Sun Dec 22 2024 23:01:53 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : నా.. నా.. నా.. అంటే. బటన్ నొక్కేశారా.. బీసీలు ఇలా షాకిచ్చారేమిటి? పెద్ద బొక్కే పెట్టారుగా?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. వైఎస్ జగన్ పార్టీకి కేవలం పదకొండు అసెంబ్లీ స్థానాలే దక్కాయి.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. వైఎస్ జగన్ పార్టీకి కేవలం పదకొండు అసెంబ్లీ స్థానాలే దక్కాయి. జగన్ పార్టీ పెట్టిన తర్వాత ఇంత తక్కువ స్థాయిలో స్థానాలు దక్కడం ఇదే తొలిసారి. అయితే ఇది జగన్ కూడా ఊహించని ఫలితాలు. సంక్షేమ పథకాలు తనకు మరోసారి అధికారాన్ని అందిస్తాయని భావించిన ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు షాకిచ్చారు. ఈసారి ఎన్నికలు ఎంతో టైట్ ఫైట్ మధ్య జరిగాయని అంచనా వేశారు. ప్రత్యర్థి పార్టీలన్నీ కలసి కూటమిగా ఏర్పడటంతో కొన్ని సీట్లు తగ్గవచ్చని భావించారే తప్ప కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేేస్తారని ఎవరూ ఊహించలేదు. బహుశ జగన్ ఇప్పట్లో ఈ షాక్ నుంచి తేరుకునే అవకాశం ఉండకపోవచ్చు.
అధికారంలోకి వచ్చిన...
ప్రధానంగా జగన్ అధికారంలోకి వచ్చిన తొలి నాటి నుంచి బీసీ మంత్రాన్ని గట్టిగా పఠించారు. దశాబ్దాలుగా టీడీపీ వైపు ఉన్న ఓటు బ్యాంకును తన వైపునకు తిప్పుకునే ప్రయత్నంలో ఆయన సక్సెస్ అవ్వాలనుకున్నారు. 2019 ఎన్నికల్లో కొంత సక్సెస్ అయినట్లే కనిపించారు. కానీ 2024 లో మాత్రం ఆ ప్లాన్ తిరగబడింది. నా..ఎస్సీ.. నా.. ఎస్టీ... నా బీసీ.. నా మైనారిటీ అంటూ చేసిన నినాదమే ఆయనకు శాపంగా మారింది. బీసీలు వారితో కలపడాన్ని జీర్ణించుకోలేకపోయారని అనుకోవాలి. సహజంగా బీసీలు ఓసీల పక్కన నిలబడాలని భావిస్తారు. కానీ వారితో కలిపినందుకు వారి మనస్సుల్లో కొంత తేడా వచ్చి ఈసారి ఆ ఓట్లన్నీ టీడీపీకూటమి వైపు మళ్లాయని చెప్పాలి.
పదవుల విషయంలో...
నిజానికి జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్ని రకాలుగా బీసీలకు పెద్దపీట వేశారు. బీసీలకు సంబంధించి కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. అనేక మంది బీసీలకు పదవులు ఇచ్చారు. కేబినెట్ లో కూడా ఎక్కువ మంది బీసీలకు అవకాశం కల్పించారు. దీంతో పాటు రాజ్యసభ సీట్లలోనూ పక్క రాష్ట్రం నుంచి తెచ్చి ఆర్ కృష్ణయ్యను రాజ్యసభకు ఎంపిక చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్ రావుకు పెద్దల సభలో అవకాశం కల్పించారు. ఇక మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లకు కూడా రాజ్యసభకు పంపి తన ఉదారతను చాటుకున్నారు. ఎమ్మెల్సీ పదవుల విషయంలోనూ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
అభ్యర్థుల ఎంపికలోనూ...
ఎన్నికల్లో చూస్తే బీసీలకు అధిక స్థానాలు ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. అనేకచోట్ల కొత్తవారిని దించారు. బీసీ కార్డు ఉంటే చాలు బీఫారం ఇచ్చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు కూడా అధికంగా ఇచ్చారు. అలా బీసీలు వెన్నుముకగా భావించి ఆ ఓటు బ్యాంకుపై ఎక్కువగా జగన్ ఆశలు పెట్టుకున్నారు. సంక్షేమ పథకాలు అందించడంలోనూ వారికి అగ్రతాంబూలం ఇచ్చారు. వారిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. మిగిలిన కులాలు తనతో కలసి రాకపోయినా బీసీలు తన వెంట ఉంటే చాలునన్న ధోరణితో వ్యవహరించారు. కానీ అందులో చాలా మంది ఫ్యాన్ పార్టీ వైపు మొగ్గు చూపడానికి ఇష్టపడలేదని అర్థమవుతుంది. అంటే జగన్ పార్టీకి ఈసారి బీసీలు దూరమయ్యారనే అనుకోవాలి. ఏకారణాలతో వాళ్లు జగన్ ను వ్యతిరేకించారో తెలియదు కానీ మొత్తం మీద బీసీలు జగన్ పార్టీకి ఈ ఎన్నికల్లో పెద్ద బొక్కే పెట్టారన్న వ్యాఖ్యలు మాత్రం వినిపిస్తున్నాయి.
Next Story