Fri Nov 22 2024 09:20:17 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : షర్మిలకు సొంత బంధువులే సహకరించడం లేదా... మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే?
కడప జిల్లాలో వైఎస్ షర్మిలకు విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి.
కడప జిల్లాలో వైఎస్ షర్మిలకు విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. వైఎస్ కుటుంబీకులు మాత్రమే కాదు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సన్నిహిత సంబంధాలనున్న వారు ఎవరూ ఆమెకు సహకరించడం లేదని తెలుస్తోంది. షర్మిల కడప పార్లమెంటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు. అయితే ఆమె ఇటీవల కడపలో పర్యటించినప్పుడు కూడా వైఎస్ సన్నిహితులు, బంధువులు కూడా ఆమె దగ్గరకు కూడా రాలేదని చెబుతున్నారు. అందుకు ప్రధాన కారణం వైఎస్ షర్మిల జగన్ ను వ్యతిరేకించడమేనని అంటున్నారు. పైగా కడప పార్లమెంటు నుంచి పోటీ చేయడం కూడా ఆమె పెద్ద సాహసం చేశారనే చెప్పాలి. కడపలో ఉన్న వైఎస్ కుటుంబానికి దగ్గరగా ఉన్న వారు కూడా ఆమె దగ్గరకు రావడానికి కూడా ఇష్టపడటం లేదని తెలిసింది.
జగన్ పై విమర్శలను...
అది చూసిన వైఎస్ షర్మిల ఒకింత షాక్ కు గురయినట్లు తెలిసింది. గతంలో తాను కడప వచ్చినప్పుడు తన వెంట వచ్చి తనతో పాటు ఉండే కొందరు కుటుంబ సభ్యులు కూడా ఈసారి మాత్రం పూర్తిగా పక్కన పెట్టేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును సీీబీఐ ఛార్జిషీటులో నమోదు చేసిన కాంగ్రెస్ లో చేరడం వైఎస్ షర్మిల చేసిన తప్పిదమని వారు నేరుగానే చెబుతున్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల్లో ఎక్కువ మంది ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ పై నేరుగా విమర్శలు చేయడాన్ని కూడా వారు అంగీకరించడం లేదు. జగన్ వైఎస్ కుటుంబీకులతో పాటు ఆయనకు సన్నిహితంగా ఉన్న వారిని ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆప్యాయంగా పలకరిస్తూ ఉండటం ఇందుకు మరొక కారణంగా చెబుతున్నారు.
అందుబాటులో ఉండరని...
వైఎస్ షర్మిలకు దూరంగా ఉండటానికి మరో ప్రధాన కారణం.. జగన్ ఇక్కడ లేకున్నా ఆయన తన తరుపున నియమించిన వారు తమ బాగోగులు చూసుకుంటారంటున్నారు. కానీ షర్మిల గెలిచినా, ఓడినా కూడా తమకు అందుబాటులో ఉండరని, ఆమె హైదరాబాద్ కు వెళతారని, ఇక్కడ తమకు అండగా ఉండే వారెవరని వారు నేరుగానే ప్రశ్నిస్తున్నారని తెలిసింది. అందుకే షర్మిల వచ్చిన వైఎస్ కుమార్తెగా ఆమెను దగ్గరకు తీయాల్సిన సమయంలో ముఖం చాటేస్తున్నారని కొందరు చెబుతున్నారు. షర్మిలతో తాము మాట్లాడినట్లు జగన్ కు తెలిస్తే తాము ఎక్కడ దూరమవుతామోనన్న ఆందోళన వారిలో స్పష్టంగా కనిపిస్తుందని షర్మిల వెంట తిరిగే వారే అభిప్రాయపడుతున్నారు.
నామినేషన్ సందర్భంలో...
వైఎస్ షర్మిల నామినేషన్ వేసిన సందర్భంలో కూడా వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత మినహాయించి దగ్గర బంధువులు ఎవరూ ఆమె వెంట లేకోవడాన్ని కొందరు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కొందరిని నామినేషన్ పత్రాలపై ప్రతిపాదన సంతకాలు చేయాలన్నా దగ్గర బంధువులు కూడా ససేమిరా అన్నారంటే ఎంత దూరం పెడుతున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చంటున్నారు. దీంతో పాటు తాజాగా తనకు ప్రధాన ఏజెంట్ గా ఉండాలని కడపలోని తమ కుటుంబంలోని ఒక ముఖ్య వ్యక్తిని వైఎస్ షర్మిల సంప్రదించినా సున్నితంగా తిరస్కరించారని తెలిసింది. కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు మాత్రమే వైఎస్ షర్మిల వెంట ఉంటున్నారు. దీంతోనే కడపలో వైఎస్ షర్మిల ఎంత దూరమయ్యారో ఇంతకంటే వేరే చెప్పాల్సిన పనిలేదు. అందుకే విజయమ్మ కూడా ఇక్కడ ఉండలేక అమెరికా వెళ్లారంటున్నారు.
Next Story