Sat Nov 23 2024 02:24:17 GMT+0000 (Coordinated Universal Time)
Congress : కాంగ్రెస్ ఈసారి శానసభలో కాలుమోపేటట్లే ఉందా? షర్మిల వ్యూహం ఎంత వరకూ సక్సెస్ అవుతుంది?
రాష్ట్ర విభజన చేశారన్న కారణంతో ఆంధ్రప్రదేశ్ లో జనం పదేళ్లు కాంగ్రెస్ పార్టీ వైపు చూడలేదు. పూర్తిగా పక్కన పెట్టేశారు
రాష్ట్ర విభజన చేశారన్న కారణంతో ఆంధ్రప్రదేశ్ లో జనం పదేళ్లు కాంగ్రెస్ పార్టీ వైపు చూడలేదు. పూర్తిగా పక్కన పెట్టేశారు. తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రమిచ్చినా అక్కడ పదేళ్ల తర్వాతనే అధికారాన్ని అక్కడి జనం అప్పగించారు. తెలంగాణలో చట్టసభల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత కల్పించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఒక్కరు కూడా శాసనసభలోకి అడుగు పెట్టలేదు. పదేళ్ల తర్వాత మాత్రం కాంగ్రెస్ సభ్యుడు ఒకరైనా చట్టసభలోకి అడుగు పెట్టే అవకాశముందన్న అంచనాలు మాత్రం బలంగానే వినిపిస్తున్నాయి. రెండు ప్రధాన పార్టీల మధ్య ఓట్ల చీలికతో కాంగ్రెస్ కొన్ని నియోజకవర్గాల్లో లబ్దిపొందే అవకాశాలున్నాయన్న అంచనాలు వినపడుతున్నాయి.
మడకశిరలో ...
ప్రధానంగా సీనియర్ నేతలను ఈసారి బరిలోకి దింపుతున్నారు. ముఖ్యంగా మడకశిర నియోజకవర్గంలో సాకే శైలజానాధ్ పోటీ చేస్తున్నారు. ఆయన ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. మరోవైపు టీడీపీ నుంచి గత ఎన్నికల్లో ఓటమిపాలయిన బండారు శ్రావణి బరిలో ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మన్నెపాకుల వీరాంజనేయులు పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురి మధ్య పోటీ తీవ్రంగానే ఉంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే సాకే శైలజానాధ్ ను కూడా తీసిపారేసే నేత కాదు. ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. సొంత వర్గం కూడా ఉంది. అందుకే ఈ నియోజకవర్గంపైన కాంగ్రెస్ కు ఒకరకంగా ఆశలు ఉన్నాయనే చెప్పాలి.
హోప్స్ ఉండటంతో...
ఇక మరో కీలక నియోజకవర్గం చీరాల. ఇక్కడ టీడీపీ నుంచి మద్దులూరు మాలకొండ యాదవ్ పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి కరణం వెంకటేశ్ బరిలో ఉన్నారు. చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆమంచి కృష్ణమోహన్ సిద్ధమవుతున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన పోటీ చేసే అవకాశాలున్నాయి. ఎందుకంటే జనంలో గుర్తు సులువుగా వెళ్లే అవకాశముండటం, గతంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి ఉండటంతో ఆమంచి కృష్ణమోహన్ కూడా చీరాలలో గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే చీరాల నియోజకవర్గంపైన కూడా కాంగ్రెస్ అధినాయకత్వం ఎక్కువగా హోప్స్ పెట్టుకుంది.
సీట్లు దక్కని నేతలు...
దీంతో పాటు అనేక నియోజకవర్గాల్లో వైసీపీలో సీట్లు రాని సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. వారందరితో కాంగ్రెస్ కు కొంత బలం పెరిగిందనే చెప్పాలి. ముఖ్యంగా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలైన చింతలపూడి, నందికొట్కూరు, పూతలపట్టు, పి.గన్నవరం వంటి నియోజకవర్గాల నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో పాటు వైఎస్ షర్మిల నాయకత్వం కూడా కొంత మేర ఓట్లను తెచ్చి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ ఈసారి ఏపీలోని శాసనసభలో అడుగుపెట్టే అవకాశాలున్నాయన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. మరోవైపు కమ్యునిస్టుల మద్దతు కూడా ఆ పార్టీకి కొంత కలసి వచ్చే అంశంగానే భావిస్తున్నారు. చూద్దాం.. గుర్రం ఎగరవచ్చేమో.
Next Story