Sun Dec 22 2024 22:07:41 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : ఎవరికి ఓటేస్తారో తెలియదు కానీ.. ఓటేయడాని మాత్రం కదిలారు.. ఎవరి లక్ ఎలా ఉంటుందో?
ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలు మే 13వ తేదీన జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి ప్రజలు సొంత గ్రామాలకు బయలుదేరారు
ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలు మే 13వ తేదీన జరుగుతున్నాయి. ఇక తెలంగాణలోనూ పార్లమెంటు ఎన్నికలు అదే రోజు జరగనున్నాయి. దీంతో తమ సొంత ఊళ్లకు బయలుదేరారు నగరవాసులు. వరసగా మూడు రోజులు సెలవులు రావడంతో అందరూ బస్సులు, రైళ్లను మాత్రమే కాకుండా సొంత వాహనాలను కూడా ఆశ్రయించారు. దీంతో నిన్నటి నుంచే సొంతూళ్లకు పయనమయ్యారు. రైళ్లన్నీ కిటకిటలాడిపోతున్నాయి. శని, ఆదివారాలు సెలవు కావడంతో పాటు సోమవారం కూడా పోలింగ్ తేదీ రోజున అధికారికంగా సెలవు ప్రకటించడంతో ఇక సొంతూళ్లకు క్యూ కట్టారు. దీంతో బస్టాండ్ లన్నీ కిటకిటలాడుతున్నాయి.
ఏపీకి క్యూ కట్టిన ...
ఎక్కువ మంది ఓటర్లు ఆంధ్రప్రదేశ్ కు బయలుదేరి వెళ్లారు. తమ సొంతూళ్లకు వెళ్లి తమకు నచ్చిన వాళ్లకు ఓటేయడం కోసం పయనమయ్యారు. నిన్నటి నుంచే టోల్ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెలకొంది. ఆంధ్ర వైపునకు వెళ్లే గేట్లను అధిక సంఖ్యలో టోల్ ప్లాజాల వద్ద తెరిచి ఉంచారు. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు సొంత వాహనాల్లో చాలా మంది బయలుదేరారు. ఆర్టీసీ బస్సుల్లోనూ, రైళ్లలో సీట్లు దొరకకపోవడంతో కాస్త ఖర్చయినా సొంత వాహనాలలో వెళ్లేందుకు మాత్రమే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది.
అధిక ఛార్జీలతో...
ప్రయివేటు బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తుండటంతో సొంత వాహనాలే బెటర్ అంటూ పోలోమంటూ ఏపీకి బయలుదేరారు. దీంతో నగరం చాలా వరకూ నేడు ఖాళీ అయిందనే చెప్పాలి. రహదారులన్నీ వెలవెలబోతున్నాయి. ఈసారి ఏపీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరుగుతుండటంతో పార్టీల అభ్యర్థులు కూడా ఓటర్లను డబ్బులిచ్చి మరీ తమ ప్రాంతలకు రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. శ్రీకాకుళం నుంచి ఎక్కువగా వలస వచ్చి హైదరాబాద్ లో ఉపాధి పొందుతున్న వారికి ప్రత్యేక వాహనాలను సమకూర్చారు. కొందరికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ముప్పయి మందికి పైగా ఉంటే బస్సు ఐదారుగురు ఉంటే కార్లు వంటివి కూడా వారికి అభ్యర్థులే సమకూర్చారు.
ఈరోజు, రేపు కూడా...
ఈసారి ఏపీ ఎన్నికల్లో అన్ని పార్టీలూ.. అంటే ప్రధానంగా వైసీపీ, టీడీపీ భారీగా ఖర్చు పెడుతుండటంతో తమ ఓటును అక్కడే వేయాలని నిర్ణయించుకుని బయలుదేరారు. లాభానికి లాభం.. మూడు రోజులు సొంత ఊరిలో ఉన్నట్లుందన్న ఆనందం వెరసి సొంత గ్రామాలకు క్యూ కట్టారు. ఈరోజు, రేపు కూడా సొంతూళ్లకు బయలుదేరే వాళ్లు చాలా మంది ఉన్నారు. నిన్న ఐటీ ఉద్యోుగులు ఏపీ బాట పట్టగా, నేటి నుంచి రోజు వారీ పనిచేసే కార్మికులతో పాటు మిగిలిన వర్గాలు కూడా బయలుదేరి వెళుతున్నారు. ఇక సంపన్న వర్గాలు కూడా ఈసారి తమ ఓటు హక్కును ఏపీలో వినియోగించుకోవాలని నిర్ణయించుకోవడంతో నేషనల్ హైవేపై వాహనాలు కిటికిటలాడుతున్నాయి. హోటళ్లన్నీ కిక్కిరిసి పోతున్నాయి. మొత్తం మీద ఓట్ల జాతరకు ప్రయాణమయ్యారు నగర వాసులు. ఎవరిని గెలిపిస్తారన్నది జూన్ 4వ తేదీన తెలియనుంది.
Next Story