Fri Dec 20 2024 22:41:15 GMT+0000 (Coordinated Universal Time)
ఆంధ్రకు వెళ్లాలంటే అంత ఖర్చవుతుందా? ప్రయివేటు బస్సుల దోపిడీ ఆగడం లేదుగా
ఏపీలో అనేక నగరాలకు వెళ్లే ధరలను ప్రయివేటు బస్సులు టిక్కెట్ ధరలను అమాంతంగా పెంచేశాయి.
వేసవి సెలవులు వచ్చేశాయి... దీంతో పాటు ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు వెళ్లేందుకు తెలంగాణ నుంచి జనం రెడీ అవుతున్నారు. అయితే ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకుందామనుకుంటే ఆర్టీసీ, రైలు టిక్కెట్లన్నీ బుక్ అయిపోయాయి. రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత ఉంది. ఆర్టీసీ బస్సుల్లో సీట్లు లేవు. అదనపు బస్సులు వేస్తే తప్ప సీట్లు దొరకని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రయివేటు బస్సులు తడాఖా చూపుతున్నాయి. ఏపీలో పలు నగరాలకు వెళ్లే ధరలను అమాంతంగా పెంచేశాయి.
సీట్లన్నీ అయిపోవడంతో...
ప్రధానంగా మే 10 వతేదీన వెళ్లేందుకు హైదరాబాద్ చుట్టుపక్క ప్రాంతాల నుంచి అనేక మంది సొంత ప్రాంతాలకు బయలుదేరుతున్నారు. ఒకవైపు ఓటు హక్కు వినియోగించుకోవడానికి, మరొక వైపు వేసవి సెలవుల్లో సొంత ఇంటివద్ద పిల్లలతో కొన్ని రోజులు గడుపుదామని కోరుకుంటున్నారు. కార్మికుల నుంచి ఉద్యోగుల వరకూ అందరూ ఏపీ బాట పట్టారు. అయితే ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్ కావడంతో ప్రయివేటు బస్సులలో వెళ్లేందుకు ట్రావెల్స్ సంస్థల వద్దకు జనం క్యూ కడుతున్నారు. ప్రయివేటు బస్సుల కార్యాలయాలకు వెళితే రెండు టిక్కెట్లు అయితే కొంత తగ్గిస్తున్నారు. ఒక టిక్కెట్ అయితే మాత్రం తగ్గించేది లేదని చెబుతున్నారు.
తిరిగి వచ్చేందుకు కూడా...
ఏపీకి వెళ్లడానికే కాదు తిరిగి వచ్చేందుకు కూడా ఆర్టీసీ, రైళ్లలో సీట్లన్నీ అయిపోవడంతో తిరుగు ప్రయాణానికి కూడా ప్రయివేటు బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. అయితే వాళ్లు చెప్పే ధరలను చూసి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఒక టిక్కెట్ ధరను నాలుగు రెట్లకు పెంచేశారు. ఐదు వందల రూపాయల టిక్కెట్ ధరను రెండువేలు చెబుతున్నారు. ఇక్కడి నుంచి విజయవాడ వెళ్లాలంటే వెయ్యి రూపాయలు ధర చెల్లించాల్సిందేనంటున్నారు. విశాఖ పట్నానికి రెండున్నర వేల నుంచి మూడు వేల రూపాయల వరకూ ధర చెబుతున్నారు. దీంతో సొంత వాహనాలు బెటర్ అన్న నిర్ణయానికి వచ్చి టిక్కెట్ బుక్ చేేసుకోకుండా వెనుదిరిగి వెళుతున్నారు. ప్రయివేటు బస్సుల దోపిడీపై ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకోవాలని అనేక మంది డిమాండ్ చేస్తున్నారు.
Next Story