Mon Dec 23 2024 12:25:43 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేను చెప్పినట్లు తలాడించాల్సిందే.. ఎగరేయడానికి లేదు బాబాయ్.. బాబోయ్...బాబు మాస్టర్ మైండ్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్లాన్ సూపర్ సక్సెస్ అయింది. అంతా ఆయన అనుకున్నట్లుగానే జరుగుతుంది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్లాన్ సూపర్ సక్సెస్ అయింది. అంతా ఆయన అనుకున్నట్లుగానే జరుగుతుంది. కూటములతో కొంత ఇబ్బందులుంటాయని తొలుత భయపడినా.. అందరూ తన వాళ్లే కావడంతో స్మూత్ గా నడిపించడంలో ఆయన సక్సెస్ అవుతున్నారు. ఒక్కొక్క అడుగుతో ఆయన ఇటు జనసేన, అటు బీజేపీని కూడా తన గ్రిప్ లోకి తెచ్చుకుంటున్నట్లే కనపడుతుంది. కూటమి ఏర్పడి 31 అసెంబ్లీ స్థానాలను, 8 పార్లమెంటు నియోజకవర్గాలకు తెలుగుదేశం పార్టీ దూరమయినా అక్కడ కూడా తన వారినే నిలబెట్టడంలో ఆయన ఫస్ట్ సక్సెస్ అయ్యారు. తర్వాత అభ్యర్థుల మార్పుల విషయంలోనూ ఆయన వేసిన ప్లాన్ ఫలించేటట్లే కనపడుతుంది.
తాను అనుకున్న వారిని...
తొలుత ఎక్కువ స్థానాలను అడుగుతారని భావించినా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను 21 స్థానాలకే పరిమితం చేశారు. 24 స్థానాలను జనసేనకు ఇచ్చినట్లే ఇచ్చి మరో మూడు స్థానాలను ఆ పార్టీ నుంచి బీజేపీకి పంపడంలో కృతకృత్యులయ్యారు. పార్లమెంటు నియోజకవర్గంలోనూ అంతే. తన సోదరుడు నాగబాబును అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని భావించిన పవన్ కల్యాణ్ కు నచ్చచెప్పి మరీ దానిని బీజేపీకి కేటాయించారు. ఇప్పుడు నరసాపురం వంతు వచ్చింది. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి శ్రీనివాసవర్మ ను తప్పించి రఘురామ కృష్ణరాజుకు అప్పగించాలని ఆయన గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇందులో కూడా 90 శాతం సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయి.
సీట్ల మార్పిడిలో...
నరసాపురం నుంచి రఘురామ కృష్ణరాజును పోటీ చేయించి ఉండి సీటును శ్రీనివాసవర్మ కు ఇవ్వాలన్న ఉద్దేశ్యంలో చంద్రబాబు ఉన్నారు. ఇక అనపర్తి సీటు విషయంలోనూ చంద్రబాబు బీజేపీ నేతలను ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు. తమ పార్టీకి అచ్చిరాని తంబళ్లపల్లి సీటు బీజేపీకి ఇచ్చి అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇచ్చేవిధంగా కొంత కమలం పార్టీ నేతలు తలాడించేలా చేయగలిగారు. కేంద్ర పెద్దలతో మాట్లాడి దానిపై ఒక నిర్ణయానికి వస్తామని చెప్పినా అది కూడా చంద్రబాబు చెప్పినట్లే జరుగుతుందన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇక అవనిగడ్డ, పాలకొండ సీట్లలో తన మనుషులను జనసేన నుంచి పోటీ చేయిస్తున్నారు.
ముందున్నది వారే అయినా...
ఇటు పురంద్రీశ్వరి, సీఎం రమేష్, సుజనా చౌదరిలతో కధను ముందుండి నడిపిస్తూ చంద్రబాబు తాను వెనక నుంచి డైరెక్షన్ ఇస్తుండటంతో అన్నింటా సక్సెస్ అవుతూ వస్తున్నారు. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పైకి చెబుతున్నా రేపు శాసనసభలో ఎటుచూసినా.. కండువాలు వేరైనా తన మనుషులు ఉండాలన్న చంద్రబాబు ప్రయత్నం మాత్రం ఇప్పటి వరకూ సక్సెస్ అయిందనే చెప్పాలి. మున్ముందు చంద్రబాబు వ్యూహాలకు కమలం, గాజుగ్లాసు పార్టీలు ఏ మేరకు ఎఫెక్ట్ అవుతాయో తెలియదు కానీ... ఇప్పటికే అనేకరకాలుగా మిత్రులపై తనదే పై చేయి అని, రాజీపడే ప్రసక్తి తన రాజకీయ జీవితంలోనే ఉండదన్న సంకేతాలను పసుపు పార్టీ క్యాడర్ కు బలంగా పంపడంలో చంద్రబాబు ఫుల్లు సక్సెస్ అయ్యారు.
Next Story