Sun Dec 22 2024 11:54:13 GMT+0000 (Coordinated Universal Time)
Ap Elections : ఇదేమి చిత్రం భయ్యా.. ఇన్ని ఓట్లు సాధించినా ఇన్ని సీట్లేనా?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కూటమి అధికారంలోకి వచ్చింది. త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కూటమి అధికారంలోకి వచ్చింది. త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. 45.60 శాతం ఓట్లు వచ్చిన టీడీపీకి 134 స్థానాలు దక్కాయి. 39.37 శాతం ఓట్లు వచ్చిన వైసీపీకి దక్కిన సీట్లు కేవలం పదకొండు మాత్రమే. ఓట్ల శాతం తక్కువగా ఉన్నా సీట్ల సంఖ్య న చూసుకుంటే మాత్రం ఎవరైనా ఆశ్చర్య పోక తప్పదు. ఇలాంటి పరిస్థితి ఎన్నికల్లో సహజమే అయినా సీట్లు.. శాతంపై మాత్రం ప్రతిసారీ చర్చ జరుగుతుంది.
ఓట్ల తేడా...
ఇక తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికల్లో 1, 53, 84, 576 ఓట్లు పడ్డాయి. అయితే టీడీపీకి వచ్చిన సీట్లు 134. అలాగే వైసీపీకి ఈఎన్నికల్లో పడిన ఓట్లు 1,32,84,134 ఓట్లు. వైసీపీకి వచ్చింది కేవలం పదకొండు స్థానాలు మాత్రమే. రెండు ప్రధాన పార్టీల మధ్య ఓట్ల తేడా 21 లక్షలు మాత్రమే. ఇక జనసేన పార్టీకి 8.53 శాతం ఓట్లు పడ్డాయి. అంటే ఈ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేనకు వచ్చిన ఓట్లు 28,79,555 ఓట్లు మాత్రమే. అయితే సీట్లు మాత్రం 21అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు స్థానాలు దక్కి ప్రధాన ప్రతిపక్షంగా మారింది.
తక్కువఓట్లు పడినా...
కూటమిలోని మరో భాగస్వామ్య పార్టీ బీజేపీకి పడిన ఓట్లు 9.53,977 మాత్రమే. బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం 2.83 శాతం మాత్రమే. బీజేపీ ఈ ఎన్నికల్లో పది అసెంబ్లీ నియోజకవర్గాలు, ఆరు పార్లమెంటు స్థానాల్లో పోటీచేసింది. అయితే ఎనిమిది అసెంబ్లీ స్థానాలలోనూ, మూడు పార్లమెంటు స్థానాల్లోనూ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి మొత్తం 5.80,613 ఓట్లు పడ్డాయి. ఆ పార్టీకి 1.73 శాతం ఓట్లు పడ్డాయి. కానీ ఒక్కస్థానంలోనూ గెలవలేదు. ఇలా ఓట్లు తక్కువ వచ్చినా ఎక్కువ సీట్లు వచ్చాయి. ఎక్కువ ఓట్లు పడినా తక్కువ సీట్లు దక్కాయి. అదే ఈ ఎన్నికల్లో విచిత్రం.
Next Story