Thu Dec 19 2024 08:53:50 GMT+0000 (Coordinated Universal Time)
Pinnelli : పిన్నెల్లి అరెస్ట్ తప్పదా? కౌంటింగ్ కు ముందే కటకటాల వెనక్కు వెళతారా?
మాచర్ల వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు
మాచర్ల వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఆయనపై కేసు నమోదయింది. ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరుగుతున్న సమయంలో మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయి గేటు గ్రామంలో ఈవీఎంను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశారు. తన అనుచరులతో పోలింగ్ కేంద్రంలోకి అడుగుపెట్టిన పిన్నెల్లి ఆయనే నేరుగా ఈవీఎం మిషన్ వద్దకు వెళ్లి దానిని నేలకేసి కొట్టారు. వీవీ ప్యాట్ ను కూడా విసిరేశారు. ఈ దృశ్యాలన్నీ వెబ్ క్యాస్టింగ్ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్ దీనిపై సీరియస్ అయింది.
కేసు నమోదు చేయడంతో...
ఈవీఎంలను ధ్వంసం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో ఆయనపై కేసు నమోదయింది. దీంతో పిన్నెల్లి అరెస్ట్ తప్పదని చెబుతున్నారు. ఇప్పటికే ఆయన హైదరాబాద్ కు వెళ్లి తలదాచుకున్నారు. మాచర్లలో ఆయనను పోలింగ్ రోజు గృహనిర్భంధం చేసినప్పటికీ పోలీసుల కళ్లుగప్పి హైదరాబాద్ చేరుకోవడంపైన కూడా ఈసీ సీరియస్ గా ఉంది. దీంతో ఆయనను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కౌంటింగ్ రోజు ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందు జాగ్రత్తగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని త్వరలోనే అరెస్ట్ చేస్తారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈసీ కూడా ఈఘటనపై ఫాలో అప్ చేస్తుండటంతో పోలీసులు పిన్నెల్లి కోసం హైదరాబాద్ బయలుదేరి వెళ్లినట్లు తెలిసింది. ఆయనతో పాటు ఆయన సోదరుడిని కూడా అదుపులోకి తీసుకోనున్నారని చెబుతున్నారు.
అరెస్ట్ తర్వాత...?
హైదరాబాద్ లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తే మళ్లీ పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో అల్లర్లు తలెత్తకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు పిన్నెల్లి ప్రధాన అనుచరులను ముందస్తుగా అదుపులోకి తీసుకునే అవకాశముందని కూడా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు పల్నాడు జిల్లా అంతటా 144వ సెక్షన్ అమలులో ఉంది. జూన్ 5వ తేదీ వరకూ 144వ సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్ ఇప్పటకే ప్రకటించారు. ఒకవేళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తే తలెత్తే పరిణామాలపై కూడా ఊహించి అందుకు అనుగుణంగా పోలీసు యంత్రాంగం చర్యలకు దిగింది. మాచర్లలో కొన్ని ప్రధాన కూడళ్లలో దుకాణాలు మూసివేయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. మొత్తం మీద ఈరోజు, రేపటిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ తప్పదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
Next Story