Mon Dec 23 2024 04:41:16 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ లో భయం మొదలయిందా.. అనుమానం బయలుదేరిందా?
వైసీపీ అధినేత జగన్ లో కొంత భయం మొదలయింది. అనుమానం బయలుదేరింది.
అవును.. వైసీపీ అధినేత జగన్ లో కొంత భయం మొదలయింది. అనుమానం బయలుదేరింది. మ్యానిఫేస్టోలో తాను తీసుకున్న నిర్ణయాలే విజయావకాశాలను దెబ్బతీస్తాయా? అన్న బెరకు మాత్రం ప్రారంభమయిందనే చెప్పాలి. ఇక్కడ నమ్మకం ముఖ్యమని జగన్ మొన్నటి వరకూ భావించారు. ఎవరొచ్చినా చెప్పినది ఇస్తారని ప్రజలు భావిస్తే మాత్రం కొంత ఇబ్బందులు ఎదురవుతాయన్న ఆందోళనలో వైసీపీ చీఫ్ ఉన్నట్లే కనపడుతుంది. అందుకనే జగన్ హడావిడిగా ప్రచారానికి బ్రేక్ ఇచ్చి మరీ నేతలతో సమావేశమయ్యారంటే అంతకంటే వేరే కారణం ఉండకపోవచ్చు. ఎన్నికలకు ఇంకా పది రోజులు కూడా లేని సమయంలో ప్రచారానికి బ్రేక్ ఇవ్వడమంటే ఆలోచించాల్సిన విషయమే.
జనం నమ్ముతారా?
తెలుగుదేశం మ్యానిఫేస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేస్తారా? లేదా? అన్నది పక్కన పెడితే.. ఒకరకంగా జనం నమ్మడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. డబ్బు ఎవరికి చేదు? ఉచితంగా ఎక్కువ మొత్తం వస్తుందంటే.. అదీ తాము ఇప్పుడు అనుకున్న దానికంటే ఎక్కువ సొమ్ము తమ ఖాతాలో జమ అవుతుందంటే మనసు మారే అవకాశాలున్నాయి. అదే ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ లో కొంత ఆందోళన కలగడానికి కారణంగా చెప్పుకోవాలి. మ్యానిఫేస్టోను జగన్ అయితే ఖచ్చితంగా అమలు చేస్తానని ఎంత మంది నమ్ముతారన్నది ఇప్పుడు జగన్ పార్టీ నుంచి వినిపిస్తున్న ప్రశ్న. అదే సమయంలో టీడీపీకి ఆయువు పెంచాలంటే చంద్రబాబు కూడా మ్యానిఫేస్టోలో పెట్టిన అంశాలు అమలు చేస్తారన్నది కూడా వినిపిస్తున్న వాదన వైసీపీ నేతల్లో ఆందోళనకరంగా మారింది.
అనుమానం ఉన్న...
అందుకే కొంత అనుమానం ఉన్న నియోజకవర్గాల్లో నేతలను పిలిపించుకుని జగన్ వారితో మాట్లాడారు. ఏ విధంగా గెలిచేందుకు అవకాశాలున్నాయో వారికి వివరించినట్లు సమాచారం. రాయలసీమలో తమకు తిరుగులేదని, అయితే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల నేతలను కూడా ఈ సమావేశానికి పిలిచి మరీ కొందరు నేతలకు జగన్ క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ఇంటింటికీ తిరుగుతూ చంద్రబాబు మ్యానిఫేస్టో పై నెగిటివ్ ప్రచారం చేయడమే కాకుండా ఆ పార్టీకి ఓటు వేస్తే లబ్ది దారుల జాబితా నుంచి మీ పేరు ఉండకపోవచ్చన్న విషయాన్ని కూడా ఈ పది రోజుల్లో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నేతలకు జగన్ నూరిపోశాడని అంటున్నారు. తనకు తెలియదని ఈ ఎన్నికల్లో గెలిచి రావాలని, అందుకు ఈ పది రోజులు ఎంత కష్టపడాలో అంత మేర కష్టపడాలని కూడా జగన్ నేతలకు చెప్పినట్లు తెలిసింది.
పోలింగ్ కేంద్రాలకు...
మ్యానిఫేస్టోను మనమే హైలెట్ చేశామని, అందుకే ఇప్పుడు ప్రజలు కూడా మ్యానిఫేస్టోను చూసి ఓటు వేసే అవకాశముంది కాబట్టి పోలింగ్ కేంద్రాలకు ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకే ఓటేసే వారిని తీసుకు వచ్చే బాధ్యతను రాజీనామా చేసిన వాలంటీర్లకు మాత్రమే కాకుండా ముఖ్యమైన కార్యకర్తలను గుర్తించి వారికి అప్పగించాలని సూచించినట్లు తెలిసింది. పోలింగ్ శాతం ఎంత జరిగినా అందులో మనకు సంబంధించిన వాళ్లే ఎక్కువ ఉండేలా చూసుకోవాలని, పోలింగ్ ప్రారంభమయిన ఉదయం ఏడు గంటలకు ముందు నుంచే క్యూ లైన్ లో మనోళ్లను నిలబడితే క్యూలు చూసి మనకు వ్యతిరేకంగా పడే ఓట్లు వెనక్కు వెళ్లిపోయే అవకాశముందన్న విషయాన్ని కూడా గుర్తించాలని చెప్పినట్లు తెలిసింది. మొత్తం మీద జగన్ మాత్రం మ్యానిఫేస్టో విడుదల తర్వాత ప్రచారానికి బ్రేక్ ఇచ్చి మరీ కొంత నేతలను పోలింగ్ సన్నద్ధులను చేయడమంటే.. మ్యానిఫేస్టో దెబ్బ అని అనుకోక తప్పదు.
Next Story