Fri Nov 22 2024 19:20:12 GMT+0000 (Coordinated Universal Time)
BJP : హడావిడి తప్ప.. అభ్యర్థులే లేరా? అసలు గెలిచే ఆలోచన ఉందా భయ్యా?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయింది. బీజేపీ తన అభ్యర్థులను మాత్రం ఇంకా ఖరారు చేయలేదు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయింది. నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఇంకా సమయం మాత్రం ఉంది. అయితే ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు తమ పార్టీకిచెందిన అభ్యర్థులను ప్రకటించాయి. కానీ జాతీయ పార్టీ బీజేపీ మాత్రం సీట్లు, అభ్యర్థుల విషయంలో ఇంకా మల్లగుల్లాలు పడుతూనే ఉంది. ఏపీలో పొత్తు ఖరారయింది. టీడీపీ, జనసేన, బీజేపీ లు కూటమిగా ఏర్పడ్డాయి. ఏపీలో బీజేపీ పది అసెంబ్లీ నియోజకవర్గాలు, ఆరు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయనుంది. అయితే ఏ ఏ స్థానాల్లో పోటీ చేస్తారన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. సంఖ్య మాత్రం తెలిసింది కాని, స్థానాలు మాత్రం బయటకు తెలియకపోవడంతో నేతలు కూడా ఇబ్బంది పడుతున్నారు.
ఇప్పటికే పొత్తులో ఉన్న పార్టీలు...
విశాఖపట్నం నుంచి పోటీ చేయాలని భావించినా అక్కడ టీడీపీ తన పార్టీ అభ్యర్థి భరత్ ను ప్రకటించింది. దీంతో విజయనగరం జిల్లాను తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. విజయనగరం, రాజమండ్రి, అనకాపల్లి, రాజంపేట, నరసాపురం. కడప నుంచి పోటీ చేయాలని భావిస్తుంది. హిందూపురం నుంచి పోటీ చేయాలని తొలుత అనుకున్నప్పటికీ అక్కడ టీడీపీ తన అభ్యర్థిగా బీకే పార్థసారధిని ఎంపిక చేశారు. దీంతో హిందూపురం అభ్యర్థి ఇచ్చేందుకు అవకాశాలు లేవు. కడప లోక్సభ నుంచి ఆదినారాయణను బరిలోకి దింపాలని భావిస్తుంది.
శాసనసభ స్థానాలపై...
ఇక శాసనసభ స్థానాలపై ఎలాంటి క్లారిటీ రాలేదు. సీనియర్ నేతలు మాత్రం తమకు ఓడిపోయే స్థానాలను కేటాయించారంటూ ఏకంగా బీజేపీ అధినాయకత్వానికి లేఖ రాయడం సంచలనం కలిగించింది. దీంతో పార్టీ హైకమాండ్ కూడా స్థానాల విషయంలో పునరాలోచనలో పడింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేయాలన్న దానిపై ఇంతవరకూ తేలలేదు. అలాగే అనంతపురం పట్టణంతో పాటు ధర్మవరం వంటి స్థానాల్లోనూ బరిలోకి దిగాలని భావిస్తోంది. అక్కడ సరైన అభ్యర్థులున్నప్పటికీ ఇంత వరకూ అభ్యర్థులు ఎవరో తేల్చకుండా మీనమేషాలు లెక్కిస్తుంది. అభ్యర్థులు ప్రచారంలోకి వెళ్లాలంటే ముందు ఖరారు చేయాల్సి ఉంది.
కలవరం కొనసాగుతూనే...
ఎటూ తేల్చుకండా హైకమాండ్ నానుస్తుండటంతో పార్టీ నేతలు కూడా అసహనానికి గురవుతున్నారు. ఢిల్లీకి బీజేపీ అధ్యక్షురాలు పురంద్రీశ్వరి వెళ్లి పెద్దలతో చర్చించారు. అయితే పార్టీ అగ్ర నేతలు అందుబాటులో లేకపోవడంతో సీట్లు, అభ్యర్థుల ఖరారు ఇంకా కొలిక్కిరాలేదు. మరోవైపు టీడీపీ, జనసేనలు తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసుకుని మరో నాలుగైదు రోజుల్లో ప్రచారానికి వెళుతున్నాయి. కానీ కమలం పార్టీ నేతలు మాత్రం ఇంకా జాబితా కోసం ఢిల్లీ వైపు ఎదురు చూడాల్సి వస్తుంది. త్వరగా అభ్యర్థులను నిర్ణయిస్తే తాము ప్రచారం చేసుకుంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద కమలం పార్టీ నేతల్లో మాత్రం ఇంకా కలవరం కొనసాగుతూనే ఉంది.
Next Story