Mon Dec 23 2024 03:07:50 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : చినబాబు ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండలేం.. పక్కచూపులు చూడకుండా
నారా లోకేష్ నిజంగానే ధైర్యంగానే ముందుకెళుతున్నాడు. మంగళగిరిలో పోటీ చేయడమంటే ఆషామాషీ కాదు.
నారా లోకేష్ నిజంగానే ధైర్యంగానే ముందుకెళుతున్నాడు. మంగళగిరిలో పోటీ చేయడమంటే ఆషామాషీ కాదు. ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ గెలిచి కొన్ని దశాబ్దాలు అవుతుంది. గత ఎన్నికల్లోనూ ఆయన మంగళగిరిలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అక్కడి విషయాలను అన్ని తెలిసినా సరే మరోసారి లోకేష్ ధైర్యంగా బరిలోకి దిగారంటే ప్రత్యర్థులు కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే లోకేష్ తీసుకున్న నిర్ణయం నిజంగా అభినందనీయమనే చెబుతున్నారు. ఏమాత్రం అధైర్య పడకుండా తాను తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఏపీ ఎన్నికల వేళ రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.
అవకాశాలున్నా...
వాస్తవానికి లోకేష్ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేసే వీలుంది. ఎందుకంటే లోకేష్ పోటీ చేస్తానంటే పక్కకు తప్పుకుని మరీ టీడీపీ నేతలు దారి ఇస్తారు. రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతారు. టీడీపీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు ఏపీలో అనేకం ఉన్నాయి. గత రికార్డులను పరిశీలించనక్కర లేదు. అక్కడ పోటీ చేసి నేరుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టే వీలుంది. అంత ఎందుకు తన మామయ్య పోటీ చేసే హిందూపురంలో పోటీ చేయవచ్చు. నందమూరి బాలకృష్ణ ఆనందంగా బరి నుంచి తప్పుకుంటారు. అలాగే కృష్ణాజిల్లాలో మరో బలమైన నియోజకవర్గం పెనమలూరు ఉంది. అక్కడి నుంచి కూడా పోటీ చేసే వీలుంది. కానీ లోకేష్ మాత్రం అలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. పక్కచూపులు చూడలేదు. తన గోల్ ఏంటో తాను ముందుగానే డిసైడ్ చేసుకున్నట్లు కనపడుతుంది.
మార్చడం వంటివి...
కానీ లోకేష్ మాత్రం నియోజకవర్గాలను మార్చడం వంటి నిర్ణయం తీసుకోలేదు. తిరిగి మంగళగిరి నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. అక్కడ చేనేత కార్మికులు ఎక్కువ అని తెలుసు. ప్రత్యర్థి పార్టీ అదే సామాజికవర్గానికి చెందిన నేతను తమ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేస్తుందనీ తెలుసు. కానీ తాను మాత్రం పోయిన చోటే వెతుక్కోవాలనుకున్నారు. మంగళగిరిలో పోటీకి దిగారు. తాను ఇక్కడి నుంచే గెలిచి శాసనసభలో అడుగుపెట్టాలని లోకేష్ నిర్ణయించుకున్నట్లుంది. అందుకే పలువురు సీనియర్ నేతలు ఇచ్చిన సలహాలు కూడా ఆయన ఏ మాత్రం వినిపించుకోలేదు. తాను మంగళగిరి నుంచి పోటీ చేసి ప్రత్యర్థి పార్టీలు చేసే విమర్శలకు చెక్ పెట్టాలన్న నిర్ణయానికి ఆయన వచ్చారు. దీంతో లోకేష్ ధైర్యానికి టీడీపీ నేతలతో పాటు మిగిలిన పార్టీ నేతలు కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.
వెరవకుండా...
మరోవైపు తమ మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాకల నుంచి పోటీ చేశారు. కానీ ఈసారి పిఠాపురం నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు. లోకేష్ మాత్రం వెరవలేదు. భయపడలేదు. తాను మాత్రం మంగళగిరి నుంచే పోటీ చేస్తానని తండ్రితో చెప్పి తొడగొట్ట మరీ బరిలోకి దిగుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో లోకేష్ వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. కానీ తాను గెలుస్తానన్న ధీమాతో చినబాబు ఉన్నారు. తాను ఈ ఐదేళ్ల పాటు మంగళగిరిలో చేసిన సేవలతో పాటు ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి తనను ఖచ్చితంగా గెలిపిస్తుందన్న ధీమాతో ఉన్నారు. మొత్తం మీద ఇతర నేతలను పోల్చుకుంటే లోకేష్ మాత్రం తాను తీసుకున్న నిర్ణయంతో పార్టీ క్యాడర్ లో హీరోగా మారిపోయడనడంలో వాస్తవముంది.
Next Story