Mon Nov 18 2024 05:25:08 GMT+0000 (Coordinated Universal Time)
Ap Elections : బాబాయ్ .. ఈసారి ఎవరు గెలిచినా ఇంకొకరికి మాత్రం దబిడి దిబిడి తప్పదట
ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాజకీయాలను మించిపోయాయి. కక్షసాధింపు చర్యలు పీక్స్ కు చేరుకున్నాయి
నాటి నుంచే...
2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నేత జగన్ ను పురుగును చూసినట్లు చూడటం నాడు టీడీపీ నేతలు అలవాటుగా మార్చుకున్నారు. జగన్ పార్టీ నేతలను వేటాడారు. వెంటపడ్డారు. అక్రమ కేసులను బనాయించారు. అసెంబ్లీలో కూడా మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా.. అసభ్య పదజాలాన్ని నాడు వినియోగించారు. విశాఖలో జగన్ నాడు కాలు మోపడానికి కూడా అంగీకరించలేదు. విశాఖ విమానాశ్రయంలోనే నిలిపేశారు. వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు. రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారిపై కేసులు బనాయించారు. కొందరు నేతలపై అక్రమ కేసులు పెట్టారు.
చంద్రబాబును సయితం...
అలా మొదలయిన ఘర్షణలు 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే ఆ పార్టీ ప్రారంభించింది. ఇక కనిపించిన వారిని కనిపించినట్లు లోపలేసింది జగన్ ప్రభుత్వం. అలాగే అక్రమ కేసులు బనాయించింది. అనేక మంది ప్రభుత్వానికి భయపడి ఊళ్లొదిలి పారిపోయారంటే అతి శయోక్తి కాదు. చివరకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కూడా స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో 52 రోజులు పాటు రాజమండ్రి జైలులో ఉంచింది. ఇక మామూలు నేతల సంగతి వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇలా వైసీపీ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో టీడీపీ నేతలతో ఒక ఆటాడుకుందనే చెప్పాలి. అసలు కొన్నేళ్ల పాటు టీడీపీ నేతలు బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడానికే భయపడ్డారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అలా సాగింది వైసీపీ పాలన. అనేక మంది టీడీపీ సానుభూతిపరులు సొంతూళ్లను వదిలి పారిపోయారు. వ్యాపారాలను సయితం మూసేసుకున్నారు.
ఎవరు అధికారంలోకి వచ్చినా...
ఇప్పుడు ఏపీ ఎన్నికలు ముగిశాయి. ఎవరు గెలుస్తారన్నది చెప్పలేం. అంచనాలు అందడం లేదు. ఇటు అధికార పార్టీ వచ్చినా అదే ఒరవడి కొనసాగిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అదే టీడీపీ అధికారంలో వస్తే ఖచ్చితంగా బదులు తీర్చుకుంటుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, నారా లోకేష్ లు బహిరంగంగానే చెప్పారు. వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పడం చూస్తుంటే ఏపీలో రాజకీయ కక్షలు ఏవిధంగా జరుగుతాయోనన్న టెన్షన్ సామాన్యులను మాత్రం భయపెట్టేలా ఉంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మరొక పార్టీ నేతలు ఖచ్చితంగా కటకటాల పాలు కావాల్సిందే. లెక్క తప్పదన్నయ్యా.. అంటూ ఒకరి మీద ఒకరు సవాళ్లు విసురుకోవడం చూస్తుంటే ఏపీ రాజకీయాల్లో రేగిన కక్షలు, కార్పణ్యాలు ఇప్పట్లో చల్లారేలా కనిపించేటట్లు లేవు. మధ్యలో బలయ్యేది మాత్రం సామాన్యులే.
Next Story