Mon Dec 23 2024 09:05:20 GMT+0000 (Coordinated Universal Time)
T20 World Cup 2024 : నలుగురు వరల్డ్ కప్ లో తొలిసారి.. ఆడారో ఇక ఫిక్సయిపోయినట్లే
టీ20 వరల్డ్ కప్నుప్రారంభం కానుంది. ఇరవై దేశాలు ఛాంపియన్ గా మారేందుకు పోటీ పడుతున్నాయి
టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఇరవై దేశాలు ఛాంపియన్ గా మారేందుకు పోటీ పడుతున్నాయి. మొత్తం నాలుగు గ్రూపులు ఈ పోటీలో నువ్వా? నేనా? అన్నట్లు తలపడుతున్నాయి. అయితే టీం ఇండియా ఈసారి కొత్త పంథాలో ఆటగాళ్లను ఎంపిక చేసింది. గెలుపే లక్ష్యంతో పాటు స్కోరు బోర్డుకు వెరవని ఆటగాళ్లకు, బంతిని అలవోకగా బ్యాట్ తో తరలించే వాళ్లకు, వికెట్లు వేగంగా ప్రమాదకరమైన భాగస్వామ్యులను విడదీయడంలో ఉద్దండులను దింపడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. అందుకే ఈసారి టీం ఇండియా జట్టు బలంగా కనిపిస్తుంది. కనిపించడమే కాదు వాళ్లు పెర్ఫార్మెన్స్ కూడా సీజన్ లో అంచనా వేసి మరీ బరిలోకి దింపింది.
పిక్ చేసుకోవడానికి...
ఐపీఎల్ ఒక రకంగా టీం ఇండియాకు వరమనే చెప్పాలి. అన్ని జట్ల నుంచి మంచి ఆటగాళ్లను పిక్ చేసుకోవడానికి ఐపీఎల్ సీజన్ 17 ఉపయోగపడిందనే చెప్పాలి. అందుకే కుర్రోళ్లతో ఈసారి మన జట్టు కేక పెట్టించేలా ఉంది. యువరక్తం ఎగిసిపడేలా ఆటగాళ్ల ఎంపిక ఉందని ఇప్పటికే మాజీ క్రికెటర్లు సయితం తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంతా బీసీసీఐ అనుకున్నట్లు జరిగితే వరల్డ్ కప్ కొట్టడం ఈసారి భారత్ కు పెద్ద కష్టం కాదన్న విశ్లేషణలు క్రీడా నిపుణుల నుంచి వెలువడుతున్నాయంటే అందుకు జట్టు కూర్పే కారణం. జట్టు ఎంపికలో ఎలాంటి వివక్ష లేకుండా కేవలం పెర్ఫార్మెన్స్ ఆధారంగానే ఎంపిక చేసింది.
సంజూ కూల్ గా ఉన్నా...
అయితే ఈసారి వరల్డ్ కప్ లో నలుగురు తొలిసారి ఆడబోతున్నారు. అందులో సంజూ శాంసన్ ఒకరు. ఐపీఎల్ సీజన్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడుగా నిలిచాడు. 17 ఐపీఎల్ సీజన్ లో ఐదువందలకు పైగా పరుగులు చేశాడు. ఫామ్ లో ఉన్నాడు. వికెట్ కీపర్ గా చురుకుగా కదులుతూ టీంకు అనేకకష్ట సమయాల్లో అండగానిలుస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ను గెలుపు అంచుల వరకూ తీసుకెళ్లగలిగాడు. అందుకే సంజూ శాంసన్ ను ఎంపికచేశారు. శాంసన్ తొలిసారి టీ 20 ప్రపంచ కప్ ఆడుతున్నాడు. ఇక మరో ఆటగాడు యశస్వి జైశ్వాల్. ఇతను కూడా రాజస్థాన్ రాయల్స్ తరుపున ఓపెనర్ గా దిగి ఆటను ఆస్వాదిస్తున్నాడు. కుదురుకున్నాడంటే ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడంతే. బంతిని బౌండరీ లైను కో, సిక్సర్ తో గ్యాలరీకో తరలించడానికే ఎక్కువగా తన శక్తిని వినియోగిస్తాడు. కాసేపు క్రీజులో ఉంటే చాలు స్కోరు బోర్డు ఇక పరుగులు తీసినట్లే. అందుకే యశస్వి ఎంపిక జరిగింది. యశస్వి కూడా తొలిసారి వరల్డ్ కప్ ఆడుతున్నారు.
శివాలెత్తి పోతే...
ఇక చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఐపీఎల్ లో ఈ ఏడాది నిలకడగా ఆడుతూ అనేక సార్లు జట్టు గెలవడానికి దోహదపడిన శివమ్ దూబేను కూడా తక్కువగా అంచనావేయలేం. అతను నిలుచున్నాడంటే శివాలెత్తిపోతాడు. అనేక మ్యాచ్ లలో ప్రత్యక్షంగా అతని ఆటను చూసిన వారికి ఎవరికైనా దూబే ఎంపికసరైనదేనని అనిపించక తప్పదు. శివమ్ దూబే రాణించాడంటే స్టేడియం దద్దరిల్లి పోవాల్సిందే. ఇక మరో ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ కూడా తొలిసారి వరల్డ్ కప్ కు ఆడుతున్నాడు. ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు రాబట్టి మంచి ఊపు మీదున్నాడు. చాహల్ కూడా రాణిస్తే ప్రత్యర్థులను సులువుగా పెవిలియన్ బాట పట్టించేందుకు వీలుంది. ఇలా నలుగురు వరల్డ్ కప్ కు కొత్తైనా వారి పెర్పార్మెన్స్ ను చూస్తే మాత్రం ఈసారి వరల్డ్ కప్ లో వీళ్లు కీలకంగా మారే అవకాశాలు లేకపోలేదనే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి.
Next Story