Volunteers : వాలంటీర్లు దెబ్బేస్తారా? పక్కన పెట్టడం వల్ల నష్టం వారికేనా?
వాలంటీర్లు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించడం రాజకీయ రగడగా మారింది
ఒక వ్యవస్థ హిట్ అయితే.. దానిని ప్రజలు ఆదరిస్తారు. లేకుంటే రాజకీయంగా అమలు చేసిన ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. కానీ ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ సక్సెస్ అయింది. ఎంతగా అంటే.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వాలంటీర్ల వ్యవస్థను జనం స్వాగతించారు. ఇప్పుడు ఎన్నికల నిబంధనలతో పక్కన పెట్టడంతో రాజకీయంగా ఎవరికి నష్టం అనే చర్చ ఏపీ పాలిటిక్స్ లో జోరుగా సాగుతుంది. వాలంటీర్ల వ్యవస్థను తొలి నుంచి తప్పుపడుతున్న విపక్షాలు ఇప్పడు స్వరం మార్చాయి. పింఛను ఇంటి వద్దనే పంపిణీ చేయాలని, అధికార పార్టీ కావాలనే తమను ప్రజల్లో పలచన చేసేందుకు ఇలా వ్యవహరిస్తుందని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. టీడీపీ కారణంగానే వాలంటీర్ల వ్యవస్థపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతోనే వారు విధులకు దూరంగా ఉండాల్సి వచ్చిందని వైసీపీ చెబుతోంది. కానీ బాధపడేది జనం. వారిలో ఎక్కువ మంది మాత్రం వాలంటీర్లను పక్కన పెట్టడాన్ని తప్పుపడుతున్నారు. ఏప్రిల్ నెల సరే.. మే నెలలో పోలింగ్ జరగనున్న నెలలో పింఛన్లు ఎలా పంపిణీ చేస్తారన్న టెన్షన్ మాత్రం విపక్ష పార్టీల్లో నెలకొంది.