Sun Nov 17 2024 12:23:49 GMT+0000 (Coordinated Universal Time)
Ap Elections : కౌంటింగ్ పై ఒకటే ఉత్కంఠ... వీధులన్నీ నిర్మానుష్యం.. అందరూ ఇళ్లలోనే ఉండి
మరికాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అసలు ఫలితాలు వెల్లడవుతున్నాయి.
సెలబ్రిటీల నుంచి రాజకీయ పార్టీ అభిమానులు.. సామాన్యులు సయితం ఈరోజు అందరూ ఇళ్లలోనే ఉండి కౌంటింగ్ సరళిని చూసేందుకు సిద్ధం అయ్యారు. ఇళ్లలో ఉండి టీవీల ద్వారా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న టెన్షన్ అందరిలోనూ ఉంది. మే 13వ తేదీన పోలింగ్ జరగ్గా ఇప్పటి వరకూ ఊపిరి బిగబట్టిన అందరూ నేడు ఫలితం తేలనుండటంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎవరు అధికారంలోకి రానున్నారన్నది నేడు తేలిపోనుంది. వైసీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా సంక్షేమ పథకాల వల్లనేనని అని చెప్పాలి. అదే కూటమి పవర్ లోకి వస్తే మాత్రం అది జగన్ ప్రభుత్వం వైఫల్యమేనని అనుకోవాల్సి ఉంటుంది.
ఈ ఎన్నిక మొత్తం...
ఈ ఎన్నిక మొత్తం జగన్ కావాలి - జగన్ పోవాలి అన్న పద్ధతిలోనే ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో అధిక శాతం పోలింగ్ నమోదయింది. గతంలో కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదయింది. ఎక్కువ మంది మహిళలు పోలింగ్ కేంద్రాల్లో రాత్రంతా నిలబడి ఓటు వేశారు. మహిళలు ఎవరి వైపు మొగ్గు చూపారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ పార్టీ ఒంటరిగా పోటీ చేయగా, టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలసి కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. అయితే పోలింగ్ అయిన తర్వాత ఇటీవల వెల్లడయిన ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఎటూ తేలకుండా ఉంది. ప్రజలను అయోమయానికి గురి చేసింది. గందరగోళంలోనే ఉంచింది.
ఎవరి వాదన వారిదే...
దీంతో మరికాసేపట్లో జరగనున్న కౌంటింగ్ అసలు ఫలితాన్ని తేల్చనుంది. సంక్షేమ పథకాల వల్లనే మహిళలు కసిగా వచ్చి ఓటు వేశారని అధికార వైసీపీ భావిస్తుంది. వాలంటీర్ల సహకారం వల్లనే ఇంత పెద్ద స్థాయిలో పోలింగ్ నమోదయిందని అనుకుంటుంది. అదే సమయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటేనే ఇంత పెద్ద స్థాయిలో పోలింగ్ కు వస్తారని కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇలా ఎవరికి వారే తమకు అనుకూలంగా పోలింగ్ సరళిని మలచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నువ్వా? నేనా? అన్నట్లు సాగిన ఈ ఎన్నికల్లో ఏ రీతిన ఎవరి వైపు జనం మొగ్గుచూపుతారన్నది మాత్రం ఆసక్తికరంగానే ఉంది. చూడాలి మరి..ఎవరిది అధికారం అన్నది మరికాసేపట్లో తేలనుంది.
Next Story