Wed Jan 08 2025 17:23:30 GMT+0000 (Coordinated Universal Time)
Ap Elections Exit Polls : ఏమి చెప్తిరి.. ఏమి చెప్తిరి.. అవన్నీ నిజాలేనా? ఇక బాజాలు మోయించడమే తరువాయా?
ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఎవరికి వారే తమకు అనుకూలంగా ఎక్కువ సంస్థలు ఫలితాలు ఇచ్చాయని పార్టీలు చెప్పుకుంటున్నాయి
ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఎవరికి వారే తమకు అనుకూలంగా ఎక్కువ సంస్థలు ఫలితాలు ఇచ్చాయని పార్టీలు చెప్పుకుంటున్నాయి. వైసీపీ, టీడీపీ కూటమి ఇద్దరూ పోటాపోటీగా ఉన్నట్లు ఈ ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడయింది. ఎక్కువ శాతం సంస్థలు టఫ్ ఫైట్ అని చెప్పకనే చెప్పాయి. రెండు పార్టీల మధ్య ఓటింగ్ శాతం కేవలం రెండు నుంచి ఐదు శాతం లోపు ఉండటంతో వాస్తవంలో ఇది తిరగబడే అవకాశాలు లేవని కూడా ఆశతో రాజకీయ పార్టీలున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ నిజమవుతాయని చెప్పలేం. అలాగని వాస్తవం కాదని కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో ఇచ్చిన సర్వేల ప్రకారం చూస్తే కొన్ని సంస్థలు ఇచ్చిన నివేదికలు నిజమయ్యాయి. మరికొన్ని సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ కు అసలు ఫలితాలకు సరిపోల్చలేని పరిస్థితి. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ రాజకీయ పార్టీ నేతల గుండెల్లో మాత్రం రైళ్లు పరుగెడుతున్నాయి.
మూడుసార్లు జరిగిన ఎన్నికల్లో...
ఆంధ్రప్రదేశ్ లో మూడు సార్లు ఎన్నికలు జరిగితే 2014 78.04. 2019 ఎన్నికల్ో 79.77, 2024లో 81.06 శాతం పోలింగ్ నమోదయింది. రూరల్ ప్రాంతంలో పోలింగ్ శాతం బాగా పెరిగింది. 124 నియోజకవర్గాల్లో రెండు శాతానికి మించి ఓటింగ్ శాతం పెరిగింది. పెరిగిన ఓటింగ్ శాతం అధికారంలోకి ఎవరిని కూర్చోబెట్టాలన్నది నిర్ణయిస్తారు. అత్యధికంగా అర్బన్ ప్రాంతంలో 27 నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది. మహిళ ఓటర్లు గత ఎన్నికల్లో 1.57 కోట్లు పోలయితే.. 2024లో 1.69 కోట్లు ఓట్లు పోలయ్యాయి. దీంతో ఇది కూడా డిసైడ్ ఫ్యాక్టర్ గా చూడాలి. దాదాపు పన్నెండు లక్షల మహిళ ఓటర్లు పెరిగాయని చెప్పాలి. అనేక కారణాలు ఈ ఎన్నికల్లో ప్రభావితం చూపాయని ఎగ్జిట్ పోల్స్ చెప్పగలిగాయి. అయితే తుది ఫలితాలు మాత్రం జూన్ 4వ తేదీన వెల్లడి కానున్నాయి.
గత ఎన్నికల్లో...
2019 ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ లో కొన్ని సంస్థలు మాత్రం ఖచ్చితంగా అంచనా వేయగలిగాయి. 2019 ఎన్నికల్లో ఇండియా టుడే వైసీపీకి 130 నుంచి 135 స్థానాలు వస్తాయని చెప్పింది. టీడీపీకి 37 నుంచి నలభై స్థానాలు దక్కే అవకాశముందని తెలిపింది. సీపీఎస్ సంస్థ వైసీపీకి 130 నుంచి 133 స్థానాలు వస్తాయని తెలిపింది. టీడీపీ 43 నుంచి 44 స్థానాలకే పరిమితమవుతుందని అంచనా వేసింది. వీడీపీ అసోసియేట్స్ వైసీపీకి 111 నుంచి 121 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. టీడీపీ 54 నుంచి 60 స్థానాలు వస్తాయని తెలిపింది. ఆరా మస్తాన్ సంస్థ వైసీపీకి 119 నుంచి 126 స్థానాలు వస్తాయని చెబితే, టీడీపీకి 47 నుంచి 56 స్థానాలు వస్తాయని తెలిపింది. అయితే 2019 ఎన్నికల్లో తుది ఫలితాలు మాత్రం వైసీపీకి 151 స్థానాలు వస్తే టీడీపీ 23 స్థానాలకు మాత్రమే పరిమితమయింది. అంటే నాడు కూడా వైసీపీ గెలుస్తుందని అన్ని సంస్థలు అంచనాలు వేసినా అంకెలు మాత్రం కొంత ఎక్కువగా అసలు ఫలితాల్లో వెల్లడయ్యాయి. తెలంగాణ ఎన్నికల్లోనూ ఆరా మస్తాన్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పడమే కాకుండా కామారెడ్డిలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓడి పోతున్నారని ముందే చెప్పారు. అలా ఆరా మస్తాన్ సర్వే కొంత వాస్తవమని తుది ఫలితాల వెల్లడి తర్వాత కూడా తేలడం విశేషం.
కొన్ని సార్లు మాత్రం...
ఎగ్జిట్పోల్స్ అంచనాలు కొన్నిసార్లు నిజమైతే మరికొన్నిసార్లు ఘోరంగా విఫలమయ్యాయి. 1998 లోక్సభ ఎన్నికల్లో భాజపా కూటమి గెలుపు ఖాయమని చెప్పడంతోపాటు సర్వే సంస్థలు వెల్లడించిన సంఖ్యకు దగ్గరగానే సీట్లు వచ్చాయి. 2014 ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. అలాగే 2019 ఎన్నికల్లోనూ దాదాపు దగ్గరగా అంచనా వేశారు. అలాగే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ, బెంగాల్లో ఖచ్చితంగా అంచనా వేశారు.2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పాయి. అయితే 2004 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్పోల్స్ వెల్లడించగా...అందరి అంచనాలు తప్పని రుజువు చేస్తూ కాంగ్రెస్ అధికారం చేపట్టింది. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సర్వే సంస్థలు చెప్పినట్లు జరగలేదు. బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేయగా....చేయిచేయి కలిపిన నితీశ్, లాలూ కూటమి గెలుపొందింది. 2017 ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల్లోనూ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. అలాగే 2020 బిహార్ ఎన్నికల్లోనూ సెఫాలిజిస్టుల అంచనా తప్పింది. అందుకే పూర్తిగా నమ్మలేం. అలాగని కొట్టిపారేయలేం. జూన్ 4వ తేదీన ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారని తెలియనున్నప్పటికీ, ఎగ్జిట్ పోల్స్ మాత్రం పోలింగ్ లాగానే అర్థం కాకుండా ఉన్నాయి.
Next Story