Mon Dec 23 2024 08:46:13 GMT+0000 (Coordinated Universal Time)
Cash Politics : డబ్బే అధికారాన్ని నిర్ణయిస్తుందా? ఏపీలో ఒక్కో ఓటుకు ఎంత రేటు పలుకుతుందంటే?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రస్తుతం ఓటు విలువ మూడు నుంచి నాలుగు వేల రూపాయలు పలుకుతుంది.
రాజకీయాలు డబ్బు మయం అయ్యాయి. సేవ అంతరించి పోయి క్యాష్ కొట్టు ఓటు పట్టు అనే చందంగా తయారయింది. ఎన్నికల కమిషన్ అధికారుల కళ్లు గప్పి మరీ ఓట్లను కొనుగోలు చేస్తున్నారు. మ్యానిఫేస్టోలు, హామీలు, అభివృద్ధి.. ఉపాధి అవకాశాలు... పరిశ్రమల స్థాపన.. సంక్షేమ పథకాలు ఇవన్నీ ట్రాష్. ఎన్నికల రోజు అదే పోలింగ్ రోజు ఎవరు ఎంత ఖర్చు పెడితే వారిదే విజయం అన్న పరిస్థితికి రాజకీయాలు చేరుకున్నాయి. ఇందులో రాజకీయ నేతలది ఎంత తప్పుందో.. అంతే స్థాయిలో ప్రజలది కూడా ఉంది. ఎన్నికల సమయంలోనే కనిపించే నేతలు తర్వాత కనిపించరు. తమ సమస్యలు విన్నవించుకుందామనుకున్నా ఫలితం ఉండదు. కలిసినా తమ సమస్యలు పరిష్కారం అవుతాయని గ్యారంటీ లేదు. వాటి పరిష్కరానికి డబ్బులు అడిగే పొలిటికల్ లీడర్స్ కు కూడా కొదవలేదు.
గతానికి భిన్నంగా...
గతంలో ప్రచారం ఎవరు బాగాచేస్తే వారి వైపే ఓటర్లు ఎక్కువగా మొగ్గు చూపేవారు. కాని రాను రాను పరిస్థితులు మారిపోయాయి. తమకు ఎంత వచ్చినా ఈరోజు మాత్రమే కదా అన్న ధోరణి ప్రజల్లో నెలకొంది. అందుకే ఎంత ఎక్కువ సొమ్ములు ఇస్తే వారి పక్షాన నిలబడుతూ ఓటర్లు తమ అలవాటును మార్చుకున్నారు. గత ఎన్నికలలో ఇచ్చిన దానికంటే ఎక్కువ మొత్తం ఇవ్వాలని కొన్ని చోట్ల డిమాండ్ కు కూడా దిగుతున్నారు. కొందరు గ్రామస్థులయితే తమకు డబ్బులు ఇవ్వలేదని ఏకంగా పోలింగ్ ను బహిష్కరిస్తామని బెదిరించడం కూడా ఇటీవల వరసగా వార్తలు వింటుండటం రాజకీయాల్లో నగదు ప్రభావం ఏ మేర ఉందో అర్థం చేసుకోవచ్చు. పోలింగ్ కు ఇంకా గంటల సమయమే ఉండటంతో పెద్దయెత్తున నగదును పంపిణీ చేస్తున్నారని సమాచారం.
ఈ నియోజకవర్గాల్లో...
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రస్తుతం ఓటు విలువ మూడు నుంచి నాలుగు వేల రూపాయలు పలుకుతుంది. కీలకమైన నియోజకవర్గాల్లో ఈ ధర పలుకుతుంది. కొంతలో కొంత రెండు వేల రూపాయలు ఓటుకు ఇస్తున్నారు. విజయవాడ పరిసర ప్రాంతంలోని ఒక నియోజకవర్గంలో ఓటుకు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఒక నియోజకవర్గంలోనూ ఇంతే ధర పలుకుతుంది. అన్ని పార్టీలూ ధనికులకే సీట్లు ఇవ్వడంతో పాటు, ఎంపీ అభ్యర్థులను కూడా కోట్లాది రూపాయలను ఉన్నవాళ్లను దించడంతో రెండు ఓట్లకు కలిపి ఒక్కొక్క ఓటుకు నాలుగు వేల రూపాయల వరకూ చెల్లిస్తున్నారని తెలిసింది. ఇక నెల్లూరు జిల్లాలోనూ కూడా ఇదే పరిస్థితి కనపడుతుందన్నది విశ్లేషకుల అంచనా. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ నాలుగు వేలు పలుకుతుంది. ఈ జిల్లాల్లో ఎంపీ అభ్యర్థులు కోటీశ్వరులు కావడమే దీనికి కారణం. 175 నియోజకవర్గాల్లో దాదాపు 70కి పైగా నియోజకవర్గాల్లో ఓటుకు నాలుగువేలు పలుకుతుంది. భవిష్యత్ లో ఎన్నికల్లో పోటీ చేయడం అంటే సాధారణమైన నేతలకు సాధ్యం కాదన్నది వాస్తవం.
Next Story