Mon Dec 23 2024 07:44:54 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : మైండ్ గేమ్ తో జగన్ మాస్టర్ ప్లాన్... వర్క్ అవుట్ అయితే ఊడ్చేయడమేనా?
వైసీపీకి బలం.. బలగం.. మహిళలే.. తొలి నుంచి జగన్ ఓటు బ్యాంకు కూడా మహిళలే
వైసీపీకి బలం.. బలగం.. మహిళలే.. తొలి నుంచి జగన్ ఓటు బ్యాంకు కూడా మహిళలే. గత ఎన్నికల్లోనూ ఎక్కువ మంది మహిళలు జగన్ వైపు మొగ్గు చూపారు. అందుకే వైసీపీ 151 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఈ ఆలోచనతోనే జగన్ మరేమీ ఆలోచించలేదు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలను ఆకట్టుకునేందుకే ప్రతి అడుగులో ప్రయత్నించారు. అక్కా చెల్లెమ్మలు అంటూ వారిని తన వైపున ఉండేలా చూసుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. ప్రతి పథకమూ వారికే. నగదు బదిలీ కూడా వారి ఖాతాల్లోనే. అక్క చెల్లెమ్మలంటూ జగన్ ప్రతి సభలో పిలుస్తున్న పిలుపు వెనక రహస్యం కూడా అదే. మహిళ ఓటర్లు జారిపోకుండా ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అన్నీ వారి ఖాతాల్లోనే...
చివరకు ఫీజు రీఎంబర్స్మెంట్ దగ్గర నుంచి అన్నీ తల్లుల ఖాతాల్లోనే. గతంలో నేరుగా కళాశాలల యాజమాన్యాలకు పంపేవారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని మార్చి వేసి ఫీజు రీఎంబర్స్మెంట్ మొత్తాన్ని తల్లుల ఖాతాల్లోనే జమ చేస్తూ వచ్చారు. ఒక్క రైతు భరోసా పథకం తప్ప మిగిలిన పథకాలకు సంబంధించిన నిధులన్నీ మహిళల ఖాతాల్లోనే జమ చేసేవారు. అమ్మఒడి, తల్లి దీవెన, జగనన్న వసతి దీవెన ఇలా ఏ పథకమయినా మహిళలఖాతాల్లోనే జమ చేశారు. దీంతో పాటు ఇంటి స్థలాలను కూడా మహిళలపేర్ల మీదనే ఇచ్చారు. దాదాపు 36 లక్షల మంది మహిళలకు పట్టాలు అందించి వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా...
ఇది జగన్ ఊరికే ఉబుసుపోక చేయలేదు. మహిళలు కష్టపడయినా.. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తారు. అంతే కాదు.. వాళ్లు అనుకున్న పార్టీకే ఓటు వేసే వరకూ నిద్రపోరు. ఎవరెన్ని రకాలుగా వారిని ప్రలోభాలకు గురిచేసినా చివరకు పోలింగ్ తేదీ నాటికి వారి మనసులో మాత్రం తమకు సాయం చేసిన వారికి మాత్రమే ఓటు వేస్తారని తెలుసు. మైండ్ గేమ్ తో జగన్ మాస్టర్ ప్లాన్ వేశారు. అందుకే మహిళలలో ఎక్కువ భాగం ఇప్పుడు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే పింఛన్ల దగ్గర నుంచి పథకాల వరకూ వేల రూపాయలు తమ ఖాతాల్లోకి వచ్చి పడుతుండటం గతంలో ఎన్నడూ జరగలేదు.
చంద్రబాబు కూడా...
ఇందుకు ప్రధాన కారణం 154 స్థానాల్లో మహిళా ఓటర్లే గెలుపోటములను నిర్ణయిస్తారు.ఎన్నికల సంఘం ఓటర్ల వివరాలను వెల్లడించింది. మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. దాదాపు 154 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితాలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. 154 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. 21 నియోజకవర్గాల్లో మహిళలకంటే పురుషులు అధికంగా ఉన్నారు. అందుకే చంద్రబాబు కూడా మహిళలను ఆకట్టుకోవడానికి ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు 1500 రూపాయల పింఛను, తల్లికి వందనం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలను ప్రకటించారు. మరి మహిళలు ఈసారి ఎవరివైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story