Sat Dec 21 2024 07:46:54 GMT+0000 (Coordinated Universal Time)
Pensions : పెన్షన్ నిర్ణయం.. ప్రతిపక్షాలకు శాపంగా మారనుందా?
పెన్షన్ల పంపిణీ మరోసారి జగన్ కు ప్లస్ గా మారనుంది. ఇంటికి తెచ్చే పింఛన్లు బ్యాంకుల్లో జమ చేస్తుండటం ఇందుకు కారణం
పెన్షన్ల పంపిణీ మరోసారి జగన్ కు ప్లస్ గా మారనుంది. ఇంటికి తెచ్చే పింఛన్లు బ్యాంకుల్లో జమ చేస్తుండటం ఇందుకు కారణమని చెప్పాలి. వాస్తవానికి ఫిబ్రవరి పింఛను వరకూ ఇంటికి తెచ్చి నగదును వాలంటీర్లు చెల్లించారు. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవ్వాతాతలు తమ పింఛను మొత్తాన్ని ఇంటివద్దనే అందుకున్నారు. కానీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో వాలంటీర్ల పంపిణీపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన ఫిర్యాదుతో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయవద్దని ఆదేశాలు జారీ చేయడంతో ఏప్రిల్ నెల పింఛను పంపిణీలో జాప్యం జరిగింది. జాప్యం జరగడానికి మార్చి నెలాఖరు అని అధికారులు చెప్పినా పింఛనుదారులు వినిపించుకోలేదు.
గ్రామ సచివాలయానికి...
మరోవైపు ఇంటి వద్దకు కాకుండా గ్రామ సచివాలయం వద్దకు వచ్చి పింఛన్లు తీసుకోవాలని ఆదేశించడంతో అనేక మంది ఈ ఎండలలో ఇబ్బంది పడ్డారు. పింఛన్లు తీసుకోవడానికి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 32 మంది వృద్ధులు మరణించడంతో అది రాజకీయంగా పెద్ద రచ్చగా మారింది. అధికార వైసీపీ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫిర్యాదు కారణంగానే వాలంటీర్ల చేత నగదు పంపిణీ జరగలేదని చెబుతుంది. అదే సమయంలో టీడీపీ సచివాలయం సిబ్బంది చేత పంపిణ ీచేయాలని, వైసీపీకి ప్రభుత్వ అధికారులు సహకరిస్తున్నారంటూ ఆరోపణలు చేసింది. రాజకీయ ఆరోపణలు ఒకరిపై ఒకరు చేసుకున్నప్పటికీ చివరకు ఏప్రిల్ నెల పింఛన్ల పంపిణీ జరిగిపోయింది.
మే నెల పింఛన్ల పంపిణీకి...
ఇప్పుడు మే నెల వచ్చింది. మే నెలలో ఇంటివద్దకు గాని, లేకుంటే నేరుగా బ్యాంకుల్లో జమ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో అరవై లక్షల మంది వరకూ పింఛను తీసుకునే వృద్ధులు, వికలాంగులు ఉన్నారు. వీరిలో దాదాపు నలబై ఐదు లక్షల మంది వరకూ బ్యాంకుల్లో జమ చేయాలని, మిగిలిన వారికి ఇళ్ల వద్దకు వెళ్లి ఇవ్వాలని అంటే బ్యాంకు అకౌంట్ లేని వారికి ఇంటివద్ద పింఛను చెల్లించాలని చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు దీనిపై కూడా విపక్షాలు అభ్యంతరం చెబుతున్నాయి. ఈ నెల పింఛను పంపిణీలో ఏ మాత్రం ఇబ్బంది తలెత్తినా అది తమ విజయంపై ప్రభావం చూపుతాయన్న ఆందోళనలో టీడీపీ ఉంది.
బ్యాంకుల్లో జమ చేస్తే...
బ్యాంకుల్లో నగదు జమ చేస్తే దానిని తీసుకెళ్లేందుకు బ్యాంకులకు వెళ్లాల్సి ఉంది. అది కూడా వృద్ధులకు సమస్యే. ఇంటి వద్దనే బ్యాంకులు ఉండవు. దానికి దూర ప్రాంతానికి వెళ్లి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు విపక్షాలు బ్యాంకుల్లో జమ చేయడాన్ని కూడా తప్పుపడుతున్నారు. నేరుగా ఇంటివద్దనే ఈ పింఛను చెల్లించాలని కోరుతున్నారు. కానీ బ్యాంక్ అకౌంట్లున్న వారికి మాత్రం బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అవ్వడం, పింఛను చెల్లింపునకు ఇంకా కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇది విపక్షాలకు ఇబ్బందికరంగా మారింది. ఈ విధానం కూడా వైసీపీకి వరంగా మారుతుందని భావిస్తున్నారు. మరి మే 1వ తేదీన పింఛన్ల పంపిణీ ఎలా జరుగుతుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Next Story