Thu Dec 19 2024 09:13:23 GMT+0000 (Coordinated Universal Time)
Ap Politics : పల్లెల్లో పోటెత్తిన జనం... అర్బన్ లో మాత్రం ఎప్పటిలాగానే నిరాసక్తత.. ఇది దేనికి సంకేతం?
ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. అర్బన్ లో తక్కువగా, పల్లెల్లో ఎక్కువగా పోలింగ్ శాతం నమోదయింది
ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. పల్నాడు, రాయలసీమలోని కొన్ని జిల్లాలను మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగానే జరిగిందనే చెప్పాలి. ప్రధానంగా మహిళలు, వృద్ధులు కూడా పెద్దయెత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి రావడం ఈసారి ప్రత్యేకత. ఇళ్లలో ఉండకుండా తాము ఓటు వేయాలన్న తపన వారిలో కనిపిస్తుంది. ఎక్కువ మంది ఓటర్లు రోజు వారీ కూలీల నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేసుకునే వారు వరకూ పోలింగ్ ప్రక్రియలో భాగస్వామ్యులవ్వడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. ఇప్పటికే రైళ్లు, బస్సులు, సొంత వాహనాల్లో సొంత గ్రామాలకు చేరుకున్న ఓటర్లు తిరుగు ప్రయాణం ఈరోజు అయ్యేందుకు ఉదయాన్నే ఓట్లు వేశారు. రేపటి నుంచి మళ్లీ విధులకు హాజరు కావాల్సి ఉండటంతో వాళ్లంతా ముందుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
పల్లెల్లో మాత్రం...
ఇక గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఓటర్లు క్యూ కట్టారనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా తమ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఓటును ఈవీఎంలో నిక్షిప్తమయ్యేలా ఈసారి గ్రామీణ ఓటరు కసితో కనిపించాడని చెప్పాలి. గ్రామాల్లోని అనేక ప్రాంతాల్లో ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలన్నీ ఓటర్లతో నిండిపోయి ఉన్నాయి. ఒక్కసారిగా ఓటర్లు పోలింగ్ కేంద్రానికి తరలి రావడంతో పోలింగ్ ప్రక్రియలో ఆలస్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. వాళ్ల ఓటరు ఐడీని పరిశీలించడంతో పాటు వారి పేరు ఓటర్ల జాబితాలో ఉందో? లేదో? సరిచూసుకోవడం వంటివి చేయడం కారణాలతో పాటు ఏజెంట్ల నుంచి అంగీకారం తీసుకున్న తర్వాతనే ఓటు వేయడానికి అనుమతిస్తున్నారు. దీంతో పోలింగ్ జరగడానికి కొంత ఆలస్యమయింది. గ్రామాల్లో మాత్రం పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూ కట్టారనే చెప్పాలి.
అర్బన్ ప్రాంతాల్లో...
అర్బన్ ప్రాంతాల్లో ఓటర్లు పెద్దగా ఓట్లు వేసేందుకు ముందుకు ఈసారి కూడా రాలేదు. విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో యాభై శాతానికి మించి పోలింగ్ నమోదు కాలేదు. అర్బన్ లో ఎప్పుడూ ఓట్లు వేయడానికి ముందుకు రారు. అయితే ఈరోజు ఉదయాన్నే అర్బన్ ఏరియాల్లోని స్లమ్ ప్రాంతాల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. అయితే అర్బన్ ప్రాంతంలో కూడా రికార్డు స్థాయిలో ఈసారి పోలింగ్ నమోదవుతుందని అందరూ అంచనా వేశారు. కానీ అక్కడ క్యూ లైన్ లు చూసి అర్బన్ ప్రాంతాల్లో అనేక చోట్ల ఓటు వేయకుండా చాలా మంది వెనుదిరిగి వెళ్లిపోయారు. దీంతో పోలింగ్ శాతం విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రాంతాల్లో తక్కువగా పోలింగ్ నమోదయింది. పట్టణ ప్రాంతాల్లో ఎండ వేడిమి తాళలేక, క్యూ లైన్ లో ఎక్కువ సేపు వేచి ఉండలేక ఓటర్లు వెనుదిరిగి వెళ్లారని చెబుతున్నారు.
Next Story