Sat Dec 21 2024 10:48:43 GMT+0000 (Coordinated Universal Time)
Sujana Choudhary : గెలిస్తే మాత్రం చరిత్ర సృష్టించినట్లే.. ఎందుకంటే ఇక్కడ ట్రాక్ రికార్డు చూస్తే మాత్రం?
బీజేపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఈ ఎన్నికల్లో సాహసానికి దిగారనే చెప్పాలి
బీజేపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఈ ఎన్నికల్లో సాహసానికి దిగారనే చెప్పాలి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సుజనా చౌదరి పోటీ చేయనున్నారు. పార్టీ ఇప్పటికే ఆయనకు టిక్కెట్ ప్రకటించింది. అయితే ఇది సుజనా చౌదరి అతి పెద్ద సాహసానికి దిగినట్లే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మూడు పార్టీలూ ఒక్కసారి కూడా గెలిచిన దాఖలాలు లేవు. తెలుగుదేశం పార్టీ ఒక్కసారి గెలిచింది కానీ అదీ 1983లో మాత్రమే. అంటే ఎన్టీఆర్ పార్టీని స్థాపించినప్పుడు మాత్రమే ఇక్కడ టీడీపీ గెలిచింది. 1983 తర్వాత తెలుగుదేశం పార్టీకి ఇక్కడ విజయం అనేది దొరకలేదు. అంటే నలభై ఏళ్లకు పైగానే పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ జెండా చూడటం లేదనే చెప్పాలి.
కమ్యునిస్టులు కూడా ఎక్కువే....
ప్రజారాజ్యం పార్టీ ఒకసారి గెలిచింది. 2009లో వెల్లంపల్లి శ్రీనివాస్ ఇక్కడి నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా గెలిచారు. అయితే ఇక్కడ అప్పుడు గెలవడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి చిరంజీవి ప్రజారాజ్యంపార్టీ పెట్టడం ఒక కారణమయితే... వెల్లంపల్లి శ్రీనివాస్ వైశ్య సామాజికవర్గానికి చెందిన నేత కావడం. ఆ నియోజకవర్గంలో వైశ్యులు ఎక్కువ ఓటర్లుండటం కూడా వెల్లంపల్లి గెలుపునకు ఒక కారణమయింది. ఇక టీడీపీ ఎప్పుడు కూడా పోటీ చేసే సాహసం కూడా చేయలేదు. ఎక్కువ సార్లు మిత్రపక్షాలకు టిక్కెట్ ఇస్తూ వస్తుంది. ఇక్కడ కమ్యునిస్టులు మాత్రం అనేకసార్లు గెలిచిన చరిత్ర ఉంది. అదే సమయంలో ముస్లిం సామాజికవర్గానికి చెందిన నేతలు ఎక్కువ మంది ఇక్కడ ఎమ్మెల్యేలయ్యారు.
ముస్లింలే ఎక్కువగా...
ఇక్కడ కాంగ్రెస్ నుంచి 1972లో అసిబ్ బాషా, 1989లో ఎంకే బేగ్, 1999లో కాంగ్రెస్, 20214లో వైసీపీ నుంచి జలీల్ ఖాన్ , 20024లో కమ్యునిస్టు పార్టీ అభ్యర్థిగా నాజర్ వలి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇప్పుడు వామపక్షాలు అక్కడి నుంచి పోటీ చేస్తున్నాయి. అంటే ఆ ఓటు బ్యాంకు సుజనాకు రావడం కష్టమే. టీడీపీ, జనసేన ఓటు బ్యాంకులు బీజేపీకి బదిలీ కావాల్సి ఉంది. వైశ్య సామాజికవర్గం బీజేపీ వైపు మొగ్గు చూపితే కొంత ఫలితం అనుకూలంగా ఉండనుంది. ఎందుకంటే 2014లో వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో ఆయనకు ఆ ఎన్నికల్లో అరవై వేలు ఓట్లు వచ్చాయి. కానీ అది ఆయన వైశ్య సామాజికవర్గం కావడంతోనే అన్ని ఓట్లు వచ్చాయన్న వాదనను కూడా ఎవరూ కొట్టిపారేయలేని పరిస్థితి. సుజనా చౌదరి పేరుకు బీజేపీ అయినా ఆయనను టీడీపీ నేతగానే ప్రజలు చూస్తారు.
తొలిసారి కమ్మ సామాజికవర్గం నుంచి...
మరొకటి ఇక్కడ కమ్మ సామాజికవర్గం నేతలు గెలిచిన దాఖలాలు కూడా లేవు. వైసీపీ ఇక్కడ ముస్లిం అభ్యర్థిని ప్రకటించింది. విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానికి కూడా బలమైన వర్గం ఉంది. ఆయన ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. విజయవాడలో టీడీపీ నుంచి తూర్పు నియోజకవర్గం, పెనమలూరు నుంచి కమ్మ సామాజికవర్గం నేతలే పోటీ చేస్తున్నారు. అదే సమయంలో బీజేపీ అయినా సుజనా "చౌదరి" కావడంతో ఆయనకు మిగిలిన సామాజికవర్గాలు ఏ మేరకు సహకరిస్తాయన్నది అనుమానంగానే ఉంది. అయితే పారిశ్రామిక వేత్త కావడం, పైగా కూటమి అభ్యర్థిగా ఉండటంతో కొంత ఎడ్జ్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయన్నది పరిశీలకుల అంచనా. అయితే ఫలితం వచ్చేంత వరకూ సుజనా గెలుపు గురించి ధీమాగా చెప్పుకోలేని పరిస్థితి మాత్రం పశ్చిమ నియోజకవర్గంలో కొనసాగుతుంది.
Next Story