Sat Nov 23 2024 00:59:27 GMT+0000 (Coordinated Universal Time)
Raghu Ramakrishna Raju : సీటు ఇవ్వకపోతే ఇక రచ్చ రచ్చేనట.. కాసుకోండి సాములూ
వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుకు ఉండి టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది
వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆశలు నెరవేరతాయా? అన్నది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు నుంచి వైసీీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొంది ఆ తర్వాత పార్టీ అధినాయకత్వాన్ని ధిక్కరించిన రఘురామ కృష్ణరాజు తన పదవికి చివర వరకూ రాజీనామా చేయలేదు. ఆయన అంటే మొన్నటి వరకూ నరసాపురానికే రాలేదు. ఆయనపై అన్ని కేసులు నమోదయి ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా తాను నరసాపురం వస్తే అరెస్ట్ చేస్తారని భావించి ఆయన పండగలకు, పబ్బాలకు కూడా దూరంగా ఉన్నారు.
సీటు స్వైప్ చేద్దామనుకుంటే...
అయితే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఆయన అక్కడే ఉంటున్నారు. అయితే ఇప్పటి వరకూ రఘురామ కృష్ణరాజుకు సీటు ఖరారు కాలేదు. నరసాపురం ఎంపీ సీటు బీజేపీకి కేటాయించడం అక్కడ ఆ పార్టీ అభ్యర్థిని ప్రకటించడంతో కొంత క్లారిటీ వచ్చింది. నరసాపురం పార్లమెంటు నుంచి తనకు పోటీ చేసే అవకాశాలు లేవని ఆయన గ్రహించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏలూరు పార్లమెంటు సీటును తీసుకుని, నరసాపురం టీడీపీకి వదిలేయాలన్న పంపిన ప్రతిపాదనకు కూడా బీజేపీ నుంచి సుముఖత వ్యక్తం కాలేదని తెలిసింది. ఈ మేరకు నరసాపురం ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాసవర్మ బరిలో ఉంటారని ఎన్నికల ఇన్ఛార్జి సిద్ధార్థ సింగ్ నాధ్ చేసిన ప్రకటనతో ఆయనకు క్లారిటీ వచ్చింది.
ఉండి నుంచి పోటీ చేయాలనుకుంటే...
దీంతో ఆయన శాసనసభ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. అయితే తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో తనకు పట్టున్న ఉండి నియోజకవర్గం నుంచి రఘురామ కృష్ణరాజు పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ను తప్పించి ఆయన స్థానంలో రఘురామ కృష్ణరాజుకు ఇవ్వాలన్న ప్రతిపాదన టీడీపీ అధినేతలో ఉందని కనపడటంతో అక్కడ రచ్చ మొదలయింది. రామరాజును తప్పిస్తే ఊరుకోబోమంటూ టీడీపీ ఉండి నేతలు, కార్యకర్తలు పార్టీ అధినాయకత్వానికి పెద్ద యెత్తున వార్నింగ్ లు పంపుతున్నారు. రచ్చ చేస్తామని చెబుతూ రెడీ అయపోతున్నారు. అందులోనూ చంద్రబాబు ఇచ్చిన మాటను వెనక్కు తీసుకోవడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.
మాట ఇచ్చి తప్పితే...?
ఎన్నికలకు ముందు చంద్రబాబు ఒక కీలక ప్రకటన చేశారు. పార్టీని నమ్ముకుని ఉన్న ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇస్తామని ప్రకటించారు. ఆల్ మోస్ట్ అందులో అందరికీ ఇచ్చారు అలాగే టీడీపీ జాబితాలో రామరాజు పేరు ఉండి నుంచి వినిపించింది. అయితే రఘురామ కృష్ణరాజు అంశం రావడం, ఆయనకు ఎక్కడో ఒక చోట సీటు ఇవ్వాల్సి రావడంతో ఉండి సీటు ఇవ్వకతప్పని పరిస్థిత ఏర్పడిందంటున్నారు. రఘురామ కృష్ణరాజు కూడా తాను ఎక్కడో ఒక చోట నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు. ఉండి నుంచి రామరాజును తప్పించి రఘురామ కృష్ణరాజును అభ్యర్థిగా ప్రకటిస్తే మళ్లీ రచ్చ ప్రారంభమవుతుంది. చాకిరేవు పెట్టడానికి తెలుగు తమ్ముళ్లు సిద్ధంగా ఉన్నారంటున్నారు. మరి చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందన్నది వేచి చూడాల్సి ఉంది.
Next Story