Mon Nov 04 2024 18:21:14 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : పిఠాపురంలో గాజుగ్లాసుకు పొంచి ఉన్న ప్రమాదం.. వ్యూహం మార్చిన ప్రత్యర్థులు
పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించేందుకు ప్లాన్ వేశారు. అదేపేరు గల వ్యక్తితో నామినేషన్ వేయించనున్నారని ప్రచారం జరుగుతుంది
తమిళనాడులో ఒకే పేరుగల అనేక మంది పన్నీర్ సెల్వం పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఎన్నికల బరిలోకి దిగారు. వారందరికీ ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. పన్నీర్ సెల్వంతో పాటు మరో నలుగురు పన్నీర్ సెల్వంలు కూడా నామినేషన్లు వేశారు. వారందరి ఇంటిపేర్లు ఓ అని ఉండటంతో ఓటర్లు కన్ఫ్యూజన్ అవుతారని పన్నీర్ సెల్వం అనుచరులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఎన్నికల కమిషన్ వారి నామినేషన్లను ఓకే చేయడంతో తమ గుర్తును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి రామనాధపురం నుంచి ఆయన ఎన్నికల బరిలో ఉన్నారు.
అదే ఫార్ములాను...
అయితే అదే ఫార్ములాను పిఠాపురంలోనూ ప్రత్యర్థులు ఉపయోగించే అవకాశాలున్నాయంటున్నారు. కనుమూరి పవన్ కల్యాణ్ అనే వ్యక్తి చేత నామినేషన్ వేయించేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. ఆయన నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయించేలా ప్లాన్ వేసినట్లు పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. దీంతో ఇద్దరి ఇంటిపేర్లు కె కావడంతో ఓటర్లు తికమకకు గురవుతారని భావిస్తున్నారు. కొణిదల పవన్ కల్యాణ్ జనసేన నుంచి కాగా, కనుమూరి పవన్ కల్యాణ్ నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయిస్తే ఓటర్లు కన్ఫ్యూజన్ అయి ఎక్కువ ఓట్లు చీల్చే అవకాశముందని జనసైనికులు ఆందోళన చెందుతున్నారు.
అదే నిజమయితే...
ఈ విషయం ఇప్పుడు పిఠాపురంలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. దీంతో పాటు మరొక డేంజర్ కూడా ఉంది. పవన్ కల్యాణ్ కు గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తే.. అక్కడ మరో అభ్యర్థికి బకెట్ గుర్తు ను కూడా కేటాయించే అవకాశముండటంతో ఆ దిశగా కూడా పవన్ ప్రత్యర్థులు ప్రయత్నాలు మొదలు పెట్టారంటున్నారు. ఎక్కువ మంది బరిలో ఉంటే బకెట్ గుర్తు ఎవరో ఒకరికి వచ్చినా, లేదంటే కనుమూరి పవన్ కల్యాణ కు వస్తే ఇక బకెట్ కు, గాజుగ్లాస్ కు పెద్దగా తేడా ఉండదని, అప్పుడు జనసేనానికి పడే ఓట్లు ఇతరులకు పడే అవకాశముందన్న ప్లాన్ చేస్తున్నారట. మరి ఇది నిజమైతే మాత్రం పవన్ కల్యాణ్ మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మరి.
Next Story