Sun Dec 22 2024 23:23:11 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : బయటకు రావా జగనూ... భరోసా ఇవ్వవా...కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు బాబూ
ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు రోజులవుతుంది. వైసీపీ దారుణ ఓటమిని చవి చూసింది. జగన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు రోజులు మాత్రమే అవుతుంది. వైసీపీ దారుణ ఓటమిని చవి చూసింది. జగన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అంత వరకూ ఓకే. అంతటితో పని అయిపోయిలేదు. అసలు బాధ్యత ఇక ఐదేళ్ల పాటు ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే దారుణ ఓటమితో నేతల నుంచి క్యాడర్ వరకూ నిరాశా నిస్పృహలోకి వెళ్లిపోయారు. అనేక చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదవుతున్నాయి. వారికి ధైర్యం కల్పించాలంటే బయటకు రావాలి. వారికి భరోసా కల్పించాలి. అది విస్మరించి ఇంటికే పరిమితమయితే క్యాడర్ మరింత జావగారి పోయే అవకాశముంది.
ఓటమి ఎవరికీ ...
ఓటమి ఎవరికీ కొత్తకాదు.. శాశ్వతం కాదు. ఓటమితో ఎన్నో నేర్చుకోవచ్చు. గెలుపు అహాన్ని పెంచితే.. ఓటమిని ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ఉండాలి. సముద్రంలో అల పడి మళ్లీ తిరిగి లేస్తుంది. గెలుపోటములు కూడా అంతే. ఊహించని ఫలితాలు షాక్ కుగురి చేసి ఉండవచ్చు. కానీ అది ఒకరోజుకే పరిమితమవ్వాలి. ఇప్పుడు జగన్ ముందున్న ఏకైక మార్గం అదే. ఇప్పటి వరకూ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో పోలీసు భద్రత వలయం మధ్య ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా అలా కూర్చుంటే కుదరదు. నేతలతో ముందు సమావేశమవ్వాలి. వారిని ఉత్తేజ పర్చాలి. నేరుగా రాష్ట్ర పర్యటనలు ఇప్పటికిప్పుడు చేయాల్సిన పనిలేదు. ముందుగా నేతలతో సమావేశాలను నిర్వహించాలి. వారి నుంచి ఓటమికి కారణాలేంటన్నది ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. నిర్మొహమాటంగా వారు ఓటమికి గల కారణాలను చెప్పమనాలి.
ఫీడ్ బ్యాక్ తీసుకోవడానికి...
అప్పుడే అసలైన కారణాలు అర్థమవుతాయి. భవిష్యత్ లో ఆ తప్పులు చేయకుండా ఉండేేందుకు కొంత ఉపయోగపడుతుంది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు నాయుడు జిల్లాల వారీగా వెళ్లి అక్కడ నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి నుంచి మొదలు పెడితే కానీ ఐదేళ్లకు మళ్లీ అందుకోలేని పరిస్థితి. అందుకే జగన్ ఇంట్లో ఓటమికికుంగిపోయి కూర్చున్నారన్న అపవాదును మూటగట్టుకోవడం మంచిది కాదు. అది నాయకత్వ లక్షణం కూడా కాదు. జగన్ ను తమ హీరోగా ఇప్పటికీ భావించే నేతలు, కార్యకర్తలకు తాను ఓటమికి ఏ మాత్రం భయపడబోనన్న సంకేతాలను బలంగా పంపాలి. అవసరమైతే వారి వద్దకు నేతలను పంపించగలిగాలి. నేతలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. వారిని ముందు బయటకు తీసుకువచ్చి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించుకోవాలని నచ్చ చెప్పగలిగాలి.
ధైర్యాన్ని రూనిపోయడానికి...
అలాగే ఏం జరిగినా కార్యకర్తలకు తాను, పార్టీ అండగా ఉంటుందన్న ధైర్యాన్ని నూరిపోయాలి. న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని చెప్పాలి. ఇదీ కార్యకర్తలు కోరుకుంటుంది. కానీ ఫలితాలు వచ్చి రెండు రోజులే అయి ఉండవచ్చు. కేవలం మీడియా ముందుకు వచ్చి కారణాలు చెప్పి ఊరుకుంటే సరిపోదు. ఓటమి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రజల మనసులను మళ్లీ గెలుచుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇంకా ప్రభుత్వం ఏర్పడక పోవచ్చు. కానీ ముందుగా పార్టీ అధినేతగా క్యాడర్ లో ఉన్న భయం పోగొట్టాల్సిన బాధ్యత జగన్ దే.. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ బాధ్యత నుంచి ఎన్ని రోజులు తప్పించుకోవాలని చూసినా పార్టీకి క్షేత్రస్థాయిలో అంత డ్యామేజే అవుతుందన్నది మాత్రం అంతే యదార్థం. అందుకే జగన్ బయటకు వస్తారన్న ఆశతో క్యాడర్ ఎదురు చూస్తుంది. మరి జగన్ ఏం చేస్తారన్నది చూడాలి.
Next Story