Sun Dec 22 2024 22:59:24 GMT+0000 (Coordinated Universal Time)
Tadipathri : తాడిపత్రిలో ఈసారి తాడోపేడో అన్నట్లుగా ఉందిగా.. ఈసారి మాత్రం గెలుపు?
తాడిపత్రి నియోజకవర్గంలో ఈసారి టీడీపీ, వైసీపీ మధ్య పోరు హోరాహోరీగా సాగుతుంది
గత ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గంలో సంచలనం నమోదయింది. దశాబ్దాలుగా ఏలిన జేసీ కుటుంబానికి కంచుకోటను కేతిరెడ్డి పెద్దారెడ్డి బద్దలు కొట్టగలిగారు. అప్పట్లో జగన్ వేవ్ తో అందరూ ఓటమిపాలయినట్లుగానే తాము ఓడిపోయామని జేసీ బ్రదర్స్ సర్ది చెప్పుకున్నారు. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి గెలిచి ఇక్కడ పట్టు తమకు సడలలేదని నిరూపించారు. అందుకే ఈసారి తాడిపత్రి నియోజకవర్గంలో ఎన్నిక మాత్రం మామూలుగా లేదు. మొన్నటి వరకూ పెద్దారెడ్డి అసలు సరిపోడని భావించిన ప్రజలు గెలిపించారు. రెండోసారి ఆయనకు ఛాన్స్ ఇస్తారా? లేక జేసీ అస్మిత్ రెడ్డిని ఆశీర్వదిస్తారా? అన్నది మాత్రం పెద్ద ప్రశ్నగానే ఉంది.
పెద్దారెడ్డి నమ్మకం...
రాయలసీమలో వైసీపీ బలంగా ఉంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అదే సమయంలో జేసీ కుటుంబానికి కూడా పట్టున్న తాడిపత్రిలో మాత్రం గెలుపోటములను అంచనా వేయలేని పరిస్థితి. 2019 ఎన్నికలకు ముందు వరకూ అది జేసీ బ్రదర్స్ అడ్డా. కానీ ఆ పేరును పెద్దారెడ్డి చెరిపేశారు. జేసీ సోదరులకు ఇక్కడ ఏమీ లేదని నిరూపించారు. ఐదేళ్లలో తనను తాను నాయకుడిగా నిరూపించుకునే ప్రయత్నం చేశాడు పెద్దారెడ్డి. నియోజకవర్గాన్ని వదలకుండా.. అక్కడే అంటిపెట్టుకుని ఉన్న పెద్దారెడ్డి తనను మరొకసారి ఆశీర్వదించాలని కోరుతున్నారు. సంక్షేమ పథకాలు అందరికీ అందాలంటే తనను గెలిపించాలని ఆయన ఇంటింటికీ తిరుగుతున్నారు.
కసితో జేసీ...
మరోవైపు గత ఎన్నికల్లో ఓటమి బాధతో కసితో ఉన్న జేసీ ఫ్యామిలీ ఈసారి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడైన అస్మిత్ రెడ్డిని బరిలోకి దించింది. గత ఎన్నికల్లో ఓటమి పాలయిన సానుభూతితో పాటు జేసీ బ్రదర్స్ కుటుంబానికి ఉన్న పట్టు కూడా తన గెలుపునకు ఉపయోగపడుతుందని అస్మిత్ రెడ్డి భావిస్తున్నారు. పెద్దారెడ్డితో పోలిస్తే తాను యువకుడిని కావడంతో తాను గెలిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పుకుంటూ ఇల్లిల్లూ తిరుగుతున్నారు. జేసీ కుటుంబానికి ఈ ఎన్నికల్లో ఒకే సీటు రావడం... అదీ తాడిపత్రి కావడంతో అందరూ తాడిపత్రిపైనే ఫోకస్ పెట్టారు. తలా ఒక దిక్కుకు వెళ్లి ప్రచారాన్ని చేస్తున్నారు.
ఇద్దరూ బలమైన నేతలే...
ఇక ఆర్థికంగా కూడా ఇటు వైసీపీ, అటు టీడీపీ నేతలు బలమైన వారు కావడంతో డబ్బులు తాడిపత్రి నియోజకవర్గంలో బాగానే ఖర్చవుతున్నాయంటున్నారు. జేసీకుటుంబం ఈసారి అస్మిత్ రెడ్డి గెలుపును ప్రెస్టీజియస్ గా తీసుకోగా, పెద్దారెడ్డి తనను ఖచ్చితంగా ప్రజలు దగ్గరకు తీసుకుంటారన్న గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇద్దరూ ఆర్థికంగా, సామాజికంగా బలమైన వారే. బలం, బలగం కూడా ఇద్దరికీ సమానంగానే ఉంది. కానీ ప్రజల నాడి మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. జేసీ కుటుంబం ఈసారి గెలిచి కోల్పోయిన ప్రతిష్టను తిరిగి నిలబెట్టుకోవాలని చూస్తుండగా, కేతిరెడ్డి పెద్దారెడ్డి సయితం గెలిచి తొడకొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి జనం ఎవరికి జేజేలు కొడతారన్నది చూడాల్సి ఉంది.
Next Story