Mon Dec 23 2024 06:27:46 GMT+0000 (Coordinated Universal Time)
Ap Assembly Elections : రెండు పార్టీలకు ఆ సీట్లే కీలకం.. అక్కడ గెలవాలంటే కష్టమేనట మరి
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఎన్నికలలో టీడీపీ, వైసీపీ ఇప్పటికీ గెలవని నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి
ఆంధ్రప్రదేశ్ లో కొన్ని నియోజకవర్గాలు కొన్ని పార్టీలకు పెట్టని కోటలు. అక్కడ ప్రత్యర్థులు గెలిచిన దాఖలాలు లేవు. ఎప్పుడు ఎంత బలంగా గాలి వీచినా సరే అక్కడ మాత్రం గెలుపు గుర్రం ఎక్కలేదు. అభ్యర్థులను మార్చినా.. అనేక అభివృద్ధి పనులు చేసినా.. సంక్షేమ పథకాలను అందించినా సరే ఆ నియోజజకవర్గాలు మాత్రం పార్టీలకు మాత్రం దక్కడం లేదు. అక్కడ గెలవాలని చేస్తున్న ప్రయత్నాలు దశాబ్దాల తరబడి బెడిసికొడుతున్నాయే తప్పించి ఇంత వరకూ అక్కడ తమ గుర్తు గెలిచిన దాఖలాలు లేవు. దీంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ఆ నియోజకవర్గాల్లో గెలవాలని చూస్తున్నాయి. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేేస్తున్నాయి. మరి ఈసారైనా వీటిలో ఒక్కటైనా దక్కుతుందా? అన్నది మాత్రం?
మింగుడుపడని...
ఆంధ్రప్రదేశ్ లో కొన్ని నియోజకవర్గాలు టీడీపీకి మింగుడుపడటం లేదు. పార్టీ ఆవిర్భావం నాటి నుంచి అక్కడ జెండా ఎగిరిన పాపాన పోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, విభజన తర్వాత కూడా అక్కడ గెలుపు సాధించలేకపోవడానికి గల కారణాలను ఎంతగా వెతికినా కనిపించడం లేదు. టీడీపీకి పూతలపట్టు, రంపచోడవరం, రాజాం, శ్రీశైలం, నెల్లూరు రూరల్, పులివెందుల నియోజకవర్గాలున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ ఆవిర్బవించిన తర్వాత ఒకే ఒక్కసారి గెలిచింది.. అంటే పార్టీ ఏర్పడిన తొలినాళ్లలో గెలిచిన విజయవాడ పశ్చిమ, కోడుమూరు నియోజకవర్గాలున్నాయి. ఇప్పుడు విజయవాడ వెస్ట్ లో బీజేపీ పోటీ చేస్తుంది కాబట్టి ఈ ఎన్నికల్లోనూ టీడీపీ గెలిచే అవకాశం లేదు. రాజాం నియోజకవర్గంలో అభ్యర్థులను మార్చినా ఫలితం లేదు. ఈసారి నెల్లూరు టౌన్ లో గెలుస్తామన్న ధీమాతో ఉంది. యర్రగొండపాలెంలోనూ అభ్యర్థులను తరచూ మారుస్తూ ప్రయోగాలు చేస్తున్నా ప్రయోజం నిల్.
పట్టులేని ప్రాంతాలు...
ఇక వైసీపీకి కూడా అంతే. వైసీపీ ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో పోటీ చేసింది రెండు ఎన్నికల్లో మాత్రమే. 2014, 2019 ఎన్నికల్లో మాత్రమే వైసీపీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. ఈ దశాబ్దకాలంలో వైసీపీ వైపు చూడని నియోజకవర్గాలు కూడా చాలానే ఉన్నాయి. జగన్ ప్రభంజనం గత ఎన్నికల్లో ఎంత వీచినా సరే.. మొన్నటి ఎన్నికల్లోనూ ఇక్కడ గెలవలేకపోవడంతో అక్కడ టీడీపీ పట్టు ఎలా ఉందో ఇకచెప్పాల్సిన పనిలేదు. ఎంత గింజుకున్నా అక్కడ ఫ్యాన్ గాలి వీయడం లేదు. అందుకు కారణాలపై ఎంతగా శోధించినా పార్టీ అగ్రనాయకత్వానికి అంతు చిక్కడం లేదు. ఎందుకని ఇక్కడి ప్రజలు తమ పార్టీని ఆదరించలేదని సర్వేలు చేయిస్తున్నప్పటికీ సరైన జవాబు మాత్రం వారికి దొరకడం లేదు. అలా వైసీపీకి చిక్కని అనేక నియోజకవర్గాలు రాష్ట్రంలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
గెలవలేక....
టెక్కలిలో ఇంత వరకూ వైసీపీ అడుగుపెట్టలేదు. అలాగే హిందూపురంలోనూ ఫ్యాన్ గాలి వీయలేదు. కుప్పం సంగతి సరే సరి. అక్కడ వైసీపీ ఇంతవరకూ గెలవలేదు. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలోనూ అంతే. ఇంత వరకూ అక్కడ వైసీపీ గాలి వీయలేదు. పర్చూరు నియోజకవర్గంలోనూ వైసీపీ గెలవలేకపోయింది. గన్నవరం నియోజకవర్గం కూడా వైసీపీకి అచ్చిరాలేదు. ఇచ్ఛాపురం, పెద్దాపురం, పాలకొల్లు, ఉండి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం, కొండపి, రేపెల్లె, విజయవాడ తూర్పు నియోకవర్గాల్లోనూ వైసీపీ ఎంత మందిని మార్చినా ఇంత వరకూ గెలుపుబాట పట్టలేదు. వీటితో పాటు విశాఖ నగరంలోని విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ లలో కూడా వైసీపీకి విజయం దక్కలేదు. మండపేట, రాజమండ్రిలలో కూడా జగన్ పార్టీ జయకేతనం ఎగురవేయలేదు. ఇలా ఉంది ఈ రెండు పార్టీలట్రాక్ రికార్డు. మరి ఈ సారైనా రెండు పార్టీలు తమ చరిత్రను తిరగరాస్తాయా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story