Thu Dec 19 2024 08:43:37 GMT+0000 (Coordinated Universal Time)
Ap Elections " ఏందయ్యా ఇది.. ఎప్పుడూ లేనంతగా ఓటర్లు ఊగిపోతున్నారుగా.. మహిళలు.. వృద్ధులే ఎక్కువగా
ఆంధ్రప్రదేశ్ లో అక్కడడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ప్రస్తుతానికి ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ప్రశాంతగానే జరుగుతున్నాయి. అక్కడడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ప్రస్తుతానికి ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతుంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా.. చూడని విధంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టడంతో రాజకీయ పార్టీలు సయితం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. పోలింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశముందని తెలిసింది. అయితే ఎవరికి వాళ్లు పెరుగుతున్న ఓటింగ్ శాతం తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. అయితే పోలింగ్ కేంద్రాలకు ఉదయాన్నే రావడం కూడా రాజకీయ పార్టీల వ్యూహంలో భాగమేనని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
వాలంటీర్ల వల్లనేనంటూ...
తమకు ఖచ్చితంగా ఓటు వేసే ఓటర్లను ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రధానంగా గతంలో వాలంటీర్లు లేరు. కానీ ఈసారి వాలంటీర్లు తమ పరిధిలోని యాభై ఇళ్లకు సంబంధించిన ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకు రావడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఉదయాన్నే వచ్చి ఓటు వేసి వెళ్లాలని వాలంటీర్లు సూచించడం, వారు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చేలా ఏర్పాటు చేయడం వల్లనే ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టారని ఫ్యాన్ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రధానంగా వృద్ధులు, మహిళలు, యువకులు వచ్చి ఓటు వేయడం తమకు అనుకూలమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ వ్యతిరేకత వల్లనేనంటూ...
మరోవైపు విపక్షాలు కూడా పోలింగ్ కేంద్రాలకు పెద్దయెత్తున తరలి రావడం తమకు లాభమేనంటున్నాయి. ముఖ్యంగా ఏపీలో గత ఐదేళ్లుగా అభివృద్ధి లేకపోవడంతో ఆగ్రహించి ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చి మరీ ఓటు వేశారన్నది టీడీపీ నుంచి వినిపిస్తున్న వాదన. అంతెందుకు.. యువత ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారని, అందుకే ఈసారి ఓటు వేసేందుకు ఉత్సాహంతో ముందుకు వచ్చారంటున్నారు. మహిళలు కూడా ఫ్రీ బస్సు, మూడు గ్యాస్ సిలిండర్ల హామీతో క్యూ కట్టారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. పింఛను కూడా నాలుగు వేల రూపాయలకు పెంచడం వల్ల వృద్ధులు అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారంటున్నారు.
మనసులో ఏముందో?
యువత ఎక్కువగా ఓటు వేయడం తమకు లాభమంటున్నాయి కూటమి పార్టీలు. అదే సమయంలో సంక్షేమ పథకాలు తమ కుటుంబంలో అందుతుండటంతో ఈసారి కూడా పెద్దలు ఇబ్బంది పడకూడదన్న కారణంగానే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఓట్లు వేస్తున్నారని మరో వాదన కూడా వినిపిస్తుంది. ఉదయాన్నే వచ్చి క్యూలో నిలబడి మరీ ఓటు వేస్తున్నారంటే ప్రభుత్వ వ్యతిరేకత కారణమని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇలా ఎవరి వాదనలు వారు వినిపించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడ చూసినా వృద్ధులు, మహిళలే కనిపిస్తుండటంతో రెండు పార్టీలూ తమకు అనుకూలంగానే పోలింగ్ ఉంటుందని చెప్పుకుంటున్నాయి. మొత్తం మీద జూన్ 4వ తేదీన ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే ఎవరిది విజయం అన్నది తెలియనుంది. అంతే తప్ప ఎవరి మనసులో ఏముందో? ఎవరు చెప్పగలరు?
Next Story