Mon Dec 23 2024 05:30:21 GMT+0000 (Coordinated Universal Time)
Ap Elections : సోమిరెడ్డికి ఆపి మరీ టిక్కెట్ ఇచ్చారు సరే.. కానీ అక్కడ అసలు జరిగిందేమిటి?
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి సర్వేపల్లి నియోజకవర్గంలో పోటీచేశారు.
నెల్లూరు రాజకీయాల్లోనే కాదు.. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆయన పార్టీకి బలమైన వాయిస్. టీడీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మంత్రి అయ్యే లీడర్. అలాంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సర్వేపల్లి నియోజకవర్గం ఆదరించడం లేదు. ఒకటా.. రెండా.. దాదాపు రెండున్నర దశాబ్దా లనుంచి ఆయనకు గెలుపు అనే మాట వినపడటం లేదు. అలాగని ఆయన జనానికి దూరంగా ఉండే నేత అసలే కాదు.నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలపై పోరాడుతుంటారు. అలాంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైపు సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలు చూడకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వరస ఓటములతో...
సర్వేపల్లి నియోజకవర్గం గతంలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇక్కడ నుంచి రెండు సార్లు విజయం సాధించారు. 1994, 1999లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించి మరీ గెలిచారు. 1999 ఎన్నికలే ఆయనకు సర్వేపల్లిలో చివరి విజయం అయింది. 2004లో హ్యాట్రిక్ విజయం సాధించాలని భావించినా అది నెరవేరలేదు. కాంగ్రెస్ .. ఆ తర్వాత వైసీపీ అభ్యర్థుల చేతుల్లో వరస ఓటములను చవి చూస్తున్నారు. అయితే ఇక్కడ హ్యాట్రిక్ విజయం ఎవరికీ దక్కలేదు. 2004, 2009 వరస ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి వరస విజయాలు సాధించారు. అయితే ఆయనకు 2014 ఎన్నికల్లో సర్వేపల్లి టీడీపీ టిక్కెట్ దక్కలేదు. దీంతో ఆయన హ్యాట్రిక్ విజయాన్ని మిస్సయ్యారు.
కాకాణి గెలిస్తే...
2014లో వైసీపీ ఆవిర్భవించిన తర్వాత సర్వేపల్లి నుంచి కాకాణి గోవర్థన్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. 2019 ఎన్నికల్లోనూ సర్వేపల్లి నుంచి కాకాణి గోవర్థన్ రెడ్డి విజయం సాధించారు. అంటే ఈ ఎన్నికల్లో తిరిగి కాకాణి గోవర్థన్ రెడ్డి గెలిస్తే హ్యాట్రిక్ సాధించినట్లవుతుంది. సర్వేపల్లి నియోజకవర్గం చరిత్ర చూస్తే ఎవరికీ హ్యాట్రిక్ విజయం దక్కలేదు. దీంతో ఇది సెంటిమెంట్ గా మారింది. కాకాణి గోవర్థన్ రెడ్డి విజయం సాధిస్తే హ్యాట్రిక్ విజయం సాధించడంతో పాటు రికార్డు నెలకొల్పినట్లే అవుతుందన్నది విశ్లేషకుల అంచనా. అయితే ఈసారి ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందన్న దానిపై పెద్దయెత్తున చర్చ జరుగుతుంది.
హిస్టరీని క్రియేట్ చేసినట్లే...
సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అస్సలు సీటు వస్తుందో లేదో చివరకు అనుమానంగానే అధినాయకత్వం వ్యవహరించింది. ఎందుకంటే మూడుసార్లు వరసగా ఓటమిపాలయిన వారికి ఇవ్వరన్న నిబంధనతో సోమిరెడ్డికి టిక్కెట్ దక్కదేమోనని అనుకున్నారు. సోమిరెడ్డి కూడా నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ అక్కడ కోటంరెడ్డి వైసీపీ నుంచి రావడంతో చివరి నిమిషంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి టిక్కెట్ దక్కింది. కానీ ఈ ఎన్నికల్లో సోమిరెడ్డి ఆఖరు సారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారనే చెప్పాలి. ఈసారి గెలిస్తే ఓకే. లేకుంటే మాత్రం ఇక భవిష్యత్ లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి టిక్కెట్ ను సర్వేపల్లిలో కేటాయించే అవకాశముండదు. ఆయన పోటీ చేసే ఛాన్స్ కూడా ఉండదు. మరి చివరకు ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.
Next Story