Mon Dec 23 2024 15:13:46 GMT+0000 (Coordinated Universal Time)
Ap Elections : పోలింగ్ శాతం పెరిగితే ఎవరికి లాభం? ఆ పార్టీకి అనుకూలంగా మారుతుందా?
ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ప్రారంభమయిన వెంటేనే ఓటర్లు బారులు తీరారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు కూడా క్యూ లైన్ లో కనిపించారు
ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ప్రారంభమయిన వెంటేనే ఓటర్లు బారులు తీరారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు కూడా క్యూ లైన్ లో కనిపించారు. దీంతో పెద్దయెత్తున పోలింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదయం 9 గంటలకే పది శాతం పోలింగ్ నమోదయింది. పోలింగ్ శాతం ఎక్కువ జరిగితే ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అన్న చర్చ మాత్రం జోరుగా సాగుతుంది. ఎందుకంటే పోలింగ్ రేపు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఆరు గంటల వరకూ పోలింగ్ జరగనుంది. అయితే పోలింగ్ శాతం ఈసారి 80 శాతం దాటే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లోనే 78 శాతం వరకూ పోలింగ్ నమోదయింది. అయితే ఈసారి మరింత పెరిగే అవకాశముందని అంచనాలు వినిపడుతున్నాయి. వాతావరణం కూడా అనుకూలించడంతో పోలింగ్ శాతం మరింత పెరుగుతుందని ఎన్నికల అధికారులు కూడా భావిస్తున్నారు.
ఎవరికి నష్టం?
సహజంగా పోలింగ్ శాతం పెరిగితే అధికార పార్టీకి నష్టమన్న విశ్లేషణలు అనేక మంది నుంచి వినిపిస్తాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత వల్లనే ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ కట్టారంటారు. గత ఎన్నికల్లోనూ అదే జరిగింది. ఎక్కువ శాతం పోలింగ్ నమోదు కావడంతో అది అప్పట్లో ప్రతిపక్ష పార్టీకి వన్ సైడ్ గా మారింది. అధికార పార్టీకి వ్యతిరేకంగానే ఓటర్లు పోటెత్తారని గత ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పాయి. ఈ ప్రభుత్వం ఉండకూడదు.. మార్పు కోరిన వాళ్లంతా పోలింగ్ కేంద్రాలకు క్యూ కడతారన్న అంచనాలు ఒకరకంగా నిజమే అవుతాయి. రాజకీయ విశ్లేషకులు సయితం పోలింగ్ శాతాన్ని బట్టి ఈ పార్టీ గెలిచే అవకాశముందని అంచనాలు వేస్తూ వస్తుంటారు.
ఇటీవల జరిగిన...
అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం చూస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత పెద్దగా కనిపించడం లేదు. అదే మొన్న జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలకు నెల రోజుల ముందు నుంచే అప్పటి ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వినిపించింది. కనిపించింది. మౌత్ టాక్ కూడా బాగా పనిచేసింది. ఫలితంగా రూరల్ ప్రాంతంలో బాగా పోలయితే అది అధికార పార్టీకి నష్టం చేకూర్చగా, హైదరాబాద్ వంటి మహానగరంలో తక్కువ శాతం పోలయి ఇక్కడ ఉన్న అన్ని సీట్లను ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీకి దక్కించుకుంంది. అంటే పోలింగ్ శాతాన్ని బట్టి ఫలితాలపై ఒక అంచనా వేయడానికి వీలుంటుంది. అందులో వాస్తవం ఎంత శాతం ఉందని పక్కన పెడితే కొంత ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగానే పోలింగ్ ఎక్కువగా నమోదవుతుందని అనేక సార్లు, అనేక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బట్టి చూశాం.
ఈసారి మాత్రం...
కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్ లో అందుకు విరుద్ధంగా ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు. ప్రతిపక్షంపై పెద్దగా సానుకూలత కనిపించడం లేదు. అలాగని పోలోమంటూ ఓటర్లు ఏకపక్షంగా ఉంటారని చెప్పలేని పరిస్థిితి. ఏపీలో సామాజికవర్గాలు ప్రభావం చూపుతాయి. దీంతో ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత లేకపోవడంతో ఎక్కువ శాతం పోలింగ్ జరిగితే తమకే లాభమని, సంక్షేమపథకాలు ఆగిపోతాయని ఓటర్లు క్యూ కట్టి ఉంటారని అధికారపార్టీ చెప్పుకునే వీలుంది. అదే సమయంలో సహజంగా ప్రభుత్వంపై వ్యతిరేకత వల్లనే పెద్దయెత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారంటూ విపక్షాలు చెప్పుకునే అవకాశముంది. మొత్తం మీద ఈసారి ఏపీ ఎన్నికల ఫలితాలు అంచనాలు వేయలేని పరిస్థితికి వచ్చాయి. టగ్ ఆఫ్ వార్ గా జరుగుతున్నాయనే చెప్పాలి. ఏ పార్టీకి గెలుపు అంత సులువు కాదన్నది ప్రస్తుతం పోలింగ్ ముందు రోజు వినిపిస్తున్న టాక్.
Next Story