Fri Nov 15 2024 00:54:06 GMT+0000 (Coordinated Universal Time)
D.L. Ravindra Reddy : రెస్ట్ మోడ్ లోకి డీఎల్.. ఇక ఎవరు పట్టించుకుంటారయ్యా?
డీఎల్ రవీంద్రారెడ్డి యాక్టివ్ గా కనిపించారు. వైసీపీని ఓడించాల్సిందేనంటూ మీడియా సమావేశాలు పెట్టి మరీ పిలుపు నిచ్చారు.
ఎన్నికల నామినేషన్ల ముందు వరకూ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి యాక్టివ్ గా కనిపించారు. అధికార వైసీపీని ఓడించాల్సిందేనంటూ ఆయన మీడియా సమావేశాలు పెట్టి మరీ పిలుపు నిచ్చారు. జగన్ ను ఓడించి తీరుతానని శపథం చేశారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మాత్రం ఆయన సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. డీఎల్ ను ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలూ పట్టించుకోలేదు. అసలు ఆయనంటూ ఒకరున్నారా? అన్న అనుమానం కూడా కలుగుతుంది. డీఎల్ లో రాజకీయంగా ప్రభావం చూపేంత శక్తి తగ్గిందా? లేక ఆయనను పార్టీలోకి తెచ్చుకుని లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకని భావిస్తున్నారా? అన్నది మాత్రం అర్థం కాకుండా ఉంది.
గత ఎన్నికలకు ముందు...
డీఎల్ రవీంద్రారెడ్డి గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అయితే ఆయనకు ఎలాంటి పదవి లభించలేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో సీటు దక్కకపోయినా కనీసం ఎమ్మెల్సీ సీటు అయినా ఇస్తుందని భావించారు. కానీ వైసీీపీ అధినాయకత్వం నాలుగేళ్లపాటు ఆయనను పట్టించుకోలేదు. దీంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. ఆయన వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ పార్టీ నుంచి బయటకు వచ్చారు. జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. ఆయన టీడీపీలో చేరతారన్న ప్రచారం కూడా కొంతకాలం పాటు జరిగింది. ఆయన ఉండవల్లి వెళ్లి చంద్రబాబును కలిసి పార్టీలో చేరతారని కూడా అన్నారు. కానీ ఆయన వెళ్లలేదు. వీళ్లు పిలవలేదు. దీంతో ఆయనను ఎవరూ పట్టించుకోనట్లయింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో...
డీఎల్ రవీంద్రారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన నేత. మైదుకూరు నుంచి ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా పనిచేశారు. 2009లో ఆయన చివరి సారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితేరాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన రాజకీయంగా తెరమరుగయ్యారు. ఆయన ఇప్పడు అవుట్ డేటెట్ లీడర్ గానే పార్టీ అధినేతలు భావించే డీఎల్ ను పార్టీలు లైట్ గా తీసుకున్నాయనే భావించాలి. సీనియర్ లీడర్లందరూ ఒక్కొక్కరూ రాజకీయంగా కనుమరుగయి పోతున్నారు. జనరేషన్లు మారిపోయిన సమయంలో సీనియర్లు కూడా తమంతట తాము రాజకీయాల నుంచి తప్పుకోవడమే బెటర్ అన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
టీడీపీకి మద్దతు ప్రకటించినా...
ఇప్పుడు టీడీపీలో ఆయన పేరు ఎక్కడా వినిపించడం లేదు. దీంతో డీఎల్ రాజకీయం ఇక ముగిసినట్లేనని అనుకోవాల్సి ఉంటుంది. టీడీపీ కూడా పట్టించుకోకపోవడంతో డీఎల్ రాజకీయంగా స్వచ్ఛంద పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించారు. మద్దతు ప్రకటించినా పెద్దగా యాక్టివ్ గా లేరు. ఏ పార్టీ డీఎల్ ను చేర్చుకోకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. అందుకే డీఎల్ ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు. భవిష్యత్ లో ఆయన రాజకీయాలకు మరింత దూరం అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే డీఎల్ పేరును ఇక మైదుకూరు నుంచే కాకుండా ఏపీ రాజకీయాల నుంచి పార్టీ నేతలు డిలీట్ చేస్తున్నట్లే కనపడుతుంది.
Next Story