Mon Dec 23 2024 00:57:35 GMT+0000 (Coordinated Universal Time)
TDP : కన్నా ను సైడ్ చేసిందెవరు? ఆయనంతట ఆయనే తప్పుకున్నారా? లేక తప్పించారా?
కన్నా లక్ష్మీనారాయణ సీనియర్ నేత. అయితే ఆయన సత్తెనపల్లికే పరిమితం కావడం పార్టీలో చర్చనీయాంశమైంది
కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లికే పరిమితం చేశారు. లేదా ఆయనే అక్కడి నుంచి బయటకు వచ్చేందుకు ఇష్టపడ లేదా? అన్నది ఇప్పుడు కాపు సామాజికవర్గంలో చర్చ జరుగుతుంది. కన్నా లక్ష్మీనారాయణ సీనియర్ నేత. కాంగ్రెస్ లో సుదీర్థకాలం ఆయన ప్రయాణం సాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన మంత్రిగా ఎక్కువ కాలం పనిచేశారు. గుంటూరు రాజకీయాలను శాసించారు. ఆయన గుంటూరు జిల్లాకే పరిమితమైన నేత కాదు. రాష్ట్ర స్థాయినేతగా గుర్తింపు పొందారు. కాంగ్రెస్ లో ఉన్నంత వరకూ కాపు సామాజికవర్గానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేవారు. ఆయనకు ఆ సామాజికవర్గంలో మంచి పట్టుంది. కన్నా లక్ష్మీనారాయణను గుంటూరు వాసిగానే చూడరు. ఆయనను కాపు సామాజికవర్గంలో ఫైర్ బ్రాండ్ నేతగా చూస్తుంటారు.
మంచి పేరున్న కన్నాను..
కన్నా లక్ష్మీనారాయణకు కాపు సామాజికవర్గంలో మంచి పేరుంది. ఆయన చుట్టూ ఉన్న నేతలు కూడా వారే ఎక్కువ. ఆయనకు కులం ముద్ర వేయడం కరెక్ట్ కాకపోవచ్చు కానీ.. ఆ సామాజికవర్గంలో మంచి పట్టున్న నేతగా ముద్రపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన వరసగా పార్టీలు మారిపోయారు. తొలుత వైసీపీలో చేరాలని భావించారు. కానీ 2019 సమయంలో చివరి నిమిషంలో మనసు మార్చుకుని కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. చేరిపోవడమే తరువాయి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. అయితే ఆ ఎన్నికల్లో రాష్ట్రమంతటా పర్యటించి పార్టీ కోసం గట్టిగానే శ్రమించారు. అయినా నోటా కంటే ఎక్కువ ఓట్లు రాలేదు. ఆయన నరసరావుపేట పార్లమెంటు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బీజేపీలో మంచి పదవిని ఆశించారు.
బీజేపీలో పదవి ఆశించి...
కానీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినా కూడా బీజేపీ కన్నా లక్ష్మీనారాయణను పట్టించుకోలేదు. పోగా.. రెండేళ్లు పూర్తయిన తర్వాత ఆయనను పార్టీ అధ్యక్ష పదవి నుంచి పక్కకు తప్పించి సోము వీర్రాజుకు అప్పగించింది. అంతకుముందు జనసేన బీజేపీతో పొత్తుకు కూడా కన్నా లక్ష్మీనారాయణ సహకరించారు. తర్వాత బీజేపీలో ఇమడలేక టీడీపీలో చేరిపోయారు. జనసేనలో చేరతారని భావించినా చివరి నిమిషంలో తన చిరకాల ప్రత్యర్థి చంద్రబాబు చెంతకు చేరారన్న విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఆయన అందులోనే కొంత లాభం ఉంటుందని భావించారు. అయితే ఆయన నమ్మకం వమ్ముకాలేదు. కన్నా లక్ష్మీనారాయణకు కీలకమైన సత్తెనపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించడం కాకుండా.. ఏకంగా ఆయనకే టిక్కెట్ ను కేటాయించారు. అయితే సత్తెనపల్లిలో తొలుత కన్నా లక్ష్మీనారాయణ గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారు. కాని రాను రాను పోటీ తీవ్రంగా మారింది.
టీడీపీలో చేరిన తర్వాత...
వాస్తవానికి కన్నా లక్ష్మీనారాయణను రాష్ట్ర వ్యాప్తంగా తిప్పి కాపు సామాజికవర్గం ఓటర్లను సమీకరించాల్సిన సమయంలో చంద్రబాబు ఆయనను పక్కన పెట్టారన్న విమర్శలున్నాయి. కారణం తెలియదు కానీ.. కన్నా లక్ష్మీనారాయణ పేరు కూడా పార్టీలో పెద్దగా వినిపించడం లేదు. సత్తెనపల్లిలో గెలిచి కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మంత్రి అవుతానని ఆయన గట్టిగా భావిస్తున్నారు. కానీ రాష్ట్ర స్థాయి నేతగా కన్నా లక్ష్మీనారాయణ గుర్తింపు కోల్పోయినట్లే కనిపిస్తుంది. టీడీపీలో చేరిన తర్వాతనే ఈ పరిస్థిితి తలెత్తిందని ఆయన సన్నిహితులు సయితం వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన నియోజకవర్గాన్ని దాటి వెళ్లకపోవడంపై చర్చ జరుగుతుంది. మొత్తం మీద కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లిలో డూ ఆర్ డై గా పోటీ మారడంతో నియోజకవర్గం బోర్డర్ దాటడానికి ఇష్టపడటం లేదా? లేక పార్టీయే ఆయనను పక్కన పెట్టిందా? అన్నది మాత్రం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.
Next Story