Mon Dec 23 2024 05:49:05 GMT+0000 (Coordinated Universal Time)
Ap BJP : ఒకటా - రెండా - మూడా - ఏపీలో బీజేపీ దక్కించుకునే అసెంబ్లీ సీట్లెన్ని..?
ఏపీలో బీజేపీ మొత్తం 10 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఎన్ని స్థానాల్లో గెలుపు అన్నదానిపై జోరుగా బెట్టింగ్ లు జరుగుతున్నాయి.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 10 స్థానాల్లో పోటీ చేస్తోంది. మరి వీటిలో ఎన్ని దక్కించుకుంటుంది? ఎలా పోరాటం చేస్తుంది? అనేది ఆసక్తిగా మారింది. పోటీ చేసే స్థానాల్లో ఎస్సీలకు రిజర్వ్ చేసినవి కూడా ఉండడం గమనార్హం. బద్వేల్, విజయవాడ వెస్ట్, జమ్మలమడుగు, అరకు, ఆదోని, విశాఖ నార్త్, కైకలూరు, ధర్మవరం, అనపర్తి, ఎచ్చెర్ల. ఈ పది స్థానాల్లోనూ బీజేపీ ఒకటి రెండు మినహా.. అన్ని చోట్లా బలమైన అభ్యర్థులనే నిలిపింది. ఆర్థికంగా, రాజకీయంగా కూడా.. వారు బలంగా ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఆ పది మంది గెలుపు ఉంటుందనేది ఆసక్తిగా మారింది.
బద్వేల్: కడప జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా సొంగా రోషన్‌కుమార్‌ను దింపారు. ఈయన ఆర్థికంగా బలంగా లేకపోవడం మైనస్. అయితే.. టీడీపీ తరపున ఉన్న కేడర్‌ను తనవైపు తిప్పుకొన్నారు. ఇది ఆయనకు ప్లస్ అవుతోంది. ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ బరిలో ఉన్నారు. ఈమెకు వైఎస్ అవినాష్ సహా పార్టీ నాయకులు అండ ఉంది. దీనికి తోడు మహిళ అనే సానుభూతి కూడా కలిసి వస్తోంది. దీంతో ఫైట్ టఫ్ అయినా.. గెలుపు సుధదేనని చెబుతున్నారు.
విజయవాడ వెస్ట్: అందరికీ కళ్లూ ఎక్కువగా పడిన నియోజకవర్గం విజయవాడ వెస్ట్. ఇక్కడ నుంచి సుజనా చౌదరి బీజేపీ తరఫున పోటీలో ఉన్నారు. కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్నారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇక్కడ టీడీపీ ఆయనకు కలిసి వస్తున్నా.. జనసేన తరఫున ప్రచారంలో ఎవరూ కనిపించడం లేదు. పైగా మైనారి టీ ఓట్లు ఈయనకు పడే అవకాశం లేదు. నియోజకవర్గానికి చెందిన నాయకుడు కాదు. దీంతో ఈ సీటు దక్కడం అంత ఈజీ అయితే కాదు.
జమ్మలమడుగు: ఆదినారాయణరెడ్డి బరిలో ఉన్నారు. ఈయనకు బలమైన ఓటు బ్యాంకు ఉండడం.. స్థానికంగా పోల్ మేనేజ్మెంట్పై పట్టు ఉండడంతో ఈయన గట్టి పోటీ ఇచ్చినా ఇది వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట కావడంతో ఆది గెలిస్తే సెన్షేషనే అవుతుంది.
అరకు: ఇది ఎస్టీ నియోజకవర్గం. మోడీ ప్రభావం ఇక్కడ ఉంటుందని బీజేపీ ఆశలు పెట్టుకుంది. పైగా టీడీపీకి కూడా బలమైన నియోజకవర్గం. పంగి రాజారావును బీజేపీ ఇక్కడ నిలబెట్టింది. బలమైన వైసీపీ ఓటు బ్యాంకును చిల్చితేనే తప్ప.. ఇక్కడ ఆయన విజయం దక్కించుకోవడం సాధ్యం కాదనే వాదన ఉంది.
ఆదోని: కర్నూలు జిల్లా ఆదోని నుంచి బీజేపీ పీవీ పార్థసారథికి అవకాశం కల్పించారు. ఈయన గెలుపుపై భారీగానే ఆశలు ఉన్నాయి. కానీ, వైసీపీ ఓటు బ్యాంకు స్ట్రాంగ్? ఇక్కడ ఓటరు మరోసారి వైసీపీ సాయిప్రసాద్ రెడ్డి వైపే ఉన్నారంటున్నారు.
విశాఖ నార్త్: మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును ఇక్కడ నిలబెట్టారు. ఆయనకు ఉన్న ఇమేజ్. మంచితనం.. ప్రజల్లో ఉన్న సానుభూతి వంటివి కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే వైసీపీ నుంచి గత ఎన్నికల్లో ఓడి ఐదేళ్ల పాటు ప్రజల్లో ఉన్న కెకె రాజుతో గట్టి పోటీ ఎదురవుతోంది. ఇక్కడ కొద్దిగా ఛాన్స్ అయితే ఉంది.
కైకలూరు: మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. గత 2014లో గెలిచిన ఆయన మంత్రిగా కూడా చేశారు. ఇది ఆయనకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. గెలిచే అవకాశం కూడా ఉంది. ఇది బీజేపీ గెలిచే సీట్లలో ఒకటిగా పేర్కొంటున్నారు.
ధర్మవరం: బీజేపీ ఫైర్ బ్రాండ్ సత్యకుమార్ యాదవ్ ఇక్కడ బరిలో ఉన్నారు. ఆయన గెలుపు కోసం. టీడీపీ కూడా ప్రయత్నిస్తోంది. కానీ, వైసీపీ ఇక్కడ బలంగా ఉండడం. బీజేపీలోనే వరదాపురం సూరి.. ప్రచారానికి దూరంగా ఉండడం వంటివి సత్యకుమార్‌కు మైనస్‌గా మారాయి. ఇక్కడ గెలవడం సాధ్యం కాకపోవచ్చనే అంచనాలు కూడా వస్తున్నాయి.
అనపర్తి: ఈ సీటును బీజేపీ దక్కించుకునే అవకాశం ఉంది. ఇక్కడి టీడీపీ నాయకుడు నల్లమిల్లి రామకృష్నారెడ్డికి చివరి నిమిషంలో బీజేపీ కండువాకప్పి.. టికెట్ ఇచ్చారు. ఇది బీజేపీకి మేలు చేసే అవకాశం ఉంది. సో.. ఇక్క డకూడా పార్టీ గెలిచే ఛాన్స్ ఉందంటున్నా ప్రస్తుతానికి గట్టి పోటీయే ఉంది.
ఎచ్చెర్ల: శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి ఎన్. ఈశ్వరరావుకు ఇచ్చారు. కానీ ఇక్కడ టీడీపీ నుంచి పెద్దగా సహకారం లేదనే టాక్ ఉంది. పైగా.. వైసీపీ బలంగా ఉండడంతో ఇక్కడ బీజేపీ గెలుపు గుర్రం ఎక్కే అవకాశం లేదు.
కట్ చేస్తే: మొత్తంగా 10 స్థానాల్లో మూడు చోట్ల గట్టిపోటీ ఇచ్చిన బీజేపీ ఒకటి రెండు సీట్లు దక్కించుకునే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Next Story