Fri Nov 22 2024 15:51:49 GMT+0000 (Coordinated Universal Time)
Ap Elections : తెలుగుదేశం పార్టీ లెక్కలు ఇలా ఉన్నాయే.. అందుకే గెలుపు ధీమా అలా ఉందట
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. 4న కౌంటింగ్ కూడా జరగనుంది. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం గెలుపు పై ధీమాగా ఉంది
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. మరో నాలుగు రోజుల్లో కౌంటింగ్ కూడా జరగనుంది. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం గెలుపు పై ధీమాగా ఉంది. అధినేత చంద్రబాబు నుంచి కిందిస్థాయి నేతల వరకూ గెలుపు ఈసారి కూటమిదేనన్న ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ ఓటమి ఖాయమని నమ్ముతున్నారు. అందుకే టీడీపీ నేతలు ఎక్కువగా బెట్టింగ్ లు కూడా కట్టేందుకు సిద్ధపడుతున్నారు. వైసీపీలో అంత జోష్ కనిపించకపోవడంతో వారిని రెచ్చగొట్టేలా ప్రకటనలు కూడా బహిరంగంగానే చేస్తున్నారు. ఇప్పటికే కోట్ల రూపాయల డబ్బులు కూటమి గెలుస్తుందని భారీగా బెట్టింగ్ లు పెట్టారంటున్నారు.
పోలింగ్ శాతాన్ని...
పోలింగ్ శాతం పెరగడం ప్రభుత్వ వ్యతిరేకమేనని టీడీపీ నేతలు నమ్ముతున్నారు. అంత భారీ స్థాయిలో రాత్రి రెండు గంటల వరకూ వెయిట్ చేసి మరీ పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారంటే ఓటర్లలో జగన్ ప్రభుత్వంపై ఉన్న కసి కారణమేనని చెబుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని దించితే తప్ప తమ బతుకులు బాగుపడవన్న నిర్ణయానికి వచ్చినప్పుడే ఆ స్థాయిలో ఓటింగ్ జరుగుతుందని కూడా టీడీపీ అనుకూల విశ్లేషకులు వాదిస్తున్నారు. అందరూ పోలోమంటూ రావడం వెనక కూడా కూటమి పార్టీల ప్రమేయం కూడా ఉందని చెబుతున్నారు. ఉదయం ఆరు గంటల నుంచే వైసీపీ అనుకూల ఓటర్లను ఆ పార్టీ వాళ్లు పోలింగ్ కేంద్రాలకు తరలిస్తే.. మధ్యాహ్నం మూడు గంటల నుంచి కూటమి తరుపున పార్టీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రాలకు తీసుకు వచ్చారని తెలిసింది.
ఈ నాలుగు జిల్లాల్లో...
ఇక సహజంగా ప్రాంతాల వారీగా కూడా తెలుగుదేశం పార్టీ నేతలు లెక్కలు చెబుతున్నారు. రాయలసీమలో సహజంగా వైసీపీకి ఆధిక్యం వస్తుంది. దానికి టీడీపీ కూడా అంగీకరిస్తుంది. రాయలసీమలో వైసీపీకి వచ్చిన మెజారిటీని తాము కేవలం నాలుగు జిల్లాల్లో ఇక్కడ అధిగమిస్తామని చెబుతున్నారు. గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీకి వచ్చే సీట్లు, రాయలసీమలో వైసీీపీకి వచ్చే సీట్లకన్నా అధికంగా ఉంటాయన్న అంచనాలో ఉన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కలసి పోటీ చేసినందున తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపులతో పాటు మిగిలిన ఓటర్లందరూ ఏకమవ్వడంతో వన్ సైడ్ గా తమకు పోలయ్యాయని సైకిల్ పార్టీ నేతలు గట్టిగా చెబుతున్నారు. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అమరావతితో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూటమితోనే సాధ్యమని నమ్మిన ప్రజలు గంపగుత్తగా ఓట్లేశారని అంటున్నారు.
ఈ ప్రాంతాల్లో పైచేయి...
ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా గతంలో కన్నా మెరుగైన ఫలితాలు తాము సాధిస్తామని గట్టిగా చెబుతుంది తెలుగుదేశం పార్టీ. శ్రీకాకుళం, విశాఖపట్నం ిజిల్లాల్లో ప్రజలు తమకు అనుకూలంగా తీర్పు చెప్పారని గట్టిగా కూటమి నమ్ముతుంది. ఉత్తరాంధ్రలో ఒక్క విజయనగరం జిల్లా మినహా మిగిలిన రెండు జిల్లాల్లో తమకే ఎక్కువ స్థానాలు వస్తాయని చెబుతుంది. టీడీపీ స్ట్రాటజిస్టులు కూడా ఇదే అంచనాలను పార్టీ అధినేత చంద్రబాబుకు ఇచ్చినట్లు తెలిసింది. ఇక నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో గతంలో కంటే టీడీపీ మెరుగైన ఫలితాలు సాధిస్తామని, అందుకే ఈసారి కూటమి అధికారంలోకి రావడం ఖాయమని గట్టిగా చెబుతున్నారు. ఈ లెక్కలన్నీ పేపర్ల పై అయితే బాగుంటాయని వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయని మరోవైపు వైసీపీ కూడా అంతే ఆత్మవిశ్వాసంతో ఉంది. మరి ఏం జరుగుతుందన్నది తెలియాలంటే నాలుగు రోజులు ఆగాల్సిందే.
Next Story