Sat Dec 21 2024 11:16:35 GMT+0000 (Coordinated Universal Time)
Ap Politics : మ్యానిఫేస్టోను ఒకరిది చూసిన తర్వత మరొకరు రిలీజ్ చేస్తారా.. సీన్ అయితే అలానే ఉంది సామీ
ఏపీలో వచ్చే నెల 13వ తేదీన పోలింగ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకూ ప్రధాన పార్టీలు తమ మ్యానిఫేస్టోను విడుదల చేయలేదు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడ్డాయి. మరో నెల రోజులు మాత్రమే పోలింగ్ ఉంది. వచ్చే నెల 13వ తేదీన పోలింగ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకూ ప్రధాన పార్టీలు తమ మ్యానిఫేస్టోను విడుదల చేయలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా మ్యానిఫేస్టో కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. గతంలో ఎప్పుడూ ప్రజలు మ్యానిఫేస్టోను పెద్దగా పట్టించుకోలేదు. కానీ 2019 ఎన్నికల తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పదే పదే మ్యానిఫేస్టో తనకు ఖురాన్, భగవద్గీత, బైబిల్ అని చెబుతూ ప్రజల్లో మ్యానిఫేస్టో అనే దానిపై కొంత అవగాహన పెంచారనే చెప్పాలి. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత 98 శాతం మ్యానిఫేస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేశామని ప్రతి రోజూ జగన్ చెబుతూ జనం చెవిలోకి మ్యానిఫేస్టో అనే పదాన్ని బాగానే ఎక్కించారు.
దీంతో మ్యానిఫేస్టో అనేది ఏపీ ఎన్నికలలో కీలకంగా మారనుంది. ఎందుకంటే మ్యానిఫేస్టోలో చెప్పిన అంశాలను అమలుపరుస్తారన్న నమ్మకం ప్రజల్లో కలగడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే ఇప్పటి వరకూ ప్రధాన పార్టీలు ఏవీ తమ మ్యానిఫేస్టోను ప్రకటించలేదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో రాజమండ్రిలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మ్యానిఫేస్టోను విడుదల చేశారు. అయితే అప్పటి వరకూ పొత్తులు ఖరారు కాలేదు. కానీ మలి విడత మ్యానిఫేస్టోను దసరాకు విడుల చేస్తామని ప్రకటించినా ఆ తర్వాత ఆయన జైలుకు వెళ్లడంతో మ్యానిఫేస్టో విడుదల ఇప్పటి వరకూ కాలేదు. జైలులో యాభై రెండు రోజుల పాటు ఉండి బయటకు వచ్చిన చంద్రబాబు తర్వాత బీజేపీ, టీడీపీలతో పొత్తు కుదుర్చుకున్నారు. మూడు పార్టీలు కలసి ఉమ్మడి మ్యానిఫేస్టోను విడుదల చేయాలని నిర్ణయించారు.
ఇద్దరు నేతలు...
ఇందుకోసం మూడు పార్టీల నుంచి నేతలను ఎంపిక చేసి మ్యానిఫేస్టో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇంతవరకూ ప్రజాగళం పేరుతో సభలను నిర్వహిస్తున్నా చంద్రబాబు సూపర్ సిక్స్ అంటూ పాత విషయాలనే ప్రస్తావిస్తున్నారు తప్పించి కొత్త మ్యానిఫేస్టోను ఇప్పటి వరకూ విడుదల చేయలేదు. దీనిపై ఇంకా కసరత్తులు చేస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ కూడా అభ్యర్థులను ప్రకటించి నెలరోజులు దాటింది. జనంలో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తున్నారు. బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. కానీ మ్యానిఫేస్టో ప్రస్తావన ఎక్కడా లేదు. ఎప్పుడు ఆయన విడుదల చేస్తారన్న విషయం కూడా పార్టీ వర్గాలకు అంతుపట్టడం లేదు. ఈ నెల 18వ తేదీన ఎన్నికల కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. మరి ఈ నేపథ్యంలో రెండు పార్టీల మ్యానిఫేస్టోలు ఎప్పుడు విడుదలవుతాయన్నదానిపై ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఒకరి కోసం మరొకరు...
అయితే ఇందులో మతలబు ఉందంటున్నారు. ఒకరి మ్యానిఫేస్టో విడుదల చేసిన తర్వాత మరొకరు విడుదల చేయాలని ఆగారా? అన్న అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఒకరు చేసిన వాగ్దానాలకు మించి మరొకరు చేసి అధికారంలోకి రావాలని మ్యానిఫేస్టో విడుదలను ఆపారంటున్నారు. పింఛను చంద్రబాబు నాలుగు వేల రూపాయలు అని ప్రకటిస్తే.. జగన్ దానిని ఐదు వేలు చేస్తానని ప్రకటించే అవకాశముంది. అదే జగన్ ముందుగా రైతు రుణమాఫీ అంటే.. చంద్రబాబు కూడా తాము రైతు రుణమాఫీతో పాటు రైతులకు పెట్టుబడి సాయంపై కూడా భారీ ప్రకటన చేసే దిశగా ఆలోచించే అవకాశముంది. అందుకే ఒకరికి మించి మరొకరు హామీలివ్వడానికి రెడీ అయిపోతున్నారని చూస్తున్న వారికి ఎవరికైనా అనిపిస్తుంది. అందుకే ఈసారి మ్యానిఫేస్టో ఎలా ఉండబోతుందన్నది ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
Next Story