Fri Dec 27 2024 11:27:00 GMT+0000 (Coordinated Universal Time)
Exit Polls : ఎగ్జిట్ పోల్స్ కోసం వెయిటింగా.. అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాల్సిందే
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ భారీ స్థాయిలో నమోదయింది. నేడు ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతున్నాయి
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ భారీ స్థాయిలో నమోదయింది. గతంలో కంటే అత్యధికంగా పోలింగ్ పర్సంటేజీ నమోదు కావడంతో పాటు మహిళలు అధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీ ఎన్నికలపై ఇప్పటి వరకూ ఎవరి అంచనాలు వారివి కనిపిస్తున్నాయి. ఏ పార్టీ ఆ పార్టీ తాము అధికారంలోకి వస్తుందని చెబుతుంది. ఇటు అధికార వైసీపీ గెలుపుపై ధీమాగా ఉంటే అటు ప్రతిపక్ష కూటమి కూడా అంతే స్థాయంలో అధికారం తమదేనన్న ధైర్యంగా ఉంది. చంద్రబాబు నుంచి ప్రధాని, అమిత్ షా వరకూ ఏపీలో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని చెబుతున్నారు.
జనం నాడి...
అయితే ఈరోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెల్లడవుతున్నాయి. ఆఖరి విడత పోలింగ్ ముగియనుండటంతో ఈరోజు సాయంత్రం 6 గంటలతర్వాత ఎగ్జిట్ పోల్స్ ను అధికారికంగా ప్రకటించే అవకాశముంది. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ కోసమే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మే 13వ తేదీన పోలింగ్ జరిగితే దాదాపు పద్దెనిమిది రోజుల పాటు అధికారిక ఫలితాలు కాకపోయినా అనధికారికంగా ఫలితాలు అంటే జనం నాడి తెలుసుకుని వాటిని ప్రసారం చేసేందుకు పెద్ద సెద్ద సంస్థలు రెడీ అవుతున్నాయి. జాతీయ మీడియా సంస్థలతో పాటు లోకల్ మీడియాతో పాటు అనేక సర్వే సంస్థలు కూడా ఈరోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ తో జనం ముందుకు రానున్నాయి.
కర్ణాటక, తెలంగాణలలో...
అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఒకలా ఉండవు. పోలింగ్ ఒకే రోజు జరగడంతో వివిధ ప్రాంతాల్లో ప్రజల మూడ్ ను తెలుసుకుని వాటిని పరిగణనలోకి తీసుకుని ఒక అంచనా మాత్రమే వేస్తారు. అందుకే రాజకీయ పార్టీలు వీటిని ఎగ్జాట్ పోల్స్ కాదని అంటుంటాయి. కానీ అంత తేలిగ్గా కొట్టిపారేయడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో అంటే కర్ణాటక, తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ చాలా వరకూ నిజమయ్యాయి. వారు చెప్పిన అంకెలకు దరిదాపుగా వచ్చాయి. ఎక్కువ సంస్థలు అంచనా వేసినట్లే కర్ణాటక, తెలంగాణాలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అందుకే చాలా మంది ఇటు రాజకీయ పార్టీ నేతలతో పాటు వాటి అభిమానులు, నేతల అనుచరులు, పార్టీ కార్యకర్తలు కూడా ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురు చూస్తున్నారు.
అనేక కారణాలు...
కానీ ఈసారి ఎక్కువ శాతం పోలింగ్ నమోదు కావడంతో పాటు అనేక రకాల ఫ్యాక్టర్లు ఏపీ ఎన్నికల్లో పనిచేశాయి. ఇటు జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా రూరల్ ఏరియాలో వ్యతిరేకత లేదు. అలాగే పట్టణ ప్రాంతాల్లో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు తయారైందంటారు. అయితే అర్బన్ ఏరియాలో తక్కువ ఓటింగ్ జరగడం, రూరల్ ఏరియాలో మహిళలు ఎక్కువగా పాల్గొనడం, సంక్షేమ పథకాలు పనిచేశాయా? లేక కులం పనిచేసిందా? ప్రభుత్వం పై వ్యతిరేకత ప్రజల్లో అంతర్లీనంగా ఉందా? అన్న విషయాలు మాత్రం ఎగ్జిట్ పోల్స్ కు కూడా అందకపోవచ్చన్న అంచనాలు వినపడుతున్నాయి. అయినా సరే ఫలితాలకు ఇంకా నాలుగు రోజులు సమయం ఉన్నప్పటికీ ముందుగా వచ్చే ఎగ్జిట్ పోల్స్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
Next Story