Sat Jan 11 2025 00:11:09 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : గెలుపుపై హోప్స్ బాగా పెట్టుకున్న బాబుకు ఇప్పుడు అసలు విషయం అర్థమవుతోందా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈసారి గెలుపు పై ఎంతో హోప్స్ పెట్టుకున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈసారి గెలుపు పై ఎంతో హోప్స్ పెట్టుకున్నారు. తనకు ఒక వైపు మోడీ.. మరొక వైపు పవన్ కల్యాణ్ ఉండగా ఇక తిరుగుండదని ఆయన భావిస్తున్నారు. కానీ జనంలో మాత్రం ఈ కూటమి పట్ల పెద్దగా ఆసక్తి లేదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. బీజేపీ తో పొత్తుతోనే టీడీపీకి ఈసారి భారీగా నష్టం జరుగుతుందన్న అంచనాలు మాత్రం బాగానే వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ ప్రాబల్యాన్ని కూడా ఎంతో ఊహించుకుంటే అంత స్థాయిలో లేదన్న సమాచారం కూడా చంద్రబాబును కొంత కలవరపెడుతున్నట్లే ఉంది. అందుకే చంద్రబాబు తాను ఈసారి అభ్యర్థుల ఎంపికలోనూ రాజీపడకుండా సీనియర్లను సయితం దూరంపెడుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారంటున్నారు.
నాటి పరిస్థితులు...
బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు కలిస్తే 2014 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని తొలుత భావించారు. కానీ పదేళ్ల నాటి పరిస్థితి వేరు. నేటి పరిస్థితి వేరు. నాడు అంటే 2014లో మోదీ ఫ్రెష్ గా దేశ రాజకీయాల్లోకి వచ్చారు. అలాగే పవన్ కల్యాణ్ కూడా జనసేన పార్టీ పెట్టి పోటీ చేయకుండా ఆయన తొలి సారి ప్రత్యక్షంగా మద్దతు తెలిపారు. అందులోనూ కొత్త రాష్ట్రం. చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం.. ఇలా అనేక రకాలైన ప్లస్ పాయింట్లు నాడు కూటమిని గెలిపించేలా చేశాయి. కానీ అత్యధిక స్థానాల్లో మాత్రం గెలవలేకపోయింది. 2014 లోనూ 60కి పైగా స్థానాల్లో వైసీపీ విజయం సాధించిందంటే పెద్ద విజయం కాదనే చెప్పాలి.
సీన్ రివర్స్...
ఇప్పుడు సీన్ రివర్స్ అయిందంటున్నారు. మోదీని పదేళ్ల పాటు ప్రధాన మంత్రిగా చూశారు. ఆయనపై ఉత్తరభారత దేశంలో పాజిటివ్ లుక్ ఉండవచ్చేమో కానీ, దక్షిణ భారత దేశంలో మాత్రం నెగిటివ్ ను బాగానే మూటగట్టుకున్నారు. ప్రధానంగా మోదీ ఏపీకి అన్యాయం చేశారన్న అభిప్రాయం అధిక శాతం మంది ప్రజల్లో ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వక పోవడం, విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించాలన్న నిర్ణయం, విశాఖ రైల్వే జోన్ ను ఏర్పాటు చేయకపోవడం వంటి కారణాలతో పాటు ముస్లిం, క్రిస్టియన్ ఓటర్లలో చాలా వరకూ ఆ పార్టీపై వ్యతిరేకత కనపడుతుంది. ఈ కారణాలతో చంద్రబాబుకు బీజేపీతో పొత్తు వల్ల కలసి వచ్చేది లేకపోగా, ఉన్న ఓట్లు పోయే అవకాశాలు స్పష్టంగా చంద్రబాబుకు కనుచూపు మేరలోనే కనిపిస్తున్నాయి.
పవన్ కారణంగా...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కూడా చంద్రబాబు భారీగా ఆశలు పెట్టుకున్నారు. కానీ పవన్ వైఖరి, ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయన్నది ఆయనకు అందుతున్న నివేదికలను బట్టి అర్థమవుతుంది. ఉభయ గోదావరి జిల్లాలలో తాము ఆశించిన స్థాయిలో స్థానాలు వస్తాయన్న నమ్మకం కూడా ఇప్పుడు లేదంటున్నారు. కాపు సామాజికవర్గం నుంచి కూడా పూర్తి స్థాయిలో మద్దతు కనిపించకపోవడంతో పవన్ తో పొత్తు వల్ల ప్రత్యేకంగా ఉపయోగం లేకపోయినా చంద్రబాబుకు మాత్రం నష్టం లేదని మాత్రం తెలుసు. ఎంతో కొంత ఓట్లు యాడ్ అవుతాయి కాబట్టి పవన్ తో పొత్తు ఓకే కానీ, బీజేపీతో పొత్తు వల్ల తాము ఈసారి జగన్ ను ఎదుర్కొనడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని కూడా ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిసింది.
Next Story