Mon Dec 23 2024 13:25:40 GMT+0000 (Coordinated Universal Time)
Ap Elections : గాజుగ్లాసు విజయాన్ని ఏ మాత్రం దెబ్బతీస్తుంది... నిజంగా అదే జరిగితే.. ఎన్ని నియోజకవర్గాల్లో ఎఫెక్ట్ అంటే?
జనసేన గుర్తు గాజు గ్లాసు యాభై నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడం కూటమి అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారనుంది
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అంచనాలు అటు ఇటు మారుతున్నాయి. కూటమి బలంగా కొన్ని రోజులు కనిపిస్తుంటే.. మరొకవైపు వైసీపీ కూడా రెండోసారి అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉంది. అలా గెలుపుపై అంచనాలు మాత్రం అందడం లేదు. తెలంగాణలో ముందుగానే ఎన్నికల ఫలితాలు అర్థమయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అంచనాలకు ఎవరికీ అందని విధంగా ఉంది. అంటే ఓటరు తీర్పు ఎలా ఉంటుందన్నది మాత్రం ఆసక్తికరంగానే ఉంది. ఒకవైపు మూడు పార్టీలు కలవడంతో గెలుపు ఖచ్చితమేనని ఎన్డీఏ కూటమి భావిస్తుండగా, ఆ కూటమిని ప్రజలు నమ్మరని తమ గెలుపు గ్యారంటీ అని అధికార వైసీపీ చెబుతుంది. ఇలా గెలుపోటములు మాత్రం అంచనాలకు అందడం లేదు.
ఈవీఎంలు కావడంతో...
ఈ నేపథ్యంలో జనసేన గుర్తు అయిన గాజు గ్లాసు యాభై నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడం కూటమి అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారనుంది. గాజు గ్లాసు గుర్తు ఇప్పటికే జనంలోకి బలంగా వెళ్లింది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సినిమా హీరో కావడంతో ఆయన ప్రతి సభలో తమ గుర్తు గురించి చెబుతుండటంతో సులువుగా గాజు గ్లాసు గుర్తు జనానికి చేరువయింది. అయితే ఈసారి ఎన్నికల్లో అది ఎవరికి వరంగా మారనుందన్నది మాత్రం అర్ధం కాకుండా ఉంది. ఈవీఎంలు కావడంతో గుర్తును పోలిన గుర్తులు ఉంటేనే ఓటర్లు కన్ఫ్యూజన్ అవుతుంటారు. అలాంటిది సేమ్ సింబల్ మరో అభ్యర్థికి వస్తే ఇక కన్ఫ్యూజన్ కు లోనవ్వకుండా ఆ గుర్తుపైనే ఓటు వేసే అవకాశముందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనాలను బట్టి తెలుస్తోంది.
స్వతంత్ర అభ్యర్థులకు...
నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత రిటర్నింగ్ అధికారులు ఆంధ్రప్రదేశ్ లోని యాభై నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. యాభై నియోజకవర్గాలంటే ఎన్నికల్లో ఆషామాషీ కాదు. రెండు, మూడు వేలు ఓట్లు గాజు గ్లాసు గుర్తుపై పడినా దాని ప్రభావం గెలుపోటములపై చూపనుంది. మరో వైపు అతి తక్కువ మెజారిటీతో గెలిచే స్థానాలు కూడా అనేకం ఉన్నాయి. వెయ్యిలోపు మెజారిటీ వచ్చే నియోజకవర్గాల్లోనూ గాజుగ్లాసు గుర్తు తమను దెబ్బతీస్తుందేమోనన్న ఆందోళన కూటమి పార్టీ అభ్యర్థులలో వ్యక్తమవుతుంది. అందుకే తమ గుర్తు విషయంలో ఓటర్లకు తగిన రీతిలో ప్రచారం చేయాలని నిర్ణయించాయి.
ముఖ్యనేతలకు సంబంధించిన...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు కేటాయించింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోటీ చేస్తున్న చోట కూడా అదే జరిగింది. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి, గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్న భీమిలిలోనూ గాజు గ్లాసు గుర్తును కేటాయించడంతో కొంత ఇబ్బందిగా మారే అవకాశాలున్నాయి. గతఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో టీడీపీ ఓటమి పాలయిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనూ గాజు గ్లాసు గుర్తు స్వతంత్ర అభ్యర్థికి కేటాయించడం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. వీటన్నింటినీ అధిగమించి అక్కడ కూటమి అభ్యర్థులు విజయం వైపు పయనించడానికి ఇంకా శ్రమించాల్సి ఉంటుంది. అయినా గ్రామీణ ప్రాంతాల్లో కొంత ఇబ్బందులు తప్పవన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
Next Story