Mon Dec 23 2024 12:46:08 GMT+0000 (Coordinated Universal Time)
TDP : డోన్ ముఖచిత్రం ఎలా ఉంది..? కేఈ వర్గం కోట్లకు సపోర్ట్ చేస్తుందా?
డోన్ నియోజకవర్గంలో కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డికి అనుకూల పవనాలు వీయడం లేదు. కేఈ వర్గం మద్దతు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఎన్నికలు ఒక్కో నియోజకవర్గంలో భిన్నమైన పరిస్థితి. కొన్ని నియోజకవర్గాల్లో కులాలు అభ్యర్థి గెలుపులో కీలకంగా మారనుండగా, మరికొన్నింటిలో ట్రాక్ రికార్డుతో పాటు పార్టీ కూడా గెలుపునకు కారణమవుతుంటుంది. మరికొన్ని నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతలే అభ్యర్థిని ఓడిస్తుండటం ఇప్పటి నుంచి కాదు.. ఎప్పటి నుంచో చూస్తున్నాం. ప్రస్తుతం డోన్ నియోజకవర్గంలోనూ పరిస్థితి అలాగే ఉంది. ఒకే కుటుంబానికి ఒకే టిక్కెట్ అన్న సూత్రంతో కర్నూలు జిల్లాలో పట్టున్న కేఈ, కోట్ల కుటుంబాలకు ఒక్క టిక్కెట్ మాత్రమే టీడీపీ అధినేత చంద్రబాబు కేటాయించారు. ఇప్పుడు అదే ఇబ్బందికి కారణమయింది.
దశాబ్దకాలంగా....
కోట్ల, కేఈ కుటుంబాలు కొన్ని దశాబ్దాలుగా బద్ధ శత్రువులు. రాజకీయ వైరంతో పాటు వ్యక్తి గత కక్షలు కూడా ఆ కుటుంబాల మధ్య ఉన్నాయన్నది కాదనలేని వాస్తవం. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు కోట్ల, కేఈ కుటుంబాలను ఒకటి చేశారు. ఒకే వేదికపై చేతులు చేతులు కలిపి తాను గ్రూపు రాజకీయాలకు చెక్ పెడుతున్నానని చంద్రబాబు చెప్పుకున్నారు. కానీ వారిద్దరూ చంద్రబాబు కోసం అయితే కలిశారు కానీ.. క్షేత్రస్థాయిలో మాత్రం వారి కదలికలు.. కలిసినట్లు కనపడటం లేదన్నది వాస్తవం. కోట్ల కుటుంబంలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి డోన్ నియోజవకర్గం టిక్కెట్ ఇవ్వగా, కేఈ కుటుంబంలో పత్తికొండ నియోజకవర్గం టిక్కెట్ ను శ్యాంబాబుకు చంద్రబాబు ఇచ్చారు.
చివరకు సోదరులు కూడా...
అయితే ఇప్పుడు డోన్ నియోజకవర్గంలో కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డికి ఆయన సోదరులే ఆయన వెంట నడవడటంలేదు. ఇక కేఈ వర్గం ఏ మేరకు మద్దతిస్తుందన్నది మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది. అలాగని డోన్ నియోజకవర్గంలో టీడీపీకి పట్టు లేదనికాదు. 1985, 1989 లో ఇక్కడి నుంచి కేఈ కృష్ణమూర్తి గెలిచారు. 1985లో కేఈ టీడీపీ నుంచి గెలవగా, 1989లో కాంగ్రస్ నుంచి విజంయ సాధించారు. 1999లో కేఈ ప్రభాకర్ టీడీపీ నుంచి విజయం సాధించారు. 2009లో కేఈ కృష్ణమూర్తి గెలిచారు. అప్పడు కూడా కోట్ల కుటుంబమే డోన్ లో ప్రత్యర్థిగా ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో కేఈ కుటుంబం ఇక్కడి నుంచి ఓటమి పాలయింది.
మంత్రి అవుతారనే?
గత రెండు ఎన్నికల్లో కోట్ల కుటుంబం కేఈ కుటుంబానికి మద్దతు తెలపలేదన్న అక్కసు వారిలో ఉంది. అలాగే ఇప్పుడు కోట్ల కుటుంబం వంతు వచ్చింది. ఇక్కడ వైసీపీ నుంచి మంత్రి బుగ్గనరాజేంద్ర నాధ్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన రెండుసార్లు గెలిచి హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు. ఆయన తొందరగా జనంలో కలసిపోడన్న పేరున్నా .. ఆయన చాలా రోజుల తర్వాత శాసనసభకు పోటీ చేస్తున్నారు. దీంతో ఆయన గెలిస్తే చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని కేఈ వర్గం సపోర్టుచేయదనే వారు కూడా ఉన్నారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి కర్నూలు పార్లమెంటుకు పోటీ చేయాలని ఉన్నా.. చంద్రబాబు డోన్ టిక్కెట్ ఇవ్వడంతో ఇప్పుడు ఈ ఎన్నిక ఇక్కడ రసకందాయంలో పడింది. ఇటీవల కోట్ల తన మనసులో మాటను కూడా బయటపెట్టారు. తాను కర్నూలు పార్లమెంటుకు పోటీ చేయాల్సి ఉందని, అయితే అనివార్య కారణాలతో పోటీ చేయలేకపోయానని కన్నీటి పర్యతంతమయ్యారు. గెలుపోటములు ఎవరది అన్నది ఇప్పుడు చెప్పలేకున్నా కోట్లకు మాత్రం కేఈ వర్గం మద్దతు చేయదన్నది నియోజకవర్గంలో వినిపిస్తున్న టాక్.
Next Story