Mon Dec 23 2024 08:39:10 GMT+0000 (Coordinated Universal Time)
Emmiganur : అసలే అంతంత మాత్రం..దీనికి తోడు అసంతృప్తుల బెడద.. ఎమ్మిగనూరు ఏమవుతుందో?
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కూటమిలో విభేదాలు రోడ్డున పడ్డాయి. టీడీపీ అభ్యర్థికి తాము సహకరించేది లేదంటూ బీజేపీ చెబుతోంది
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కూటమిలో విభేదాలు రోడ్డున పడ్డాయి. టీడీపీ అభ్యర్థికి తాము సహకరించేది లేదంటూ బీజేపీ తిష్టవేసుకుని కూర్చుంది. త్వరలో తమ తరుపున మరొకరిని బరిలోకి దించుతామని శపథాలు చేస్తుంది. అసలే ఎమ్మిగనూరులో అంతంత మాత్రంగా ఉన్న టీడీపీకి ఈ అసంతృప్తుల తలనొప్పి బాటిల్స్ కొద్దీ బామ్ రాసినా పోయేటట్లు లేదు. పార్టీ అధినాయకత్వం దీనిపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఏపీ అంతటా టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు సమన్వయంతో పనిచేస్తుంటే ఎమ్మిగనూరులో మాత్రం సీన్ వేరేగా ఉంది. దీనిని సరిదిద్దుకోకపోతే మాత్రం టీడీపీ అభ్యర్థి విజయం సాధించడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
కలుపుకుని పోకపోవడంతో.....
టీడీపీ ఇక్కడ 2014లో విజయం సాధించింది. అప్పుడు గెలిచిన జయనాగేశ్వర్ రెడ్డికే తిరిగి టిక్కెట్ కేటాయించింది. అయితే జయనాగేశ్వర్ రెడ్డి మిత్రపక్షాలను కలుపుకునే పోయే పనిచేయడం లేదు. చంద్రబాబు ఎమ్మిగనూరు సభకు కూడా టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వర్ రెడ్డి జనసేన, బీజేపీ అభ్యర్థులను ఆహ్వానించలేదు. ఇటీవల నందమూరి బాలకృష్ణ బస్సు యాత్ర ఎమ్మిగనూరు చేస్తున్నప్పుడు కూడా వారికి ఆహ్వానం అందలేదు. దీనికి తోడు బీజేపీకి ఇక్కడ ఓట్లు ఎక్కడ ఉన్నాయంటూ జయనాగేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్ పై కమలనాధులు కయ్యిమంటున్నారు. తమ పార్టీనే అవమానకరంగా మాట్లాడతారా? అంటూ వారు తమ తరుపున అభ్యర్థి బరిలో ఉంటారని చెబుతున్నారు.
తమ అభ్యర్థిని బరిలోకి...
ఈ నెల 24వ తేదీన నామినేషన్ వేయిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. దళిత మహిళ చేత నామినేషన్ వేయించాలన్న ఆలోచనలో బీజేపీ నేతలున్నారు. మరోవైపు ఇక్కడ వైసీపీ బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపింది. చేనేత వర్గానికి చెందిన బుట్టా రేణుకను జయనాగేశ్వర్ రెడ్డి ఢీకొట్టాల్సి ఉంది. సామాజికపరంగా, ఆర్థికంగా బుట్టా రేణుకను ఎదుర్కొనడం కష్టమైన పనే. ఈ సమయంలో అందరినీ కలుపుకోవాల్సిన టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వర్ రెడ్డి తన మానాన తాను నడుచుకుని పోతున్నారు. ఇలాగయితే ఎలా అని అధినాయకత్వం చెప్పినా సరే ఆయనలో మాత్రం మార్పు రాకపోవడంతో టీడీపీ అగ్రనాయకత్వం కూడా తలలుపట్టుకుంటోంది.
మంచి పేరే ఉన్నా...
ఎమ్మిగనూరులో జయనాగేశ్వర్ రెడ్డి కుటుంబానికి మంచి పేరే ఉంది. ఆయన తండ్రి బి.వి. మోహన్ రెడ్డి నాలుగుసార్లు ఇక్కడి నుంచి విజయం సాధించారు. అలాగే ఇక్కడ వైసీపీ నేత చెన్న కేశవరెడ్డి కూడా కాంగ్రెస్, వైసీపీ నుంచి నాలుగు సార్లు విజయం సాధించారు. అంటే రెండు పార్టీలూ మంచి పట్టున్నవి కావడంతో ఎవరిది గెలుపు అన్నది మాత్రం చివర వరకూ చెప్పలేని పరిస్థితి ఉంది. కానీ టీడీపీ జయనాగేశ్వర్ రెడ్డి మాత్రం తన తీరు మార్చుకోకుంటే బుట్టా రేణుకను ఓడించడం కష్టమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. మూడు పార్టీలు కలిస్తే మంచి పోటీ ఉంటుంది. కానీ మిత్రపక్షాలు సహాయ నిరాకరణ చేస్తే మాత్రం టీడీపీకి ఇక్కడ కష్టమేనని చెప్పక తప్పదు. ఇప్పటికైనా జయనాగేశ్వర్ రెడ్డి తీరులో మార్పు రావాలని పార్టీ శ్రేణులు ఆశతో ఎదురు చూస్తున్నాయి.
Next Story