Mon Dec 23 2024 03:56:58 GMT+0000 (Coordinated Universal Time)
Ap Elections : ఎన్నారైలు వచ్చాశారోచ్... ఇక్కడి ఎన్నికలను ప్రభావం చేయగలరా?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్ఆర్ఐలు కీలకంగా మారారు. వారు తమ సొంత ఊళ్లకు వచ్చి ప్రచారంలో పాల్గొంటున్నారు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్ఆర్ఐలు కీలకంగా మారారు. వారు తమ సొంత ఊళ్లకు వచ్చి ప్రచారంలో పాల్గొంటున్నారు. అన్ని రకాలుగా పార్టీలను ఆకట్టుకునేలా ఎన్ఆర్ఐలు రంగంలోకి దిగారు. ఉన్నత ఉద్యోగాలతో పాటు వ్యాపారాలు చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన అనేక మంది విదేశాల్లో స్థిరపడి పోయారు. వాళ్లకు ఇక్కడ ఓటు హక్కు కూడా లేదు. అయితే తాము అభిమానించే పార్టీ ఏపీలో అధికారంలోకి రావాలని భావించి ఎన్నికలకు ముందుగానే ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నారు. తమకు పరిచయం ఉన్న కుటుంబాలు, గ్రామాలలో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఫలానా పార్టీకి మద్దతిస్తే జరిగే ప్రయోజనాల గురించి వివరిస్తున్నారు.
సంఘాలుగా విడిపోయి....
అమెరికాలాంటి అగ్రరాజ్యంలోనూ సామాజికవర్గం పరంగా అక్కడ సంఘాలు ఏర్పడిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తానా ఇక్కడ ఒక పార్టీకి మద్దతిస్తుండగా, అటా మరొక పార్టీకి మద్దతిస్తూ తమ సామాజికవర్గం ఇక్కడ అధికారంలోకి రావాలని కోరుకుంటుంది. అక్కడి నుంచే సోషల్ మీడియాలో ప్రచారం చేసే వారు ఎక్కువగా ఉన్నారు. తమ పార్టీలకు ఓటేయాలని అక్కడి నుంచే ప్రచారం చేసే వారు కొందరైతే వ్యాపారాలకు కుటుంబ సభ్యులకు అప్పగించి కొందరు.. ఉద్యోగాలకు సెలవులు పెట్టి మరికొందరు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ఇక్కడ పార్టీల గెలుపు కోసం ప్రచారాన్ని చేస్తున్నారు. ఎన్ఆర్ఐల మాటకు విశ్వసనీయత ఉంటుందని పార్టీలు కూడా నమ్ముతాయి.
అమెరికా వంటి దేశాల్లో...
అందుకే వారికి రెడ్ కార్పెట్ వేస్తాయి. ఏపీలో ఉన్న టీడీపీ, వైసీపీకి అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి చోట్ల పార్టీ శాఖలను కూడా ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. పార్టీ ఆవిర్భావం రోజు.. లేకుంటే అధినేత పుట్టిన రోజు ఇలా విదేశాల్లోనూ పార్టీ జెండా ఎగిరేలా చర్యలు తీసుకుంటూ ప్రపంచం దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ తమకు అనుకూలమైన పార్టీ అధికారంలోకి వస్తే విదేశాలలో ఉన్న తమకు ప్రత్యేకంగా ఏమీ లాభం లేకపోయినా స్వగ్రామంలో కొంత పట్టు ఉంటుందన్న ఆలోచనతోనే ఎన్నారైలు ఎక్కువమంది రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. ఇందులో టీడీపీ ఒకింత ముందంజలో ఉందనే చెప్పాలి.
రెండు పార్టీలకు చెందిన...
ఇప్పటికే టీడీపీకి చెందిన ఎన్నారైలు గ్రామాలకు వెళ్లిపోయి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అవసరమైతే కష్టమైన నియోజకవర్గాల్లో అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించేందుకు కూడా వెనుకాడటం లేదు. టీడీపీకి చెందిన ఎన్నారైల సమావేశంలో కోమటి జయరాం చేసిన వ్యాఖ్యలు ఇటీవల వివాదం అయిన సంగతిని కూడా చూశాం. ఈరోజు వైసీపీ తరపున ఎన్నికల ప్రచారంలో ఎన్నారైలు పాల్గొంటున్నార. ఏపీ వై నీడ్స్ జగన్ పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. అభివృద్ధి, సంక్షేమంపై ఎన్నారైల ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తం నాలుగు బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నారై బృందాల పర్యటన నేటి నుంచి సాగనుంది. మరి ఎన్ఆర్ఐలు ఏ మేరకు ఈ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తారన్నది చూడాల్సి ఉంది.
Next Story