Sat Jan 11 2025 05:57:15 GMT+0000 (Coordinated Universal Time)
Narasaraopet : లోకల్.. నాన్ లోకల్.. ఎవరిది గెలుపు.. గత రికార్డులు ఏం చెబుతున్నాయి?
నరసారావుపేట పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికలు ఈసారి ఆసక్తికరంగా సాగుతున్నాయి
నరసారావుపేట పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికలు ఈసారి ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఎవరిది గెలుపు అన్నదానిపై బెట్టింగ్ లు ఇప్పటి నుంచే జోరుగా సాగుతున్నాయి. ఒకరు లోకల్.. మరొకరు నాన్ లోకల్.. అయితే ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ ప్రకారం చూస్తే ఈ పార్లమెంటు నియోజకవర్గంలో గెలుపు దోబూచులాడుతుందన్నది విశ్లేషకుల అంచనా. నరసారావుపేట పార్లమెంటు నియోజకవర్గం ఫలితాలపై ఇప్పటి నుంచే అనేక మంది జోరుగా బెట్టింగ్ లు చేస్తున్నారంటే రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారిందనడంలో అతి శయోక్తి కాదు. ఇద్దరు యువనేతల మధ్య సం"కుల" సమరంగా మారిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఇక్కడ కాసు వెంకటకృష్ణారెడ్డి తప్ప వరసగా రెండు సార్లు ఎవరూ గెలవలేదు
ఇద్దరు యువనేతలు...
నరసారావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో ఇద్దరు యువనేతలు తలపడుతున్నారు. అధికార వైసీపీ నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, టీడీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన లావు శ్రీకృష్ణదేవరాయలు అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. కూటమి అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రజల వద్దకు వెళుతుండగా, తాను ఒంటరిగానే ఉన్నానని, ఆదరించాలని కోరుతూ అనిల్ కుమార్ యాదవ్ జనంలోకి దూసుకెళుతున్నారు. ఇద్దరిదీ వేర్వేరు సామాజికవర్గాలు. ఒకరు బలమైన కమ్మ సామాజికవర్గం నేత కాగా, మరొకరు బలహీన వర్గాలకు చెందిన యాదవ్ సామాజికవర్గానికి చెందిన నేత. ఇద్దరూ తలపడుతుండటంతో ఈ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.
ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో...
నరసారావుపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. గురజాల, నరసరావుపేట, పెదకూరపాడు, మాచర్ల, వినుకొండ, సత్తెనపల్లి నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ రెండు పార్టీలూ బలంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గం గత పరిస్థితులు చూస్తే ఇటు కమ్మ సామాజికవర్గం నేతలు ఎంపీగా ఎన్నికయినా.. ఎక్కువ సార్లు రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలే పార్లమెంటు సభ్యులయ్యారు. వరసగా 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి రాయపాటి సాంబశివరావు, 2019లో వైసీపీ నుంచి లావు కృష్ణదేవరాయలు గెలిచారు. అయితే ఈసారి గెలుపు విషయంలో మాత్రం నాడి అందడం లేదు. ఇద్దరికీ సమానమైన ఛాన్స్లు ఉన్నాయన్నది అంచనా.
నెల్లూరు నుంచి వచ్చిన....
గతంలో నెల్లూరు నుంచి వచ్చిన నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డిలు కూడా ఇక్కడి నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అయితే ఇక్కడ రెడ్డి సామాజివకర్గంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువగా ఉన్నారు. కమ్మ సామాజికవర్గం ఓటర్లున్నప్పటికీ గెలిపించే స్థాయలో మాత్రం లేరు. కానీ దీని పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో గురజాల, నరసారావుపేట, మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ బలంగా కనిపిస్తుంది. అదే సమయంలో పెదకూరపాడు, వినుకొండ, సత్తెనపల్లిలో టీడీపీ బలంగా ఉంది. ఈ పరిస్థితుల్లో పోటీ మాత్రం మామూలుగా లేదు. అందుకే నరసారావుపేటలో విజయం చివర వరకూ దోబూచులాడక తప్పదన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మరి చివరకు ఎవరిది గెలుపు అన్నది చూడాల్సి ఉంది.
Next Story