Sun Dec 22 2024 21:35:16 GMT+0000 (Coordinated Universal Time)
Pensions : ఏంది సామీ.. ఇలా అయిపోయింది.. పింఛను కొంప కొల్లేరు చేస్తుందా.. ఏంది?
ఏప్రిల్ నెల పింఛను గ్రామ సచివాలయంలో తీసుకోవాలంటే ఇబ్బండి పడిన వృద్ధులు.. ఈసారి మే నెలలో కూడా అవస్థలు పడుతున్నారు
అనుకున్నట్లే అయింది. ఏప్రిల్ నెల పింఛను గ్రామ సచివాలయంలో తీసుకోవాలంటే ఇబ్బండి పడిన వృద్ధులు.. ఈసారి మే నెలలో కూడా అవస్థలు పడుతున్నారు. పింఛను అందుకోవడానికి బ్యాంకులకు వెళ్లాల్సి రావడంతో వృద్ధులు, వికలాంగులు పడుతున్న ఇబ్బందులు టీడీపీకి దూరం చేస్తాయోమోనన్న ఆందోళన ఆ పార్టీలో నెలకొంది. మార్చి నెల వరకూ ఇంటి వద్దకే వచ్చి నగదును ఇచ్చే వాలంటీర్లను వద్దంటూ ఎన్నికల కమిషన్ కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిర్యాదు చేయడంతో వాలంటీర్ల చేత పంపిణీ చేయవద్దని ఎన్నికల సంఘం చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. అదే సమయంలో బ్యాంకు అకౌంట్లలో వేయాలని సూచించింది. అకౌంట్లు లేని వారికి ఇళ్లవద్దకే పింఛను పంపిణీచేయాలని నిర్ణయించింది.
బ్యాంకులకు వెళ్లాలన్నా...
ఏప్రిల్ నెలలో పింఛను తీసుకోవడానికి సచివాలయానికి వెళ్లిన వృద్ధులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఏపీ వ్యాప్తంగా ఎండల దెబ్బకు 32 మంది మరణించారని కూడా లెక్కలు చెబుతున్నారు. అయితే ఈసారి ప్రభుత్వం సచివాలయాల్లో కాకుండా బ్యాంకు అకౌంట్లలో నేరుగా జమ చేయాలని నిర్ణయించింది. అంటే నాలుగున్నర లక్షల మందికి బ్యాంకు అకౌంట్లు ఉండటంతో వారి బ్యాంకు అకౌంట్ లోకి ఈ నెల ఒకటోతేదీన పింఛను వేశారు. అయితే దానిని తీసుకోవాలంటే గ్రామాల నుంచి బ్యాంకులకు రావాల్సి వస్తుంది. బ్యాంకుల్లో నగదు తీసుకోవడం అంత ఆషామాషీ కాదు. బ్యాంకు సిబ్బంది వేసే కొర్రీలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఒక్కొక్క పింఛనుదారుడు బ్యాంకు నుంచి నగదు తీసుకోవడానికి గంటల తరబడి సమయం పడుతుండటంతో పాటు సిబ్బంది వేసే ప్రశ్నలు కూడా చికాకు కల్గిస్తున్నాయి.
మరో పది రోజుల్లో...
దీంతో గంటల తరబడి బ్యాంకుల వద్ద నిరీక్షించాల్సి వస్తుంది. అందుకనే మే 13వ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే ఎన్నికలకు ఇంకా పది రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నెల పింఛను అందుకోవడానికి కష్టాలు తప్పకపోవడంతో లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పింఛన్ల వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుము కుంది. చంద్రబాబు కారణంగానే పింఛను నేరుగా ఇంటికి అందించడం లేదన్న ప్రచారాన్ని వైసీపీ నేతలు ప్రజల్లోకి బలంగా తీసుకెళుతున్నారు. తమకు పింఛను పంపిణీలో ఏ మాత్రం సంబంధం లేదని చంద్రబాబు తో పాటు టీడీపీ నేతలు చెబుతున్నప్పటికీ దానిని నమ్మేవారు ఎంత మంది అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. పింఛన్ వ్యవహారం ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో టీడీపీ మెడకు చుట్టుకునేలా ఉందన్న కామెంట్స్ అయితే బాగానే వినిపిస్తున్నాయి.
పింఛను మొత్తాన్ని పెంచినా...
చంద్రబాబు తన మ్యానిఫేస్టోలో పింఛనును నాలుగు వేల రూపాయలు ఇస్తానని ప్రకటించారు. అంతే కాదు ఏప్రిల్ నెల నుంచే పెంచిన మొత్తంతో పాటు జులై నెలలో ఏడు నెలలు ఇస్తామని చెప్పారు. కానీ జగన్ మాత్రం తన మ్యానిఫేస్టోలో తాము అధికారంలోకి వస్తే మూడున్నర వేలకు పెంచుతామని చెప్పారు. కానీ పింఛను మొత్తం అందడంలో ఆలస్యం కావడంతో ఇప్పుడు పెంచిన ప్రయోజనం కూడా టీడీపీకి దక్కుతుందా? అనే అనుమానం కలుగుతుంది. వృద్ధులు, వికలాంగులు మండుటెండల్లో బ్యాంకులకు వెళ్లాలంటే కష్టంగా మారడంతో ఆ ప్రభావం సైకిల్ పార్టీపై పడుతుందేమోనన్న ఆందోళన మాత్రం తెలుగు తమ్ముళ్లలో ఎక్కువగానే ఉంది. కానీ ఈ పాపం మాది కాదంటున్నా.. ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోరన్నది మాత్రం ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రమే తెలియనుంది.
Next Story