Sun Dec 22 2024 23:36:42 GMT+0000 (Coordinated Universal Time)
Ap Elections: సెంటిమెంట్ వర్క్అవుట్ అయితే ఎవరికి లాభం.. జగన్ కా? చంద్రబాబుకా?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రజల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ప్రజా తీర్పు పై అంచనాలు కొనసాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రజల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. అయితే ప్రజా తీర్పు ఎలా ఉంటుందన్న దానిపై అంచనాలు కొనసాగుతున్నాయి. కూటమి ఏర్పాటయితే ఖచ్చితంగా గెలుస్తుందా? ఒకే పార్టీని రెండు దఫాలు ప్రజలు ఆదరిస్తారా? ఎన్నికల వేళ ఇప్పుడు జనంలో జరుగుతున్న చర్చ ఇదే. తెలంగాణలో ఒక సెంటిమెంట్ ఉంది. ఒకటి కాదు రెండు రకాల సెంటిమెంట్లు తెలంగాణలో కనిపించాయి. 1990వ దశకం నుంచి ఈ సెంటిమెంట్ కొనసాగుతూనే ఉంది. అలాగే మరొకటి కూడా తెలంగాణలో రాజకీయాల్లో బలంగా వినిపిస్తుంది. ఒకటి ఒకసారి గెలిచిన పార్టీ రెండు సార్లు అధికారంలోకి వస్తుంది. మరొకటి కూటములు పెద్దగా వర్క్ అవుట్ కావన్నది. ఈ రెండు తెలంగాణలో బలమైన సెంటిమెంట్లు. పొత్తులు సంగతి పక్కన పెడితే కూటములు మాత్రం పెద్దగా పనిచేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ఇది చూసిన వారికి తెలియంది కాదు.
రెండుసార్లు వరసగా గెలుస్తూ...
1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గెలిచిన టీడీపీ 1999 ఎన్నికల్లోనూ విజయం సాధించింది. 2004లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ 2014 వరకూ అధికారంలో కొనసాగింది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఈ సెంటిమెంట్ కంటిన్యూ అయింది. 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉద్యమ పార్టీ నాటి టీఆర్ఎస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. 2018 ఎన్నికల్లో మరొకసారి గెలిచింది. అప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లినా జనం మాత్రం కేసీఆర్ కు జై కొట్టారు. అంటే తెలంగాణలో ఒకసారి గెలిచిన పార్టీ పదేళ్ల పాటు అధికారంలో ఉండే విధంగా ప్రజలు తీర్పును చెబుతూ వస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఇక్కడ రెండు దఫాల తర్వాత బీఆర్ఎస్ ఓటమి పాలయి కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది.
ఒకేసారి కూటమి గెలిచి...
ఇక కూటములు కూడా వర్క్ అవుట్ కాలేదు. 2004లో టీఆర్ఎస్ తో వైఎస్ పొత్తు పెట్టుకున్నారు. కానీ అప్పుడు గెలిచారు. 2009లో అదే టీఆర్ఎస్, వామపక్షాలతో కలిపి చంద్రబాబు కూటమిని ఏర్పాటు చేశారు. అయినా అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఓడించలేకపోయారు. అదే సమయంలో 2018 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ను ఓడించడానికి మహాకూటమిని ఏర్పాటు చేశారు. ఇందులో కాంగ్రెస్ తో చంద్రబాబు చేతులు కలిపారు. అయినా నాటి ఎన్నికల్లో కేసీఆర్ ను మహాకూటమి ఓడించలేకపోయింది. ఇలా కూటమి ఏర్పడ్డ ఒక్కసారి మాత్రమే అంటే 2004లో మాత్రమే విజయం సాధించారు. ఆ తర్వాత కూటములను ప్రజలను ఆదరించలేదు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, రాష్ట్రం విభజన అయిన తర్వాత తెలంగాణలో కూటములకు జరిగిన పరాభవమేనని చెప్పాలి.
ఒకసారి గెలిచిన పార్టీ...
అదే విభజిత ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2014 ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది. అప్పుడు టీడీపీ, బీజేపీ ఎన్నికల్లో పోటీ చేయగా, జనసేన మాత్రం పోటీలోకి దిగకుండా మద్దతునిచ్చింది. ఆ ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ అయిన జనసేన, వామపక్షాలు, బీఎస్పీతో కూడిన కూటమి పరాజయం పాలయింది. మరొక సెంటిమెంట్ ఏంటంటే.. ఇక్కడ ఒకసారి గెలిచిన పార్టీ మరొకసారి అధికారంలోకి రాలేదు. 2014లో టీడీపీ విజయం సాధించగా, 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. అంటే ఏపీ ప్రజలు వరసగా రెండుసార్లు ఒకే పార్టీకి అధికారాన్ని కట్టబెట్టలేదు. మరి ఈసారి ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ, విభజిత ఏపీలో సెంటిమెంట్లు కొనసాగుతాయా? బ్రేక్ అవుతాయా? అన్నది వేచి చూడాల్సి ఉంది.
Next Story