Sun Dec 22 2024 01:37:37 GMT+0000 (Coordinated Universal Time)
Ap Elections : వైఎస్ వివేకా హత్య.. షర్మిల ప్రభావం చూపలేదా? ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయంటే?
ఈ ఎన్నికల్లో అత్యధిక సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ను పరిశీలిస్తే రెండు కీలక అంశాలు మాత్రం చర్చనీయాంశంగా మారాయి.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఒక విషయాన్ని మాత్రం తేల్చాయి. ఈ ఎన్నికల్లో అత్యధిక సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ను పరిశీలిస్తే రెండు కీలక అంశాలు మాత్రం చర్చనీయాంశంగా మారాయి. ఒకటి వైఎస్ వివేకానందరెడ్డి హత్య..రెండోది షర్మిల ప్రభావం. ఈ రెండింటి ప్రభావం ఈ ఎన్నికల్లో పెద్దగా చూపలేదేనే అర్థమవుతుంది. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా? లేదా? అన్నది పక్కన పెడితే.. అవి నిజమైతే మాత్రం ఈ రెండు అంశాలను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు...
వైఎస్ వివేకానందరెడ్డి 2019 ఎన్నికలకు ముందు పులివెందులలోని తన సొంత ఇంట్లో దారుణహత్యకు గురయ్యారు. ఆ ఎన్నికల్లో అది జగన్ పార్టీకి ప్లస్ గా మారింది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆరోజు వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మలు కూడా జగన్ కు మద్దతుగా ప్రచారం చేశారు. దీంతో ఆ ఎన్నికల్లో వైసీపీకి సునాయాసంగా విజయం లభించిందని అనుకోవాలి. అయితే ఈ ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారిపోయింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి కూడా నిందితులుగా సీబీఐ చేర్చింది. దీంతో పాటు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత నేరుగా జగన్ మీద ఆరోపణలు చేశారు. దీంతో వైఎస్ వివేకానందరెడ్డి ప్రభావం బాగా పనిచేస్తుందని అందరూ అనుకున్నారు. కడప జిల్లాలో వైఎస్ షర్మిల ఓడిపోతుందని కూడా ఆరా వంటి సంస్థలు చెబుతున్నాయి. అయితే వైసీపీ ఓటు శాతం అక్కడ తగ్గే అవకాశమున్నట్లు తెలిపింది.
షర్మిల.. విజయమ్మ ప్రభావం...
కానీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రభావం పెద్దగా చూపలేదని, ఆ వ్యతిరేకత జగన్ పార్టీవైపు మరలలేదని ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తేలిందనే చెప్పాలి. ఇక వైఎస్ షర్మిల ప్రభావం కూడా పెద్దగా చూపలేకపోయిందనే అనుకోవాలి. ఎందుకంటే వైఎస్ షర్మిల తన సోదరుడు జగన్ ను వ్యతిరేకించి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ చీఫ్ అయ్యారు. జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. రాజన్న బిడ్డగా తనను ఆదరించాలని ప్రజలను కోరారు. రాష్ట్రమంతటా పర్యటించారు. ఇక జగన్ తల్లి విజయమ్మ కూడా ఈ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. అమెరికా కు వెళ్లిన విజయమ్మ తన కుమార్తె షర్మిలను గెలిపించారని కోరారు కాని, జగన్ ను గెలిపించాలని వీడియో సందేశం ద్వారా కోరలేదు. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం షర్మిల, విజయమ్మ జగన్ కు దూరం కావడం ఎఫెక్ట్ చూపలేదనే అర్థమవుతుంది. మొత్తం మీద ఈ రెండు అంశాలు ఈ ఎన్నికలలో జగన్ పార్టీపై ప్రభావం చూపలేదనే చెప్పాలి. అయితే ఇది ఎగ్జిట్ పోల్స్ ను అనుసరించిన వ్యక్తపర్చిన అభిప్రాయమే తప్ప.. మరొకటి కాదు.
Next Story