Fri Jan 10 2025 13:31:34 GMT+0000 (Coordinated Universal Time)
Nidadavolu : నిడదవోలు జనసేనకు దక్కుతుందా? ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే మాత్రం?
నిడదవోలు నియోజకవర్గం ఈసారి ఏపీ రాజకీయాలలో మరో హాట్ టాపిక్ గా మారనుంది
నిడదవోలు నియోజకవర్గం ఈసారి ఏపీ రాజకీయాలలో మరో హాట్ టాపిక్ గా మారనుంది. అక్కడి నుంచి జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ పోటీ చేస్తుండటమే ఇందుకు కారణం. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గెడ్డం శ్రీనివాసనాయుడిని ఆయన ఢీకొడుతున్నారు. ఈ నియోజకవర్గానికి ఒక సెంటిమెంట్ ఉంది. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో ఈ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి ఒకసారి గెలిచిన వాళ్లు రెండో సారి కూడా గెలుస్తూ వస్తున్నారు. అదే జరిగితే ఇక్కడ మరోసారి వైసీపీ అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు గెలుపొందాలి. అలా కాకుండా కందుల దుర్గేష్ గెలిస్తే మాత్రం హిస్టరీని ఛేంజ్ చేసినట్లే అవుతుంది.
రెండుసార్లు గెలిచి...
2009లో నిడదవోలు నియోజకవర్గం ఏర్పాటయిన వెంటనే బూరుగుపల్లి శేషారావు ఇక్కడ విజయం సాధించారు. ఆయన తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ గాలి బలంగా వీచినా టీడీపీ అభ్యర్థిగా ఆయన గెలుపొందడం విశేషం. అదేసమయంలో 2014లో రాష్ట్ర విభజన తర్వాత కూడా బూరుగుపల్లి శేషారావు టీడీపీ నుంచి పోటీ చేసి మరో సారి విజయం సాధించారు. అప్పుడు రాష్ట్ర విభజన జరగడంతో పాటు జనసేన, బీజేపీ, టీడీపీ కాంబినేషన్ లో ఎన్నికలు జరగడం కూడా ఆయనకు కలసి రావడంతో వరసగా రెండోసారి విజయం సాధించారు. పదేళ్ల పాటు నిడదవోలుకు ఎమ్మెల్యేగా బూరుగుపల్లి శేషారావు సేవలందించారు.
జగన్ గాలిలో...
కానీ 2019 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. జగన్ ప్రభంజనం బలంగా వీయడంతో బూరుగుపల్లి శేషారావు వైసీపీ అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు చేతులో ఓడిపోయారు. అయితే ఈ ఎన్నికలలో నిడదవోలు నియోజకవర్గం పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. దీంతో ఇక్కడి నుంచి కందుల దుర్గేష్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అత్యధిక ఓట్లు సాధించారు. అయినా అక్కడ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరికి టీడీపీ టిక్కెట్ ఇవ్వాల్సి రావడంతో ఆయన కోసం దుర్గేష్ ను నిడదవోలుకు షిఫ్ట్ చేశారు. దీంతో నిడదవోలు నుంచి ఆయన బరిలో ఉన్నారు.
వరసగా రెండుసార్లు...
అయితే వరసగా రెండు సార్లు గెలిపిస్తున్న నిడదవోలు ప్రజలు ఈసారి ఎవరికి జై కొడతారన్నది ఆసక్తికరంగా ఉంది. ఇద్దరు ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. ఎవరు గెలిచినా ఐదారు వేల ఓట్ల తేడాతోనే గెలుస్తూ వస్తున్నారు. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కలసి పోటీ చేస్తుండటంతో కాపు సామాజికవర్గం ఓటర్లు తనకు దన్నుగా నిలుస్తారని కందుల దుర్గేష్ గట్టి నమ్మకంతో ఉన్నారు. అదే సమయంలో శ్రీనివాస్ నాయుడు కూడా జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు తనను గెలుపు బాట పట్టిస్తాయన్న విశ్వాసంతో ఉన్నారు. మొత్తం మీద నిడదవోలులో ఈసారి గాజుగ్లాసు మెరుస్తుందా? ఫ్యాన్ తిరుగుతుందా? అన్నది మాత్రం చివరి వరకూ చెప్పలేని పరిస్థితి. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.
Next Story