లి ఓటు వేయాలని చాలా మంది భావిస్తున్నారు. శ్రీకాకుళానికి జిల్లాకు చెందిన అనేక మంది ఉపాధి కోసం హైదరాబాద్ నగరంలో ఉన్నారు. ఏపీలో ఈసారి ఎన్నికలను అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓటుకు ఇచ్చే నగదు కూడా వేల రూపాయల్లోనే ఉంది. దీంతో అక్కడకు వెళితే తమకు మరింత లాభమని భావిస్తున్నారు. కొందరయితే ఒక గ్రూపుగా చేరి తమ పార్టీ నేతలకు సమాచారం ఇస్తున్నారు. ప్రయివేటు వాహనాలలో తమను తీసుకెళ్లాలని కూడా కోరుతున్నారు. ఆరోజు జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. టోల్గేట్ల వద్ద కూడా అత్యధిక సమయం పట్టే అవకాశముంది.
షేరింగ్ సీట్లు ఉన్నాయంటూ...
ఇలా ఏపీకి జనం క్యూ కట్టడానికి రెడీ అయిపోయారని ఆర్టీసీ, రైలు టిక్కెట్ల పరిస్థితిని చూస్తేనే అర్థమవుతుంది. డబ్బుకు డబ్బు.. సొంత ఊరిలో ఓటు వేశామన్న తృప్తితో పాటుగా గ్రామానికి వెళ్లి రావచ్చన్న కోరికతో చలో ఏపీ అంటూ బయలుదేరుతున్నారు. ప్రయివేటు వాహనానాలను కూడా ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. పోలింగ్ సోమవారం రావడంతో శని, ఆదివారాలు సెలవు దినం కావడంతో వరసగా మూడు రోజులు సెలవులు రావడంతో ఐటీ ఉద్యోగులు కూడా ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. మరికొందరు మే పదో తేదీన తాము వాహనంలో వెళుతున్నామని, షేరింగ్ కు వచ్చే వాళ్లు సంప్రదించాలంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్నారు. అలా మొత్తం మీద నగరంలో మే పది నుంచి 13వ తేదీ వరకూ సంక్రాంతిని తలపించేలా ఉంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
Next Story