Sat Dec 21 2024 08:04:23 GMT+0000 (Coordinated Universal Time)
TDP : తమ్ముళ్లూ ఇక్కడ వెయిటింగ్... మ్యానిఫేస్టో రెడీ..ముహూర్తం కోసమేనట
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మ్యానిఫేస్టో విడుదలకు అంతా సిద్ధం చేస్తున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత మ్యానిఫేస్టో విడుదలకు అంతా సిద్ధం చేస్తున్నారు. అయితే ఉమ్మడి మ్యానిఫేస్టోను మోదీ, పవన్, చంద్రబాబు కలసి విడుదల చేయాలన్న ఉద్దేశ్యంలో ఉన్నారు. మోదీ చేతుల మీదుగా ఏపీలో ఎన్నికల మ్యానిఫేస్టోను విడుదల చేయడానికి అంతా రెడీ చేసినట్లు సమాచారం. మోదీ విడుదల చేస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ప్రజల్లో కూడా నమ్మకం అనేది ఏర్పడుతుందన్న భావనలో టీడీపీ చీఫ్ ఉన్నారని తెలిసింది. అందుకు మోడీ రాష్ట్ర పర్యటన కోసం తేదీల కోసం వెయిట్ చేస్తున్నారు. మోదీ ఈ నెలలో అనకాపల్లి లేదా రాజమండ్రి లో జరిగే బహిరంగ సభకు వస్తారని చెబుతున్నారు. అక్కడ మ్యానిఫేస్టోను విడుదల చేసే అవకాశముందని తెలిసింది.
మూడు పార్టీలతో చర్చించి...
ఇప్పటికే మ్యానిఫేస్టో పై జనసేన, బీజేపీ నేతలతో చర్చించారని తెలిసింది. గతంలో చంద్రబాబు రాజమండ్రిలో జరిగిన మహానాడు కార్యక్రమంలో సూపర్ సిక్స్ పేరుతో తొలి దశ మ్యానిఫేస్టోను విడుదల చేశారు. యువత, మహిళలు, రైతులు ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా దానిని ప్రజల్లోకి తీసుకెళ్లారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, తల్లికి వందనం కార్యక్రమం కింద ఒక్కొక్కరికి పదిహేను వేలు, రైతుకు పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు నగదు ఇస్తామని ప్రకటించారు. వీటితో పాటు బీసీలకు ప్రత్యేకంగా రక్షణ కల్పించడానికి చట్టం తెస్తామని కూడా చెప్పారు.
కీలక ప్రకటనలు...
పింఛను అధికారంలోకి రాగానే నాలుగువేల రూపాయలు ఇస్తామని కూడా చంద్రబాబు ప్రకటించారు. తుది దశ మ్యానిఫేస్టోలో మరిన్ని ఉచితాలు ఉండే అవకాశాలున్నాయని తెలిసింది. నిరుద్యోగ భృతితో పాటు దీంతో పాటు ఉద్యోగులను ఆకట్టుకునేలా డీఏపై కూడా భారీగా ప్రకటన ఉంటుందని కూడా పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీంతోపాటు రైతు రుణమాఫీ పై కూడా కీలక ప్రకటన చేయనున్నారని సమాచారం. వీటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సంపాదించుకునే ప్రయత్నంలో భాగంగా ఉపాధి కూలీలకు సంబంధించిన కీలక ప్రకటన కూడా ఉండే అవకాశముంటుందని చెబుతున్నారు.
పాత పథకాలకు తోడు...
నగదు బదిలీ పథకం ద్వారానే పధకాలను అమలు చేస్తామని చెబుతూనే ఆటోవాలాలకు కూడా కొంత మొత్తాన్ని ఇచ్చేలా మ్యానిఫేస్టోను రూపొందిచినట్లు సమాచారం. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో పార్టీకి పట్టుఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో నిలదొక్కుకునేలా మ్యానిఫేస్టోలో అనేక అంశాలను జొప్పించినట్లు చెబుతున్నారు. వీటితో పాటు 2014లో తాము అమలు చేసిన అన్ని పథకాలు తిరిగి అమలు చేస్తామని, ప్రస్తుత ప్రభుత్వం తీసుకు వచ్చిన పథకాలను కూడా కొనసాగిస్తామని హామీ ఇవ్వనున్నారు. అయితే ఏ ఏ అంశాలు .. ఏ వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉంటాయన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉన్నప్పటికీ.. చంద్రబాబు తన మ్యానిఫేస్టోతోనే జనంలోకి చొచ్చుకు వెళ్లాలన్న ప్రయత్నంలో ఉన్నారు. మరి మోదీ పర్యటన ఖరారయితే మ్యానిఫేస్టో విడుదల కూడా ఆరోజు జరిగినట్లేనన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
Next Story