Mon Dec 23 2024 18:29:59 GMT+0000 (Coordinated Universal Time)
Ap Elections : విశాఖపట్నం.. విజయవాడకు ఆరోజు టిక్కెట్లన్నీ బుక్ అయిపోయాయి.. విమానాలకు పెరిగిన డిమాండ్
జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. ఆరోజో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి
జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. ఆరోజో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. ఎవరిది అధికారమన్నది తెలియనుంది. అయితే ఇప్పటికే రెండు ప్రధాన పార్టీలు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంపై డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. వైసీపీ అధికారంలోకి వస్తే జూన్ 9వ తేదీన విశాఖలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని ఇప్పటికే ఆ పార్టీ నేతలు ప్రకటించారు. తాము ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిచి తీరతామన్న ఆత్మవిశ్వాసంతో ఆ పార్టీ నేతలున్నారు. అందుకే ముహూర్తం కూడా ఫిక్స్ చేసి మరీ జగన్ ప్రమాణస్వీకారం విశాఖలోనే జరుగుతుందని ప్రకటించడంతో వైసీీపీ క్యాడర్ లో ఉత్సాహం నెలకొంది. విమానం, రైళ్లు టిక్కెట్లు దొరకని వాళ్లు సొంత వాహనాలలో విశాఖకు బయలుదేరేందుకు సిద్ధమవుతున్నారు. కడప విమానాశ్రయం నుంచి ఆరోజు ఒక్క ఫ్లైట్ లో ఒక్క టిక్కెట్ కూడా లేదు.
కూటమి కూడా...
మరోవైపు కూటమి కూడా తమ గెలుపు గ్యారంటీ అని చెబుతుంది. 130 స్థానాలకు పైగానే తాము సాధించి అధికారంలోకి వస్తామని చెబుతుంది. పెరిగిన ఓట్ల శాతం తమకు అనుకూలంగా మారుతుందని, ప్రభుత్వ వ్యతిరేకతతో తాము అధికారంలోకి వస్తున్నామని కూటమి పార్టీ నేతలు గట్టిగా చెబుతున్నారు. కూటమి గెలుస్తుందని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు జూన్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్నారని అన్నారు. అయితే ఎక్కడ అన్నది మాత్రం చెప్పకపోయినా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తే అమరావతిలోనే చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆయన తన కలల రాజధాని ప్రాంతంలోనే విభజిత ఆంధ్రప్రదేశ్ కు రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టాలని భావిస్తున్నారని చెబుతున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడానికి ముందుగానే టిక్కెట్లను బుక్ చేసకున్నాు.
ప్రమాణ స్వీకారం కోసం...
ఈ పరిస్థితుల్లో జూన్ 8వ తేదీన హైదరాబాద్ నుంచి విజయవాడకు, విశాఖపట్నానికి మొత్తం విమాన టిక్కెట్లు హాట్ కేకుల్లా బుక్ అయిపోయాయి. దీంతో పాటు రైళ్లలో కూడా కొందరు బుక్ చేసుకుంటున్నారు. ఇప్పటికే విశాఖ, విజయవాడల్లో అన్ని హోటల్ గదులు ముందుగానే జూన్ 8వ తేదీ నుంచి అడ్వాన్స్ బుక్ అయిపోయాయి. ఒక్క రూమ్ కూడా ఖాళీ లేదని హోటల్ యజమానులు చెబుతున్నారు. స్టార్ హోటళ్ల దగ్గర నుంచి సాధారణ హోటల్స్ లో గదులన్నీ జూన్ 8వ తేదీన లాక్ అయిపోయాయని చెబుతున్నారు. చంద్రబాబు, జగన్ లు ప్రస్తుతం విదేశీ పర్యటనల్లో ఉన్నారు. అయితే జూన్ 9వ తేదీన ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారన్నది జూన్ 4వ తేదీన తెలియనుంది. అయినా సరే ఇలా ఫ్లైట్ టిక్కెట్లు.. హోటల్ రూమ్ లు విశాఖ, విజయవాడల్లో బుక్ కావడంతో ఎవరిది గెలుపు అన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story