Mon Dec 23 2024 02:12:34 GMT+0000 (Coordinated Universal Time)
Ap Elections : బోసిపోయి కనిపిస్తున్న బస్టాండ్లు.. కౌంటింగ్ దెబ్బకు ఇళ్లకే పరిమితమయిన జనం
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు వీధులన్నీ నిర్మానుష్యంగానే ఉన్నాయి. కౌంటింగ్ కావడంతో బస్టాండ్ లు కూడా బోసి పోయి కనిపిస్తున్నాయి
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు వర్కింగ్ డే అయినా వీధులన్నీ నిర్మానుష్యంగానే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ జరుగుతుండటంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రధానంగా మండల కేంద్రాల నుంచి నియోజకవర్గాల కేంద్రాల వరకూ పోలీసులు మొహరించారు. ఎవరూ ఇళ్లనుంచి బయటకు రావద్దని సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల సందర్భంగా పోలింగ్ అనంతరం జరిగిన ఘర్షణలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా అన్ని చర్యలు తీసుకున్నారు.
నిఘా వర్గాల హెచ్చరికతో...
కౌంటింగ్ తర్వాత కూడా ఘర్షణలు చెలరేగే అవకాశముందని భావించి పోలీసులు సున్నితమైన ప్రాంతాల్లో వ్యాపారాలను మూయించి వేశారు. అత్యవసరంగా లభించే మెడికల్ దుకాణాలు, పాలు వంటికి మాత్రమే మినహాయింపు ఇచ్చారు. పల్నాడు ప్రాంతాల్లో ప్రజలు ఈరోజు ఇంట్లోనే ఉండటం మంచిదని పోలీసులు చెబుతున్నారు. బయటకు వచ్చి గుమికూడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రమంతటా 144 సెక్షన్ అమలులో ఉంది. సెక్షన్ 30 కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలులో ఉంది. దీంతో ఎవరూ బయటకు వచ్చి ఇబ్బంది పడవద్దని పోలీసులు కూడా కోరుతున్నారు.
వ్యాపారాలన్నీ...
ఆంధ్రప్రదేశ్ లో బస్టాండ్లన్నీ బోసి పోయి కనిపిస్తున్నాయి. కౌంటింగ్ సమయంలో ఎవరూ ప్రయాణాలు కూడా పెట్టుకోకపోవడం, ఉన్నప్పటికీ వాయిదా వేసుకోవడంతో అన్ని బస్టాండ్లు దాదాపు బోసి పోయి కనిపిస్తున్నాయి. అత్యవసర పనులు ఉన్న వారు మాత్రమే బస్టాండ్ లకు వస్తున్నారు. మొబైల్ ద్వారా ఫలితాలను తెలుసుకునే వీలున్నప్పటికీ బయటకు వెళ్లి ఇబ్బందులు పాలు కావడం ఎందుకన్న ధోరణితో అత్యధిక శాతం మంది ప్రజలున్నారు. అందుకే ఈరోజు ఎలా గడుస్తుందా? అన్న టెన్షన్ ఏపీలోని ప్రతి ఒక్కరిలోనూ ఉంది.
Next Story