Thu Dec 19 2024 08:54:50 GMT+0000 (Coordinated Universal Time)
Pinnnelli : పిన్నెల్లి పొలిటికల్ ఫ్యూచర్ ఇక క్లోజ్ అయినట్లేేనా? పీకల్లోతు కష్టాల్లో పడ్డారా?
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయ భవిష్యత్ గందరగోళంలో పడింది.
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయ భవిష్యత్ గందరగోళంలో పడింది. ఆవేశంతో ఆయన చేసిన పని చివరకు రాజకీయ జీవితానికే గ్యాప్ ఇచ్చేలా తయారయింది. పిన్నెల్లి నేరం రుజువయితే వెళితే ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడటం ఖాయమని న్యాయనిపుణులు చెబుతున్నారు. రెండేళ్లు జైలు జీవితం గడిపినా ఇక రాజకీయంగా ఆయన పోటీకి అనర్హడవుతాడు. ఇది తెలిసిన ఆయన అనుచరులు ఆందోళనలో ఉన్నారు. అందులో మామూలు కేసు కాదు. ఎన్నికలకు సంబంధించిన కేసులు చాలా సీరియస్ గా తీసుకుంటుంది ఎన్నికల కమిషన్. చట్టాలు కూడా అవే చెబుతున్నాయి. ీ ఈ నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయ భవితవ్యంపైనే పల్నాడులో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది.
రెండు దశాబ్దాలుగా...
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సీనియర్ నేత. ఎన్నికల నిబంధనలు ఆయనకు కొత్తేమీ కాదు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు. 2009 నుంచి వరసగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలుస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకూ మాచర్ల నుంచి ఆయన నాలుగు సార్లు గెలిచారు. 2009, 2012 ఉప ఎన్నిక, 2014, 2019 ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈసారి కూడా విజయం తనదేనన్న ధీమాతో ఉన్నారు. అయితే పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను పగులకొట్టడం అనేది తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. కానీ పిన్నెల్లి ఆవేశంతో ఆ పనిచేసినా.. చివరకు ఆయన రాజకీయ జీవితానికే ఫుల్ స్టాప్ పడేలా కొని తెచ్చుకున్నారన్న వాదన బలంగా వినిపిస్తుంది.
బలమైన సెక్షన్లు పెట్టి...
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయవచ్చు. ఆయనను అరెస్ట్ చేసిన తర్వావ బెయిల్ కూడా వెంటనే వచ్చే అవకాశం లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఆయనపై ఇప్పటికే ఐపీసీ 143, 147, 448, 427, 353, 452, 120 బి, ఆర్పీ చట్టంతో పాటు 131, 135సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అంటే పీకల్లోతు కష్టాల్లో పిన్నెల్లి కూరుకుపోయారనే చెప్పాలి. ఆయన విదేశాలకు పారిపోకుండా అన్ని ఎయిర్ పోర్టులను ఏపీ పోలీసులు అప్రమత్తం చేశారు. లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని వెంటనే అరెస్ట్ చేయాలని, సాయంత్రం ఐదు గంటలలోపు తమకు నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరిందంటే ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వైసీపీనేతల వాదన ఇలా...
అయితే ఆ పోలింగ్ కేంద్రంలో వైసీపీ ఏజెంట్లను బయటకు నెట్టేసి టీడీపీ నేతలు రిగ్గింగ్ కు పాల్పడుతున్నారన్న సమాచారంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడకు వెళ్లాడని వైసీపీ నేతలు చెబుతున్నారు. అక్కడ వైసీపీ ఏజెంట్లు లేకపోవడంతో ఆగ్రహం చెంది ఈవీఎంలను పగులగొట్టారని, క్షణికావేశంలో చేసిన పనేనని చెబుతున్నారు. వాస్తవానికి అది టీడీపీకి అనుకూలమైన పోలింగ్ కేంద్రం. అక్కడ రిగ్గింగ్ జరగకుండా అడ్డుకునేందుకే పిన్నెల్లి అక్కడకు వెళ్లారని వైసీపీ నేతలు వాదిస్తున్నా అడ్డంగా దొరికిపోయిన తర్వాత చట్ట ప్రకారం శిక్ష తప్పదంటున్నారు న్యాయనిపుణులు. మొత్తం మీద రెండు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి క్షణికావేశంతో చేసిన పని ఆయనకు రాజకీయ ఇబ్బందులు తెచ్చె పెట్టేలా ఉంది.
Next Story